‘సర్వర్ డౌన్’ తిప్పలు!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డుల కోసం కొత్త దరఖాస్తుల నమోదు బాధ్యత మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక నేరుగా సర్కిల్ కార్యాలయాల్లో కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ పూర్తిగా నిలిపివేసింది. మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ సర్వర్ మొరాయిస్తుండటంతో పాటు పూర్తి స్థాయి డేటా అప్‌డేట్ లేక దరఖాస్తుల అప్‌లోడ్ పెండింగ్‌లో పడిపోతున్నాయని పేదలు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది.
వాటి స్థానంలో కొత్తగా దరఖాస్తులు స్వీకరించి ఆహార భద్రత కార్డులను మంజూరు చేసింది. గతేడాది కాలంగా పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డులు లేని పేద కుటుంబాల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తూ అధార్ కార్డులను పరిగణలోకి తీసుకొని అర్హులకు ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తూ వస్తున్నారు. పౌరసరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల్లో నేరుగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు, మంజూరైన కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణలకు వెసులుబాటు ఉండటంతో ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి కొత్త దరఖాస్తులు, కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణల కోసం ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత మీ సేవ కు అప్పగించింది.
కనిపించని డేటా....
మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ సర్వర్ మొరాయించడం కొత్త దరఖాస్తుల నమోదుకు ప్రధాన సమస్యగా తయారైంది. మరోవైపు ఆన్‌లైన్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అప్‌డేట్ లేకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తులు నమోదు కోసం కొన్ని అప్షన్స్‌కు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అప్‌డేట్ లేకుండా పోయింది.
దరఖాస్తుదారుడి చిరునామాను బట్టి ఆ ప్రాంతానికి ఏ షాపు నంబర్ వర్తిస్తుందో స్పష్టంగా పొందుపర్చలేదు. లబ్ధిదారుడే తెలుసుకొని వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు సబంధించిన గ్యాస్ ఏజెన్సీ పేర్లు ఆప్షన్‌లో కనిపించక పోవడంతో అప్‌లోడ్ సమస్య తలెత్తుతోంది.
బాదుడు...
మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొత్త రేషన్ కార్డుల నమోదు కోసం పేదలను బాదేస్తున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం కొత్త కార్డుల కోసం దరఖాస్తును నమోదు చేసేందుకు కేవలం రూ.35 లు ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ దరఖాస్తుదారుల అమాయకత్వాన్ని బట్టి కనీసం రూ.75 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
కొత్తగా ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, అడ్రస్‌ప్రూఫ్, సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన కుటుంబాలకు కార్డులను మంజూరు చేస్తాం. కార్డుల కోసం మధ్య దళారులను ఆశ్ర యించవద్దు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని సర్కిల్ కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. అర్హులకు తప్పకుండా కార్డులు మంజూరు చేస్తాం. - రాథోడ్, డీఎస్‌ఓ, హైదరాబాద్