
కొత్త కార్డులపై ‘రూపాయి’ ఎఫెక్ట్!
* ఆహార భద్రతా కార్డుల జారీలో మరింత జాప్యం
* ప్రభుత్వ ధరకన్నా రూపాయి అధికంగా టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు
* తగ్గించాలని నెల రోజులుగా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం మంతనాలు
* సఫలీకృతం కాక ఆగిన ప్రక్రియ, జనవరికి కొత్తకార్డులు డౌటే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా జారీ చేయదలిచిన గులాబీ రంగు రేషన్ కార్డుల జారీపై ‘రూపాయి’ ఎఫెక్ట్ పడింది. ఒక్కో కార్డుపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా కాంట్రాక్టర్లు రూపాయి అధికంగా టెండర్లు దాఖలు చేయడంతో ప్రక్రియలో సందిగ్ధం నెలకొంది.
రూపాయి తగ్గించి కార్డుల జారీ ప్రక్రియకు పూనుకోవాలని కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా అవి సఫలీకృతం కాకపోవడంతో జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే ఆలస్యమైన కార్డులను వచ్చే జనవరి నుంచైనా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో అది సాధ్యపడేలా లేదు.
ప్రభుత్వ రేటు రూ. 5, కాంట్రాక్టర్ల రేటు రూ. 6
రాష్ట్రంలో రేషన్ కార్డులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ, బోగస్ కార్డుల ఏరివేత తర్వాత మొత్తంగా 2.82 కోట్ల మంది ఆహార భద్రతా కార్డులకు అర్హులని ప్రభుత్వం తేల్చింది. సుమారు 98 లక్షల కుటుంబాలు ఆహార భద్రత చట్టం కిందకు వస్తాయని గుర్తించింది. వీరందరికీ గతంలో మాదిరి లామినేషన్ చేసిన కార్డును కాకుండా యూవిక్ పేపర్‌తో కూడిన కార్డును లబ్ధిదారులకు అందజేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.
లామినేషన్ కార్డుతో పోలీస్తే దీని ఖర్చు చాలా తక్కువగా ఉంటుం దని, వినియోగం సైతం సులభమని శాఖ చెబుతోంది. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా తగలబడదు. నీటిలోనూ తడవదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా సులభంగా చేసుకోవచ్చు. పాత కార్డుల తయారీకి ఒక్కింటికీ రూ.14 మేర ఖర్చవగా, ప్రస్తుత కార్డు తయారీకి రూ.4 నుంచి రూ.5 కి మించ కుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఈ కార్డుల జారీకి గత నెలలోనే టెండర్లకు పిలవగా ఆరుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరే బరిలో నిలిచారు. ఆ ఇద్దరు సైతం ప్రభుత్వం అనుకున్న ధరకన్నా రూపాయి ఎక్కువగా రూ. 6కు టెండర్ దాఖలు చేశారు. 98 లక్షల కుటుంబాలకు కార్డులు జారీ చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా మరో రూ.కోటి వరకు అదనంగా పడే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో కార్డుల ధర తగ్గించుకోవాలని రూ. 5కే కార్డుల టెండర్ తీసుకోవాలని నెల రోజులుగా కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నా అది సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కొత్త కార్డుల జారీ అసాధ్యమని, మార్చిలోనే ఈ ప్రక్రియ ఉండనుందని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి నెలా పేదలపై రూ. 10 భారం
ఆహార భద్రతా కార్డులు జారీ చేయకపోవడంతో పేదలపై ప్రతి నెలా రూ. 10ల చొప్పున అదనపు భారం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం పాత కార్డులు రద్దు చేసి ఆహార భద్రతా పథకం కింద కొత్త కార్డులను మంజూరు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో డేటా వివరాలను పొందుపరిచి చేతులు దులుపుకొంది. ప్రతినెలా ఆన్‌లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని సమర్పిస్తే తప్ప రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఏడాదిగా ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్లి డేటా స్లిప్ కోసం రూ. 10 చెల్లిస్తూనే ఉన్నారు.