సాక్షి, ఖమ్మం: జనవరి చివరిలోగా నూతన ‘ఆహార భద్రత’ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో కార్యరూపం దాల్చలేదు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో జిల్లాలో మొత్తం 6,60,495 కార్డులు ఉండగా, ఇందులో 6,08,187 తెల్లకార్డులు, 51,163 కార్డులు అంత్యోదయ అన్నయోజన, 1,145 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత పథకం కింద ప్రస్తుతం 7,29,720 కార్డుల జారీకి అర్హులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 43,838 అంత్యోదయ అన్నయోజన కార్డులున్నాయి.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూపన్ల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే గతం కన్నా 69,225 కార్డులు పెరిగినట్లు అధికారులు చూపుతున్నా అనర్హుల పేరుతో వేలాది మంది అర్హులకు కోత పెట్టారు. ప్రధానంగా గతంలో అన్నపూర్ణ పథకం కింద 1,145 కార్డులుంటే వీరికి సరుకుల పంపిణీ నిలిపివేశారు. సాధారణ పంపిణీలో వీరిని కూడా అర్హులుగా చూపుతుండడం గమనార్హం. అలాగే అంత్యోదయ అర్హులను గతంతో పోల్చి తే ప్రస్తుతం 7,425 మందిని తొలగించారు.
నిబంధనల పేరుతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ నిలిపివేయడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఆదాయ, భూ పరిమితి పెంచినా లబ్ధిదారుల సంఖ్య మాత్రం ఎక్కువగా పెరగలేదు. పింఛన్ల మాదిరిగానే ఆహార భద్రత కార్డుల సర్వే కూడా తప్పుల తడకగా సాగిందని లబ్ధిదారులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో రేషన్ అందేదని, ఇప్పుడు అసలు మూడు నెలలుగా కూపన్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అరుుతే వారికి సమాధానం చెప్పేవారేలేరు.
సరుకులకు కోత..
ఈ నెలలో ఉగాదితో పాటు శ్రీరామ నవమి పండుగలు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కింద బియ్యం, కిరోసిన్, చక్కెర, చింతపండు, గోధుమలు, పామోలిన్ పంపిణీ చేయాలి. ప్రతి కార్డు లబ్ధిదారునికి కేజీ వరకు పామోలిన్ ఇవ్వాలి. కానీ జనవరి నుంచి జిల్లాలో పామోలిన్ పంపిణీ నిలిచిపోయింది. అధికారులేమో ప్రభుత్వం నుంచి సరఫరా రావడం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక చింతపండు, కారం నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోవడం లేదు. బహిరంగ మార్కెట్‌లో పామోలిన్, కారం, చింతపండు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నుంచి పామోలిన్ సరఫరా లేక పోగా, సరఫరా అవుతున్న సరుకులు నాణ్యతగా లేకపోవడంతో లబ్ధిదారుల బాధ వర్ణనాతీతం.
ఇదిలా ఉంటే కార్డుల పంపిణీ లేకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఆహార భద్రత కార్డుల పరిశీలనతో సంబంధం లేకుండా రేషన్ సరఫరా చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇలానే పింఛన్ దరఖాస్తుల సమయంలోనూ అధికారులు మాటలు చెప్పారని, ఆతర్వాత రెండు నెలలుగా పింఛన్ నిలిపివేశారని, ఇప్పుడు రేషన్ బియ్యం ఇలాగే పంపిణీ చేయరేమోనని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అయినా కార్డులు పంపిణీ చేస్తారా..? అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా అనర్హతకు గురైన కొంతమంది లబ్ధిదారులకు కార్డులు ఇప్పిస్తామంటూ దళారులు జిల్లాలో దందా కొనసాగిస్తున్నారు. తమకు మండల స్థాయి అధికారులు పరిచయమంటూ రూ.2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తూ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. గతంలోనూ ఇలా ఆరోపణలు రావడంతో జిల్లా స్థాయి అధికారులు తీవ్రంగా హెచ్చరించినా పరిస్థితి మారలేదు. ఇప్పటి వరకు కూపన్లు అందని వారు ఈ రకంగా దళారులను నమ్మిమోసపోతున్నారు.
అ‘భద్రత’ !
Published Sat, Mar 14 2015 2:55 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement