సమస్తం..‘ఆధార’మే
అక్రమాల చెక్‌కు నివారణోపాయం
చేవెళ్ల: మీవద్ద ఎన్ని గుర్తింపు కార్డులున్నా అవి అంతగా ప్రాధాన్యం లేనివే కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డుయే లింకు కాబోతుంది.ప్రభుత్వ పథకాలలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అర్హులైన వారికే ప్రయోజనాలను అందించడానికి, దళారుల వ్యవస్థనుంచి లబ్ధిదారులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లకు ఈ ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా ఓటరు గుర్తింపు కార్డులతో కూడా లిం కు పెట్టబోతున్నారు.
ఓటరు కార్డులతో ఆధార్‌ను లింకుచేస్తే బోగస్ ఓటర్లను అవలీలగా తొలగించే వీలున్నందున ముందుగా సైబరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీల నుంచి ఆధార్ కార్డులతో పాటుగా వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. వీటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానం ద్వారా కూలీలకు, పింఛన్‌దారులకు ఇక నుంచి పోస్టాఫీసు, బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుని నెంబరును ఆధార్‌కార్డుతో లింకుచేసి నగదు బదిలీ పథకం ద్వారా సబ్సీడీని నేరుగా బ్యాంకు ఖాతాలో వేయడం తప్పనిసరి చేయబోతోంది.
ఉపాధి పైసలకు భరోసా...
నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉపాధి పనులను ఏటా చేపడుతున్నారు. చేవెళ్ల మండలంలోనే 11,900 మందికి పైగా జాబ్‌కార్డుదారులున్నారు. షాబాద్, నవాబుపేట మండలాల్లో సైతం ఉపాధి కూలీలు అధికంగా ఉన్నారు. ఏటా రూ. కోట్లు విలువ చేసే పనులను ఉపాధిహామీ పథకంలో చేపడుతున్నారు. మేట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు అక్రమాలకు పాల్పడుతుండటం వల్ల కూలీలకు చెల్లింపుల్లో అన్యాయం జరిగేది. దీంతో ఆధార్‌తో అనుసంధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఆధార్ సీడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
పింఛను లబ్ధిదారులకు సైతం..
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభయహస్తం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కలిపి సుమారుగా 19 వేల వరకు ఉన్నాయి.బోగస్ పేర్లతో పలువురు పింఛన్ అందుకుంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి బోగస్‌ల అడ్డుకట్టకు చేపడుతున్న ఆధార్, బ్యాంకు ఖాతా నమోదుతో పింఛన్‌దారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా చేరనుంది.
బోగస్‌రేషన్ కార్డుల గుర్తింపులో ప్రధాన పాత్ర..
ఆధార్ అనుసంధానంతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతకు మార్గం సులభతరమైందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం రేషన్‌కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న బోగస్ రేషన్‌కార్డులను గుర్తించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరిన్ని బోగస్ కార్డులను ఏరి వేయడానికి వీలవుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.