సామాజిక న్యాయమేదీ?
♦ కేంద్రం తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు
♦ ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధిహామీ కింద పనిచేసిన రైతులకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవటంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఈ పథకం కింద ఇవాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడింది. నిధులతో పాటు ఆలస్యానికి రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారం అందించాలని జస్టిస్ ఎంబీ లోకుర్, ఎన్వీ రమణల ధర్మాసనం ఆదేశించింది. నిధుల కొరత ఉందనే కారణంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోలేదనిసుతిమెత్తగా హెచ్చరించింది.
జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)ప్రభావవంతంగా అమలుచేసేందుకు కమిషనర్లను నియమించుకోవాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు ఉపాధి హామీ చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రీయ ఉద్యోగ ఉపాధి కౌన్సిల్‌ను ఏర్పాటుచేసుకుని కరువు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని, అక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవంతా కొనసాగించాలని ఆదేశించింది. అయితే తన ఆదేశాల అమలుకు కోర్టు కమిషనర్‌ల నియామకానికి విముఖత తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 1న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కరువుప్రాంతాల్లో ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవతీసుకోవాలని సూచించింది.