'కోర్టులో కూర్చుంది పశువులనుకుంటున్నారా?'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేమేమైనా పనికిరాని వాళ్లమా అంటూ మండిపడింది. కరువు పరిస్థితిపై తీసుకున్న చర్యలు వివరించేందుకు కేంద్రం తరుపున న్యాయవాది విఫలమవడమే కాకుండా తమకు మరింత గడువు కావాలని కోరడంతో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చిర్రెత్తిపోయింది.'చేసే పనిలో, సమస్య తీవ్రత తెలుసుకోవడంలో సీరియస్నెస్ చూపించండి... మేం పనికిరాని వాళ్లమని మీ ఉద్దేశమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఇదంతా(కోర్టులో ఉన్న సమూహాన్ని ఉద్దేశిస్తూ..) మీ కళ్లకు ఒక పశువుల మందలాగా కనిపిస్తుందా లేక ఇంకేదైననా? ఇక్కడికి అక్కడికి వెళ్లడానికి. ఇది మీకు నచ్చినట్లు చేసే అంశంకాదు.. ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు కూర్చున్నారు. మీరు మా నుంచి ఏదో ఆశించాల్సిందిపోయి ఏం చేయకుండా మా ముఖాలు చూస్తూ సమయం వృధా చేయడం దేనికి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వచ్చి తాను వాదనలు వినిపించేందుకు సిద్ధమని అన్నారు.
దీంతో పావుగంటలో వాదనలు వినిపించి వెళ్లిపోవాలని ధర్మాసనం తెలిపింది. కోర్టు సమయం చాలా విలువైనదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ కు చెందిన సంస్థ కరువు దుస్థితిని కోర్టుకు వివరిస్తూ దీని నివారణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియజేయాలని కోర్టు ద్వారా కోరారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రాన్ని కోరినా అలసటత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 12 రాష్ట్రాలు కరువు భారిన పడ్డాయంటే సమస్యను అంత తేలికగా తీసిపారేయలేమని అభిప్రాయపడింది.