సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అర్హులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాం గం సమాయత్తమవుతోంది. దర ఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపుగా పూర్తికావడంతో అర్హుల తుది జాబితాను సిద్ధం చేస్తోంది.
ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త పింఛన్ల జారీకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన నేపథ్యంలో అందుకనుగుణంగా నియోజకవర్గాల వారీగా తేదీలను ఖరారు చేసింది. ‘ఆసరా’ పేరిట జారీచేస్తున్న పింఛన్లను ఈ నెల 8, 9వ తేదీల్లో అర్హులకు అందజేయనున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. గురువారం నుంచి ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
8న రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, 9న ఉప్పల్, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి లాంఛనంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడతారని చెప్పారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగానే పింఛన్‌దారులకు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు.
ఈ నెల 11 నుంచి 15వరకు గ్రామాలవారీగా పింఛన్ల పంపిణీకి సంబంధించిన ప్రణాళికను ఖరారు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ల సమక్షంలో పింఛన్లను అందజేయాలని, పింఛన్ల పంపిణీ సమయంలో అర్హులు ఉంటే దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. వీరి జాబితాను అప్‌డేట్ చేసి జాబితాను తమకు పంపాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, డీఆర్‌ఓ సుర్యారావు తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లను ఆదే శించారు. పెన్షన్లకు సంబంధించిన డేటా ఎంట్రీ, పంపిణీ విధివిధానాలపై గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా ఎంట్రీ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌దారులకు పచ్చరంగు, వితంతు పింఛన్‌దారులకు ఊదా రంగు, చేనేత, కల్లుగీత కార్మికులకు గులాబీ రంగు కార్డుల పంపణీకి శ్రీకారం చుట్టిందని వివరించారు. శనివారంతో ప్రారంభించి 15వ తేదీ లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతి వార్డులో స్థానిక కార్పొరేటర్, వార్డు అధికారి, మురికి వాడల సంక్షేమ సంఘాల సభ్యుడితోపాటు ఎస్సీ, ఎస్టీ వార్డు సభ్యులతో కలిపి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ అనంతరం కమిటీ సభ్యుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ చంపాలాల్, డ్వామా పీడీ చంద్రకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచే కొత్త పింఛన్లు
Published Thu, Nov 6 2014 11:27 PM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement