‘అన్నపూర్ణ’కు అప్రతిష్ట
ఆంధ్రప్రదేశ్
► రాజధానికి భూ సమీకరణపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఉద్యమకారుడు అన్నాహజారే ఘాటు లేఖ
► రెండు మూడు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తారా?
► ఇది దేశ ఆహారభద్రతకు పెను ముప్పుగా పరిణమించదా?
► ఒత్తిడి తెచ్చి భూములు సమీకరించినట్టు వెల్లడైంది
► త్వరలో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తా
హైదరాబాద్: దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తేవొద్దని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఏడాదికి రెండు మూడు పంటలు పండే భూములను తీసుకుంటే దేశ ఆహార భద్రతకు తూట్లు పొడిచినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. రైతులెవరూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్న సంగతి వెల్లడైందని, బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరించడంతోనే వారు ప్రభుత్వానికి భూములిచ్చినట్టు తేటతెల్లమైందని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు వాటిని తిరిగి తమకు అప్పగించాలని కోరుతున్నారని, అందువల్ల వారికి తక్షణం ఆ భూములను అప్పగించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. పంట భూముల పరిరక్షణకోసం రైతులకు దన్నుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తానని అన్నాహజారే అందులో తెలిపారు. అన్నాహజారే లేఖలో పేర్కొన్న అంశాలివీ...
‘‘రాష్ట్ర విభజన బాధాకరమే. ఆర్థికలోటులో ఆంధ్రప్రదేశ్ ఉందన్నది నాకు తెలుసు. రాష్ట్రం ఆర్థిక లోటును తొందరలోనే అధిగమిస్తుందని భావిస్తున్నా. రాజధాని నగరం నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను అధికారులు రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి సమీకరించారంటూ కొందరు నాకు వినతిపత్రాలను పంపారు. రెండు మూడు పంటలు పండే భూములను పరిరక్షించాలని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరుంది. ఆ భూములను సేకరించడం ద్వారా అన్నపూర్ణ అనే పేరున్న రాష్ట్రానికి అప్రతిష్ట తేవొద్దు. రాజధాని ప్రాంత గ్రామాల్లో సామాజిక ఉద్యమకారులు పీవీ రాజగోపాల్, స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, ఎంజీ దేవసహాయం వంటి వారు ఎంతోమంది పర్యటించారు. వేలాదిమంది రైతులతో వారు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఏ ఒక్క రైతూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్నది వారి పర్యటనల్లో వెల్లడైంది. భూ సమీకరణకు అంగీకరించకపోతే బలవంతంగానైనా భూసేకరణ చేస్తామని అధికారులు బెదిరించడంతోనే రైతులు భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అప్పట్లో ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు తమ భూములు తమకు అప్పగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ రైతులకు తక్షణమే భూములను అప్పగించండి. పారిశ్రామికీకరణకు.. అభివృద్ధికి నేను వ్యతిరేకమనుకుంటే తప్పు. వ్యవసాయయోగ్యం కాని భూముల్లో రాజధాని నగరం నిర్మించండి. బంజరు భూముల్లోనే పరిశ్రమలను స్థాపించండి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయయోగ్యం కాని భూములను తక్షణమే వర్గీకరించండి.
ఆహార భద్రత దృష్ట్యా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించవద్దు. పాలేకర్ సూచించిన రీతిలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అమలుచేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని రాజధాని నగరాన్ని నిర్మించండి. నేను త్వరలోనే రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తా. రైతులు, రైతు కూలీలతో సమావేశమవుతా. నేను సూచించిన సలహాలను పాటిస్తారని భావిస్తున్నా’’ అని అన్నాహజారే తన లేఖలో పేర్కొన్నారు.