పాత తప్పులు మళ్లీ చేయొద్దు
కరువుపై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఇల్లు కాలుతున్నప్పుడే బావి తవ్వే విధంగా కరువు పరిస్థితులపై వ్యవహరించొద్దని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కరువును ఎదుర్కోవడంలో గతేడాది చేసిన తప్పులను మళ్లీ చేయొద్దని, ఈ ఏడాది కరువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అనేక జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని, ప్రభుత్వం వేగంగా స్పందించకుంటే గతేడాది నెలకొన్న పరిస్థితులే ఉత్పన్నమయ్యే అవకాశముందని హెచ్చరించింది.
గతేడాది కరువు బారినపడిన ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల రైతుల దుస్థితిపై స్వరాజ్ అభియాన్ సంస్థ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.బి.లోకూర్, జస్టిస్ ఎన్.వి.రమణల బెంచ్ బుధవారం విచారించింది. కరువుపై కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. నిఫుణుల సలహాలు, సిఫార్సులను అనుసరించి కరువు మ్యాన్యువల్‌ను సవరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కరువు బాధిత రాష్ట్రాలకు ధాన్యాలను పంపించాలంటూ తామిచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉల్లంఘించడం చిన్న విషయం కాదని హెచ్చరించింది. నష్టపోయినప్పుడు నిధులు విడుదల చేయడం మినహా గుర్తించదగ్గ మార్పులేవీ రాలేదని మండిపడింది. ఈ విషయంలో వ్యవస్థ దారుణంగా విఫలమైందని, పార్లమెంట్ చేసిన సూచనలు గానీ, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు గానీ ఏవీ కూడా అమలుకు నోచుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.