సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ అన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆండ్రియాస్ ఇస్టా సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో తనను కలిసిన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో విత్తన నాణ్యతే ప్రధానమని ఆయన అన్నారు. అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన విత్తనాలు అందిం చేలా నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఇది ఒకరకంగా సీడ్ పాస్‌పోర్టు లాంటిదన్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో ఇస్టా సర్టిఫికేషన్ కీలకమని చెప్పారు. అమెరికా, యూరప్ తదితర 80 దేశాల్లో విత్తన రవాణా, అంతర్జాతీయ విత్తన వ్యాపారానికి ఇస్టా సర్టిఫికెట్ అవసరమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే వాటికి సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఏటా 2 లక్షల సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఇస్టా అధ్యక్ష ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి వార్షిక సమావేశాల్లో మాత్రమే జరుగుతాయన్నారు. అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతర్జాతీయం గా సభ్యత్వం ఉన్న దేశాల సభ్యులు ఇస్టా ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎన్నికల్లో భారతదేశానికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఇస్టాలో కీలకస్థానంలో ఉన్న తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులుకు సముచిత స్థానం ఇస్తారా అని ప్రశ్నించగా, వచ్చే నెల మూడున జరిగే ఎన్నికల వరకు ఆగాలని ఆయన బదులిచ్చారు.
సరైన విత్తనాలులేకే ఆత్మహత్యలు
నాణ్యత, విత్తన జెర్మినేషన్ ఉండే హైక్వాలిటీ విత్తనా లకే అనుమతిస్తామని, ప్రభుత్వ ల్యాబ్‌లు, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏ దేశానికైనా వాతావరణం అనుకూలించడంతో పాటు విత్తన పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలు అవసరమన్నారు. 150 ఏళ్ల క్రితమే జర్మనీలో విత్తనాల పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారన్నారు. మంచి నాణ్యమైన విత్తనాలు వినియోగిస్తేనే పంట దిగుబడి వస్తుంది. సరైన విత్తనాలు వినియోగించక పోవడం వల్ల ఇండియాలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే నాణ్యమైన విత్తనాలు అందించాలి. విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు అందించడం ద్వారా రైతులను రక్షించుకోవాలి. కొత్త వంగడాలు అందించాలి. వాతావరణ, పర్యావరణ మార్పులు ఇక్కడి రైతుల జీవన విధానంపై ప్రభా వం చూపుతాయన్నారు. రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి పండించినా సరైన దిగుబడులు రాక నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందన్నారు.
ప్రత్యేక వ్యవసాయ విధానం అవసరం...
‘విత్తనాల ఉత్పత్తిలో ప్రత్యేక విధానాలను అవలంబించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలి. నీటి వినియోగం, వనరులు, భూసార పరీక్షలు అందుబాటులో ఉండాలి. వర్సిటీలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రూపొందించాలి. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు. రెట్టింపు దిగుబడి సాధించే విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడి రైతులు పంట పండించడానికి కష్టపడుతున్నారు. హైక్వాలిటీ విత్తనాల ద్వారానే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించి రైతులకు తోడ్పడా లి. విత్తన రంగంలో ఏ విత్తనాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వాలకు, రైతులకు వివరించి ఆహార భద్రతపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యం’ అని ఆండ్రియాస్ అన్నారు.
నాణ్యమైన విత్తనోత్పత్తే ‘ఇస్టా’ లక్ష్యం
Published Thu, Jun 27 2019 3:11 AM | Last Updated on Thu, Jun 27 2019 3:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment