తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రజలకు ఆహార భద్ర తా కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం
భువనగిరి : తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రజలకు ఆహార భద్ర తా కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు జరిగాక నూతనంగా ఆహార భద్రతా కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి ప్రస్తుతం రేషన్ సరుకులను పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో అనర్హులు ఉన్నారని, అసలైన అర్హులకు కార్డులు అందలేదని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు, ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో మరోసారి చివరి దశగా విచారణ ప్రారంభించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు కార్డుల పరిశీలన చేపట్టారు. సమగ్రకుటుంబ సర్వే ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 9,91,285 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 29.03,54 లక్షల యూనిట్లు ఉన్నాయి.ఆహార భద్రతా కార్డులతో పాటు అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు కలిపి ప్రతినెలా 18 వేల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు కిరోసిన్, అడపా దడపా చక్కెర ఇస్తున్నారు. అయితే గత మార్చి నుంచి ఆహార భద్రతా కార్డులు లేకుండానే గుర్తించిన లబ్ధిదారులకు రేషన్ దుకాణాల్లో బియ్యం ఇస్తున్నారు. వీరికి పర్మనెంట్‌గా కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సివిల్ సప్లయ్ అధికారులు పక్కాగా సర్వే ప్రారంభించారు.
20 శాతం అనర్హులు ఉన్నారట..
ప్రస్తుతం మంజూరైన లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులకు ఆహార భద్రతా కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. నేరడుచర్ల మండలంలో సుమారు 200 కార్డులు ఉద్యోగులకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించి వాటిని రద్దు చేశారు. ఇలా ఇంకా జిల్లాలో పలు మండలాల్లో ఉన్నాయన్న ఫిర్యాదు లు ఉన్నాయి. మరో వైపు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఆహార భద్రతా కార్డుల్లో చోటు లభించలేదు.
ప్రభుత్వం పథకాలైన గృహనిర్మాణం, ఆసరా పింఛన్, అంగన్‌వాడీకేంద్రాల్లో లబ్ధి ఇలా పలు సంక్షేమ పథకాల్లో ఉన్నప్పటికీ వారికి ఆహార భద్రతా కార్డులు రాలేదు. ఆలాంటివారిని గుర్తించి వారికి కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కారు, లారీలు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారి పేర్లను తొలగించాలని నిర్ణయించారు. నిబంధనలకు మించి వ్యవసాయ భూములు ఉన్నవారిని గుర్తించి వారి పేర్లను తొలగించే కసరత్తు ప్రారంభించారు. వీటితో పాటు కార్డుల్లో ప్రస్తుతం ఉన్న పేర్లు, ఇంటి చిరునామా తప్పులేకుండా సరిచేస్తున్నారు.
చివరిసారిగా సరిచూస్తున్నారు
జూన్ 1 నుంచి ప్రభుత్వలోగోతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మండలాల్లో తహసీల్దార్‌లు, డీటీలు, వీఆర్‌ఓలు, డీలర్లు కలిసి లబ్ధిదారులు, కార్డుల్లో తప్పులు, అర్హత ఉండి రాని వారు, అనర్హులకు వచ్చిన విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈనెల 16లోగా సర్వే పూర్తి చేసి డాటాను అప్పగిస్తే కార్డుల ముద్రణ ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.