లాక్‌డౌన్ వల్ల పలు రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఏపీలోని భారత ఆహార సంస్థ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీరుస్తున్నారు. రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని కేరళ,కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్‌కు పంపించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది.
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ వేళ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోంది. ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రత్యేక గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీర్చడంలో మన రాష్ట్రం కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 116 గూడ్స్ రైళ్ల ద్వారా పంపించినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ చెప్పారు. అండమాన్, నికోబార్ దీవులకు కూడా కొంతమేర బియ్యం పంపించామన్నారు.
విపత్తు వేళ ఆకలి తీరుస్తూ..
► కరోనా విపత్తును ఎదుర్కోవడంలో భాగంగా.. పేదల కడుపు నింపేందుకు అవసరమైన బియ్యం ఏ రాష్ట్రానికి అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా గుర్తించింది.
► ఆయా రాష్ట్రాలకు ఏ మేరకు బియ్యం అవసరమనేది అంచనా వేసి మన రాష్ట్రం నుంచి యుద్ధప్రాతిపదికన తరలించింది.
► రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకు 3.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు. వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు కోరితే సబ్సిడీపై బియ్యం ఇస్తారు.
ధాన్యం సేకరణకూ ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
► ఆహార కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా ఖరీఫ్‌లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎఫ్‌సీఐతో కలిసి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించింది.
► రబీ సీజన్‌లో 25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్ర సివిల్ సప్లైస్, ఎఫ్‌సీఐ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన సివిల్ సప్లైస్ సంస్థ ధాన్యం సేకరణను మరింత ముమ్మరం చేసింది.
► రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తగా తగినన్ని బియ్యం నిల్వలను కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉంచింది. 3రాష్ట్రంలోని పేదలు ఆహారానికి ఇబ్బంది పడకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెలలో 3 విడతలుగా సరుకులను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు.
► రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడినప్పటికీ 1.48 కోట్ల పేద కుటుంబాలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment