మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్ రూపంలో పోత్సహిస్తోంది. ప్రస్తుతం వారికి ఉన్న 3శాతం రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఎక్కడా అమలు కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 5 శాతానికి తీసుకున్న నిర్ణయంతో వికలాంగులకు ఎంతో మేలు కలగనుంది.
జిల్లాలోని 61 వేల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. 2016 వికలాంగుల చట్టం ప్రకారం 5శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. వివిధ పథకాల్లో 61వేల మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 22,852 మంది ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పింఛన్ నెలకు రూ.1500 చొప్పున పొందుతున్నారు. జిల్లాల విభజన అనంతరం ఇప్పటి వరకు 275 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్దిపొందారు. వివిధ కార్పొరేషన్ల నుంచి 81 మంది రుణాలు తీసుకున్నారు. దాదాపు 81 మంది ట్రై సైకిళ్లు, 22మంది వీల్‌చైర్స్‌ను అందుకున్నారు. వారంలో ప్రతి మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఇప్పటి దాక 48,480 మంది హాజరు అయ్యారు. ఇందులో 47,881 మందిని వికలత్వ పరీక్ష నిర్వహంచగా వారిలో 31,952 మంది అర్హత సాధించారు. ప్రభుత్వాలు 7 కేటగిరీల్లో వారి వైకల్య శాతాన్ని పరిగణలోకి తీసుకుని సంక్షేమంలో పాధాన్యమిస్తున్నాయి.
భరోసా ఇచ్చిన 2016 చట్టం
1995లో వికలాంగుల కోసం చట్టం చేసినా అది అమలుకు నోచుకోలేదు. ఐక్యరాజ్య సమితి తెచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 2007లో యూఎన్‌సీ ఆర్‌పీడీ డిక్లరేషన్‌పై కేంద్ర ప్రభుత్వం 2014లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. వివిధ కారణాల దృష్ట్యా ఆ బిల్లు రాజ్యసభలో ఆగిపోయింది. 2016లో వివిధ జాతీయ వికలాంగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో 2016 డిసెంబర్‌లో చట్టం తెచ్చారు. ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలను కచ్చితంగా అమలు చేస్తే వికలాంగులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది.
అమలుకు చర్యలు
జిల్లాలోని వికలాంగులకు ప్రభుత్వం పెం చిన 5 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూస్తాం. ఇటు ఉద్యోగాల భర్తీ, అటు సంక్షేమ పథకాల్లో, డబుల్ బెడ్‌రూం ఇళ్లలోనూ 5 శాతం వికలాంగులకు కచ్చితంగా వచ్చేలా ఆ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిం చి న్యాయం జరిగేలా చూస్తాం.
– జి.శంకరాచారి, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి
ప్రభుత్వ నిర్ణయం మాకు వరం
దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇప్పుడున్న కోటాను సర్కార్ పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం నిజంగా మాకు వరం లాంటిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ కల ఇప్పుడు నెరవేరనుంది.
– ఎ.నరేందర్, ఎల్‌ఎల్‌సీ సభ్యుడు
రుణపడి ఉంటాం
5శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం హర్షణీయం. ఇది మాకు ఎంతగానో దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వుం మా పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిది. పెంచిన కోటా తప్పకుండా అమలు చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– టి.మధుబాబు, ఎన్‌పీఆర్‌టీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment