Identity cards
-
కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన ట్రాన్స్జెండర్లకు గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని ఏడీ కార్యాలయంలో శుక్రవారం ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపుకార్డులు అందజేశామని, ఇంకా అర్హులుంటే తమ వివరాలతో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తు అందజేయాలని కోరారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్!
రేషన్‌కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటీ ఐడీ కార్డ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌లో అడ్రస్ సహా ఎమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్ డేట్ చేస్తే మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్ వివరాలు అప్డేట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డ్‌తో ఆటో అప్డేట్ ఎలా సాధ్యం? ప్రధానంగా పైన పేర్కొన్నట్లుగా ప్రభుత్వ ఐడీ కార్డ్‌లను డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్‌లో ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్‌లలో డేటా సైతం అటోఅప్డేట్ అవుతుంది. ప్రస్తుతం, ఈ ఆటో అప్డేట్పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్ ఆటో అప్డేట్ విధానం అమల్లోకి రానుంది. ఆటో అప్డేట్ సిస్టమ్ ప్రయోజనాలు ఆధార్ ద్వారా డిజిలాకర్‌లో ఉన్న ఐడెంటిటీ కార్డ్‌లను ఆటో అప్డేట్ చేయడం ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల సమయం, ఖర్చుల తగ్గింపుతో పాటు ఫేక్ ఐడీ కార్డ్‌ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కారణంగా తరచు ప్రాంతాలు మారే వారికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, గత నెలలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
రూ.2 లక్షల బీమా.. ఐడీ కార్డు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించనున్నారు. సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ అనుమతి తీసుకుని ఈ సౌకర్యాన్ని కల్పించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకోగా, ఫొటో, ఇతర సమాచారంతో సభ్యత్వం ఇచ్చేలా టీపీసీసీ డేటా అనలిటికల్ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ పార్టీలో సభ్యత్వం మాత్రం శాశ్వతం’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సభ్యత్వం ఉన్నవారికి సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదుపై ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల పార్టీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్డు కాదు.. గౌరవం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే కేవలం కార్డు మాత్రమే కాదని, అది ఒక గౌరవమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ సూచనలకు అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించామని, కార్యకర్తలు, నేతలందరూ షెడ్యూల్ ప్రకారం సభ్యత్వాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు
సాక్షి, మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఐడీ (గుర్తింపు కార్డులు) కార్డులు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆర్ఎఫ్ఐడీ కార్డులను ఇచ్చేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కసరత్తు చేస్తోంది. కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగానే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఈప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు సమగ్ర వివరాలను నివేదిస్తున్నారు. జిల్లాలోని 732 పాఠశాలల్లో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 2646 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా 117 మంది వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంది. వివరాల నమోదుకు అవకాశం 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం సేకరించగా డేటాఎంట్రీ ఆపరేటర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్ల ద్వారా యూడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్) నమూనాల్లో పొందుపరిచారు. ఉపాధ్యాయుల బ్లడ్‌గ్రూపు, నివాస సమాచారం జతచేయడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా తేడాలు ఉంటే వెబ్సైట్ ద్వారా వివరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా అలసత్వం చూపుతున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయుల వివరాల నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. కొన్ని జిల్లాలు వందశాతం నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 92.8శాతం మాత్రమే పూర్తయ్యింది. గుర్తింపుకార్డులో.. ఉపాధ్యాయులకు అందించే గుర్తింపుకార్డులో పూర్తి వివరాలు ఉండనున్నాయి. వారు ప్రధానంగా పనిచేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్కోడ్, హోదా, మొబైల్ నంబర్, ఎ క్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, నివాసం, ఉపాధ్యాయుడి కోడ్, పుట్టినతేదీ, రక్తం గ్రూపు, ఫొటో, తదితర వివరాలు గుర్తింపుకార్డులో పొందుపరుస్తారు. ఇదివరకు గుర్తింపు కార్డులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రభుత్వం మొదటి సారి గా గుర్తింపుకార్డులు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఆరు మండలాల్లో వందశాతం పూర్తి మంచిర్యాల జిల్లాలో 732 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. జన్నారం మండలంలో 65 పాఠశాలల్లో 245 మంది ఉపాధ్యాయులకు గాను 245 మంది వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి వందశాతం పూర్తి చేశారు. దండేపల్లి మండలంలోని 56 పాఠశాలల్లో 232 మంది, భీమినిలో 29 పాఠశాలల్లో 88 మంది, కన్నెపల్లిలో 36 పాఠశాలల్లో 107 మంది, వేమనపల్లిలో 32 పాఠశాలల్లో 85 మంది, నెన్నెలలో 33 పాఠశాలల్లో 141 మంది ఉపాధ్యాయులు వందశాతం తమ వివరాలు వెబ్సైట్లో నమోదు చేశారు. భీమారం, చెన్నూర్, మందమర్రి, మంచిర్యాల, హజీపూర్, లక్టెట్టిపేట్ మండలాల్లో పదిమందికి పైగా ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో ఉపాధ్యాయులు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సెక్టోరల్ అధికారి సప్థర్అలీ సూచించారు. -
ఆమెకు అప్ఘనిస్తాన్ తల వంచింది
సెప్టెంబర్ – 17 గురువారం అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అక్కడి ‘జనాభా నమోదు చట్టాన్ని’ సవరిస్తూ ఒక చరిత్రాత్మక సంతకం చేశారు. ఈ ఒక్క సంతకంతో అప్ఘనిస్తాన్‌లో ఇకపై ఆడవాళ్ల పేర్లు వినపడనున్నాయి. పిల్లల గుర్తింపు కార్డు మీద తల్లి పేరు కనపడనుంది. డాక్టర్ మందు చీటి మీద పేరు కనపడనుంది. చనిపోతే డెత్ సర్టిఫికెట్ మీద కూడా పేరు కనపడనుంది. స్త్రీ పేరును బయటకు చెప్పడం అమర్యాదగా భావించే ఆ దేశంలో గత మూడేళ్లుగా పోరాడి మార్పు తెచ్చిన స్త్రీ లాలె ఉస్మాని. ‘వేర్ ఈజ్ మై నేమ్’ పేరుతో ఆమె నడిపిన ఉద్యమమే ఇందుకు కారణం. అప్ఘనిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు మామూలు. ఒక మహిళకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుని దగ్గరకు వెళ్లింది. అతను పరీక్షలు చేసి ఆమెకు ‘కరోనా’ అని నిర్థారణ చేశాడు. ఆమె ఇంటికి వచ్చి భర్తకు మందు చీటి ఇచ్చి మందులు తెమ్మంది. అతడు దానిని చూసిన వెంటనే ఆమెను చావబాదటం మొదలెట్టాడు. కారణం ఆ మందు చీటి మీద ఆమె పేరు ఉంది. అక్కడ ఆమె పేరుకు బదులు ‘ఫలానా అతని భార్య’ అని ఉండాలి. ఎందుకంటే అప్ఘనిస్తాన్‌లో స్త్రీ పేరు బయటకు చెప్పడం తప్పు. నిషిద్ధం. భార్య తన పేరును డాక్టరుకు చెప్పడం భర్తకు నామోషీ. అందుకే ఈ బాదుడు. అప్ఘనిస్తాన్‌లో ఆడపిల్ల పుడితే చిన్నప్పుడు ‘ఫలానా అతని కుమార్తె’గా, వయసులోకి వచ్చాక ‘ఫలానా అతని భార్యగా’, వృద్ధురాలయ్యాక ‘ఫలానా అతని తల్లిగా’ బతికి చనిపోవాలి. అన్నట్టు అక్కడ డెత్ సర్టిఫికెట్ మీద కూడా ఆమె పేరు రాయరు. సమాధి ఫలకం మీద కూడా ఆమె పేరు రాయరు. అన్నిచోట్ల ఆమె ఉనికి ఆ ఇంటి మగవాడి పేరుతో ముడిపడి ఉంటుంది తప్ప ఆమె పేరుతో ముడిపడి ఉండదు. 2001కి ముందు అప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఏలుబడిలో స్త్రీల పరిస్థితి ఘోరంగా ఉంటే తాలిబన్ల పతనం తర్వాత ఏర్పడిన ప్రభుత్వ హయాముల్లో కూడా స్త్రీలు తమ కనీస హక్కు కోసం సుదీర్ఘంగా పోరాడుతూనే రావాల్సి వస్తోంది. విద్యా హక్కు కోసం, పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం వారు మెరుగైన విజయాలు సాధించినా ప్రతి స్త్రీ తమ సొంత కుటుంబంలోని పురుషుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, హింస చవిచూడాల్సి వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా కనీసం పేరు బయటకు రాని, చెప్పలేని పరిస్థితి ఉండటం అక్కడ హక్కుల కార్యకర్తలను పోరాటానికి దింపింది. ‘ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను’ అంటారు 25 ఏళ్ల లాలె ఉస్మాని. పశ్చిమ అఫ్ఘనిస్తాన్ పట్టణమైన హెరత్‌కు చెందిన లాలె ఉస్మాని మూడేళ్ల క్రితం హ్యాష్‌ట్యాగ్ వేర్ ఈజ్ మై నేమ్’ కాంపెయిన్‌ను మొదలెట్టినప్పుడు ఇది వెంటనే అప్ఘనిస్తాన్‌లోని ఆలోచనాపరులందరినీ ఆకట్టుకుంది. దేశం బయట కూడా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. దేశం బయట స్థిరపడిన అప్ఘన్ ఆలోచనాపరులు ఈ కాంపెయిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. ‘స్త్రీల పేరు స్త్రీల హక్కు’ అని ఈ కాంపెయిన్ చెబుతుంది. ముఖ్యంగా అప్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం జారీ చేసే పిల్లల గుర్తింపు కార్డుల్లో తల్లి పేరు ఉండాల్సిందేనని ఈ కాంపెయిన్ పట్టుబట్టింది. అయితే దీనికి లోపలి అంగీకారం రావడం అంత సులువు కాలేదు. అసలు అక్కడి స్త్రీలలో చాలామంది మా పేరు బయటకు రావడం ఎందుకు అనే భావజాలంలో ఉన్నారు. ‘నా పేరు బయటకి వస్తే ఇంటి పరువు ఏం కాను’ అని ఒక స్త్రీ అంది. ఇక చాందసులైన పురుషులు కొందరు లాలె ఉస్మానిని ఉద్దేశిస్తూ ‘నీ పిల్లల గుర్తింపు కార్డులో నీ పేరు ఎందుకు కావాలో మాకు తెలుసులే. ఆ పిల్లల తండ్రి ఎవరో నీకు తెలియదు కదా’ అని దారుణంగా కామెంట్ చేశారు. స్త్రీల పేర్లు గుర్తింపు కార్డుల్లో వచ్చేలా ‘జనాభా నమోదు చట్టం’ను సవరణ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు పార్లమెంటులో కొందరు సంప్రదాయవాదులు గట్టి వ్యతిరేకత ప్రదర్శించారు. అయినప్పటికీ లాలె ఉస్మానీ ఆమె సహచరులు ఇంకా దేశ విదేశాల్లోని ఆలోచనాపరులు పదే పదే ఈ కాంపెయిన్‌ను కొనసాగించారు. చివరకు దేశాధ్యక్షుడైన అష్రాఫ్ ఘని స్త్రీల సంకల్పానికి తల వొగ్గారు. వ్యతిరేకతలు లెక్క చేయకుండా స్త్రీల పేర్లకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తేశారు. ఇది ఒక పెద్ద, ఘనమైన విజయం. ప్రస్తుతం అక్కడ అప్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబన్లకు శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి కోసం స్త్రీ స్వేచ్ఛను పణంగా పెట్టమని తాలిబన్లు కోరే వాతావరణం ఉన్నప్పటికీ అఫ్రాఫ్ ఘని ప్రభుత్వం స్త్రీల పురోభివృద్ధి గురించి తమ వైఖరి స్పష్టం చేస్తూ చట్ట సవరణ చేయడం చూస్తుంటే మున్ముందు అప్ఘనిస్తాన్‌లో స్త్రీ వికాసం మరింత జరుగుతుందనే ఆశ కలుగుతోంది. జరగాలనే కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
‘డిజిలాకర్’లో ఉన్నా చాలు!
న్యూఢిల్లీ: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు వెంట లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న వారు రిజర్వేషన్, రాయితీలను వినియోగించుకోవడానికి ఇక ఇబ్బందిపడనక్కర్లేదు. డిజిలాకర్‌లో భద్రపరచిన గుర్తింపు కార్డుల సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తామని తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రెండు కాపీలను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా భావించాలని అన్ని జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు లేఖలు పంపింది. డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ సెక్షన్లో పొందుపరచిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ప్రయాణికుడు స్వయంగా అప్లోడ్ చేసిన ‘అప్లోడెడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని సాఫ్ట్ కాపీలను అనుమతించమని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ప్రారంభించిన క్లౌడ్‌బేస్డ్ ‘డిజిలాకర్’లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్లను భద్రపరచుకోవచ్చు. -
కౌలు రైతుకు గుర్తింపు ఏది?
దెందులూరు : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా పాలకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు ఎంతోకొంత మేలు చేకూర్చే గుర్తింపు కార్డుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదు. ఖరీఫ్‌కు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఊదరగొడుతున్నా గుర్తింపు కార్డుల పంపిణీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. భూములను సాగు చేసేది కౌలు రైతులే అయినా ప్రభుత్వ రాయితీ పొందాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీని సక్రమంగా చేపట్టకపోవడంతో ఏటా వేల మంది రైతులకు రాయితీలు అందక అప్పుల పాలవుతున్నారు. భూయజమానుల బినామీలకు కార్డులు ప్రభుత్వం గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకునేలా గుర్తింపుకార్డుల ద్వారా ప్రభుత్వ రాయితీలు, సహాయ, సహకారాలు, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, పంట రుణాలు ఇతర రాయితీలను ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో భూయజమానుల బినామీలకు, అనర్హులకు కార్డులు కట్టబెడుతున్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు అందటం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ప్రక్రియ, గ్రామ సభలు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. జిల్లాలో 3 లక్షల 25 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామాల్లో 2 లక్షల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరం.వీరంతా గుర్తింపుకార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కార్డులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రూ.20 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కార్డుకు రూ.120 వరకు వసూలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉచితంగా ఇవ్వాలి. రూ.20 నుంచి రూ.120 వరకూ కొన్నిచోట్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి. నేటూరి గోపాలకృష్ణ, కౌలు రైతు, కొవ్వలి అర్హులందరికీ కార్డులివ్వాలి ఉపాధి హామీ పథకం పనుల వివరాలు గ్రామ పంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఎలా చెబుతున్నారో, అదే విధంగా రైతులకు ప్రభుత్వం ద్వారా అందే పంట రుణాలు, రాయితీలు పూర్తిస్థాయి వివరాలు తెలియజేయాలి. కౌలు రైతులందరికీ కార్డులివ్వాలి ఎ.మోహనరావు, కౌలు రైతు, రాజుపేట 2 లక్షల మందికి రాలేదు 2011 భూఅధీకృత సాగుదారు చట్టం అమలు లోపభూయిష్టంగా ఉంది. ఉన్నతాధికారులు అంకితభావంతో పర్యవేక్షణ, విధులు నిర్వహణ చేయాలి. లక్ష్యానికి అనుగుణంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, 2 లక్షల మందికి ఇవ్వకపోవడం, భూయజమానుల బంధువులకు, బినామీ కార్డులు అధికమవ్వడం దురదృష్టకరం. కె.శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇదేనా టీడీపీ సభ్యత్వం
– శిల్పా ఇంటి వద్ద చెత్తలో పార్టీశ్రేణుల గుర్తింపు కార్డులు – పంపిణీ చేయకుండా విసిరేసిన వైనం నంద్యాల: కార్యకర్తలే తమ బలం, ప్రాణం అని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో చెత్తకుప్పలో పడి ఉన్న ఈచిత్రాలను చూస్తే తెలుస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. శిల్పా, ఫరూక్ వర్గాల నేతలు పోటీపడి సభ్యత్వం చేయించారు. తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వారికి గుర్తింపుకార్డులు జారీ అయ్యాయి. ఈ గుర్తింపు కార్డులను పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ మంత్రి, నంద్యాల ఇన్చార్జ్ శిల్పాకు పంపారు. 4 డబ్బాల్లో ఉన్న పదివేలకు పైగా గుర్తింపు కార్డులను శిల్పా ఇంట్లో భద్రపరిచారు. వీటికి గడువు ఈ ఏడాది డిసెంబరుకు ముగుస్తుంది. గుర్తింపుకార్డులను శిల్పా వర్గం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో వీటి గడువు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటిని పంపిణీ చేస్తే బండారం బయటపడుతుందని ఆయన వర్గీయులు ఇంటి ఎదురుగా ఉన్న చెత్తకుప్ప, కాల్వలో విసిరేశారు వేల సంఖ్యలో ఉన్న ఈ గుర్తింపు కార్డులను చిన్నారులు ఆడుకునేందుకు ఏరుకుంటున్నారు. చెత్తలో చైర్పర్సన్, కౌన్సిలర్ల గుర్తింపు కార్డులు శిల్పా ఇంటి ఎదుట లభ్యమైన పార్టీ గుర్తింపు కార్డుల్లో చైర్పర్సన్ దేశం సులోచన గుర్తింపు కార్తు ఉంది. పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని పార్టీ కార్యకర్తల కార్డులు సైతం ఉన్నాయి. మాజీమంత్రి ఫరూక్‌కు సన్నితుడైన పార్టీ నేత చింతలపల్లె సుధాకర్‌తో సహా పలువురి గుర్తింపు కార్డులు చెత్తలో దర్శనమిచ్చాయి. వీటిని చూసిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీ సభ్యత్వమంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. -
వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
రాజేంద్రనగర్: వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తూ, గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్కిల్లో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాట్లు చేస్తామన్నారు. వారు దళారుల భారిన పడి మోసపోతున్నారని, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందన్నారు. వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు మూడు జోన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ ట్రాపిక్, లా ఆండ్ ఆర్డర్, స్థానిక వ్యాపారస్తులను సభ్యులుగా ఉంటారని తెలిపారు. వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో పాటు గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ సభ్యులంతా కలిసి పొదుపు చేసుకునేలా బ్యాంక్ అకౌంట్లను తెరిపించి వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. జోన్ ల వారిగా వ్యాపారులకు అవకాశం కల్పించడం ద్వారా ట్రాపిక్కు సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనిని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐదు గ్రూపులకు చెందిన 80 మందికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపకమిషనర్ దశరథ్, అధికారులు శ్రీనివాస్, పత్యానాయక్, ఆశోక్‌కుమార్, నాయకులు సుధాకర్‌రెడ్డి, సునీత, స్వామి, కృష్ణాయాదవ్, నర్సింగ్‌రావు, రవీందర్, విజయలక్ష్మి, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
రామగిరి : ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానం మేరకు ఇంటి పనివారిని కార్మికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సాగర్ల యాదయ్య, బోడ ఇస్తారి, గణేశ్, దండంపల్లి సరోజ, జానకి, డేగల రాములమ్మ, అంజమ్మ, పద్మ, వల్లమ్మ, ఏశమ్మ, ఎల్లమ్మ, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి ఇక చెక్
పార్కుల్లో సిబ్బందికి గుర్తింపు కార్డులు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హబ్ జూన్ నాటికి చిల్డ్రన్ పార్క్ సిద్ధం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వుడా వీసీ బాబూరావునాయుడు విశాఖపట్నం : విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) పరిధిలో నడుస్తున్న పార్కుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టాలని వుడా భావిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విధుల్లో లేనివారికి సైతం వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వుడా ఆస్తుల పరిరక్షణకు, కొత్త ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ వివరాలను వుడా వీసీ బాబురావు నాయుడు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి : వుడా ఆధ్వర్యంలో ఉన్న పార్కులు అధ్వానంగా ఉన్నాయి. వాటిని మెరుగుపరిచే ఏర్పాట్లేమైనా జరుగుతున్నాయా? వీసీ : పార్కులను సంరక్షించే బాధ్యత అందరిదీ. అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో సందర్శకుల సహకారం కూడా అవసరం. మా వైపు నుంచి కూడా చర్యలు చేపడుతున్నాం. పాండురంగాపురం పార్కును పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాం. తర్వాత అన్ని పార్కులను అదే విధంగా చేయాలనుకుంటున్నాం. సాక్షి : పర్యవేక్షణ లేకపోవడం వల్ల పార్కుల్లో సిబ్బంది విధుల్లో లేకపోయినా వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై దృష్టి సారిస్తున్నారా? వీసీ : ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. విధులకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారనే అనుమానాలున్నాయి. అవకతవకలను అరికట్టడానికి వుడా పార్కుకు ప్రత్యేకాధికారిని నియమించాం. ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. సరిదిద్దేందుకు సాక్షి : సిబ్బంది అవకతవకలకు పాల్పడకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వీసీ : ఇప్పటివరకు పార్కుల్లో సిబ్బంది హాజరుకు సంబంధించి ఎలాంటి పటిష్ట ఏర్పాటు లేదు. ఇకపై ఆ పరిస్థితి కొనసాగకుండా సిబ్బందికి గుర్తింపుకార్డులు ఇవ్వనున్నాం. అవసరమైతే బయోమెట్రిక్, లేదా కార్డుకే బార్ కోడింగ్ ఇచ్చి స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. సైరన్ విధానాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుదని కూడా ఆలోచిస్తున్నాం. అన్నిటికంటే ముందు అసలు ఏ పార్కులో ఎంత మంది పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. సాక్షి : ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోతున్నట్లున్నాయి? వీసీ : కొన్ని ప్రాజెక్టులు సాంకేతిక కారణాల వల్ల అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. వుడా చిల్డ్రన్ పార్కు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జపాన్ చైర్ల వంటివి వేయడం, ఇతర హై క్వాలిటీ పరికరాలు అమర్చంలో ఆలస్యం జరుగుతోంది. సెంట్రల్ పార్కు పనులు కూడా అంతే. ఫౌంటెన్ నాణ్యత విషయంలో రాజీపడలేకపోతున్నాం. మెరుగ్గా ఉండాలనే సమయం తీసుకుంటున్నాం. ఈ రెండూ జూన్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తాం. సాక్షి : షాపింగ్ కాంప్లెక్స్‌ల పరిస్థితి? వీసీ : సీతమ్మధారలో రూ.8.30 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిలో 32 షాపులు, 8 కార్యాలయాలు, 4 షోరూమ్‌లు వస్తాయి. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఆయన ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఎంవీపీలో రూ.10.30 కోట్లతో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. సాక్షి : కొత్త వెంచర్ల ప్రగతి ఎలా ఉంది? వీసీ: దాకమర్రిలో ప్రైవేటు భాగస్వామ్యంతో వెంచర్ వేశాం. దీనిలో కొన్ని వేలంలో, కొన్ని లాటరీలో కేటాయిస్తాం. దీనివల్ల మధ్యతరగతి వారికి దక్కే అవకాశం వస్తుంది. హరిత వెంచర్ సిద్ధంగా ఉంది. పెందుర్తి, సబ్బవరం పరిసర ప్రాంతాలను కలుపుతూ ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. సాక్షి : భూ ఆక్రమణలను అడ్డుకునే చర్యలు..? వీసీ : వుడా స్థలాలపై సర్వే చేయించాం. ఇప్పటికే 250 అక్రమ లే అవుట్లను గుర్తించాం. వాటిలో కొన్ని ధ్వంసం చేశాం. అందరికీ నోటీసులు ఇచ్చాం. జియోటాగింగ్ విధానం తీసుకువస్తున్నాం. స్థలాల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తాం. -
'ఇక మొక్కలకు ఐడెంటీ కార్డులు'
కోల్‌కతా: ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే ఐడెంట్లీ కార్డులు ఉండగా.. ఇక నుంచి మొక్కలకు కూడా గుర్తింపు కార్డులు రానున్నాయి. వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుని గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి దాపురించిన నేపథ్యంలో కోల్‌కతాలోని కోన్నాగర్ మున్సిపాలిటీ సంస్థ మొక్కల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు వాటికి ప్రత్యేక గుర్తింపు కార్డులు కేటాయించింది. 28 రకాల మొక్కలకు ఇప్పటికే మూడువేల ఐడెంటీ కార్డులను జారీ చేసింది. ఈ ఐడెంటీ కార్డులో మొక్కలకు ఉండే స్థానిక పేరుతోపాటు శాస్త్రీయ నామం, అది ఉన్న ప్రాంతం, ఓ ఛాయా చిత్రం, దాని ప్రస్తుత బరువు, కాండం విస్తృతి వివరాలు చేర్చారు. ప్రముఖ పర్యావరణ వేత్త అభిజిత్ మిత్రా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఐడెంటీ కార్డును ఆ మొక్కలకు అమర్చినట్లు చెప్పారు. -
బీడీ కార్మికులకు ఐడీ కార్డులు: దత్తాత్రేయ
తెలంగాణలో బీడీ కార్మికులకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... అసంఘటిత కార్మికుల కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశామని ఆయన చెప్పారు. త్వరలోనే వారికి స్మార్ట్ కార్డులు... పారదర్శకంగా జవాబుదారీతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంపొందిస్తుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈఎస్ఐసీ కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నివేదికలు అందించాలని అధికారులకు సూచించామని దత్తాత్రేయ అన్నారు. కార్మిక రంగంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి దత్తాత్రేయ చెప్పారు. -
నవ్విపోదురు గాక...
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కొందరు అవినీతి అధికారుల తీరు. లాభాపేక్ష లేకుండా, నిష్పక్షపాతంగా పనిచేద్దామని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు ప్రతీన బూనిన కొన్ని గంటల్లోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభించిన రోజే, సాక్షాత్తూ జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేసిన జిల్లా సచివాలయంలోనే ఈ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. కరీంనగర్ క్రైం : బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన న్యాలం శ్రీనివాస్ మరో 24 మందితో కలిసి గీత పారిశ్రామిక సహకార సంఘం అనుమతి కోసం ఎక్సైజ్ సహకార సంఘాల ఇన్స్పెక్టర్ పానకల్ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు. అన్నిరకాల పత్రాలు, సంఘం తీర్మానం కాపీని జతచేశారు. పత్రాలు పరిశీలించిన ఆయన గత నెల 19న అనుమతి మంజూరు చేశారు. సంఘంలో సభ్యత్వ అర్హత, గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఒక్కో సభ్యుడు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని, మొత్తం రూ.25 వేలు ఇస్తేనే మిగతా అనుమతులు ఇస్తానని సదరు ఇన్స్పెక్టర్ తెగేసి చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినకుండా రూ.15 వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు. తామందరం కూలీ చేసుకుని బతుకుతామని, చెట్లు కూడా లేవని తక్కువగా ఉన్నాయని చెప్పినా అధికారి వినిపించుకోలేదు. దీంతో శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారమే స్కెచ్ సురేందర్‌రెడ్డిని పట్టుకునేందుకు మంగళవారమే ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు శ్రీనివాస్ డబ్బులు తీసుకుని రాగా, సురేందర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పించుకున్నాడు. బుధవారం సదరు అధికారి శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి రమ్మనడంతో సాయంత్రం 6 గంటల సమయంలో కలెక్టరేట్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికివచ్చాడు. అక్కడ శ్రీనివాస్ నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా సురేందర్‌రెడ్డిని ఏసీ బీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే... బుధవారం నుంచి ఈ నెల 9 వరకూ ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అవినీతిని నిర్మూలిస్తామని బుధవారం ఉదయం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణం చేశారు. ఎక్కడైతే ప్రమాణం చేశారో అదే కాంప్లెక్స్‌లో ఓ అవినీతి అధికారి కొద్ది గంటల్లోనే పట్టుబడడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతలా పాతుకుపోయిందో చెబుతోంది. ఏ జోన్లో లేనంతగా మన జోన్లోనే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 మంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎక్సైజ్‌పై ఫిర్యాదులు కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. వాటిని సమీక్షించి దాడులు చేస్తున్నాం. ఎక్కడ ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభమైన రోజునే... లంచం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేసిన కొద్ది గంటల్లోనే ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ బతిమిలాడినా వినలేదు సహకార సంఘాల ఇన్స్పెక్టర్ రూ.25 వేలు లంచం అడిగిండు. ఎంత బతిమిలాడినా వినలేదు. రెండుమూడు సార్లు కలిసి మా బాధ వివరించినం. చివరకు రూ.15 వేలు ఇస్తేనే సభ్యత్వ అనుమతి, గుర్తింపు కార్డులు ఇస్తానని చెప్పాడు. పేదోళ్లమని చెప్పినా పట్టించుకోలేదు. అందుకే లంచం అడుగుతున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన. - శ్రీనివాస్, బాధితుడు -
పాడి రైతులకు గుర్తింపు కార్డులు
జహీరాబాద్ టౌన్: పాడి రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జిల్లా ప్రత్యేకాధికారి పవన్ కుమార్ తెలిపారు. జహీరాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో శనివారం నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను దాని వెనుక భాగం లో ముద్రించామని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లిస్తోందన్నారు. దీనికోసం నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు. లీడ్ బ్యాంక్ లీకేజీ ద్వా రా పాడి రైతులకు డైరీ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ముందుగా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్‌లో యూనిట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా (9493173769) నంబర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు. జిల్లా డిప్యూటీ డైరక్టర్ కామేష్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శంకర్‌సింగ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సామల నర్సింలు పాల్గొన్నారు. -
సమస్తం..‘ఆధార’మే
అక్రమాల చెక్కు నివారణోపాయం చేవెళ్ల: మీవద్ద ఎన్ని గుర్తింపు కార్డులున్నా అవి అంతగా ప్రాధాన్యం లేనివే కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డుయే లింకు కాబోతుంది.ప్రభుత్వ పథకాలలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అర్హులైన వారికే ప్రయోజనాలను అందించడానికి, దళారుల వ్యవస్థనుంచి లబ్ధిదారులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లకు ఈ ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా ఓటరు గుర్తింపు కార్డులతో కూడా లిం కు పెట్టబోతున్నారు. ఓటరు కార్డులతో ఆధార్‌ను లింకుచేస్తే బోగస్ ఓటర్లను అవలీలగా తొలగించే వీలున్నందున ముందుగా సైబరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీల నుంచి ఆధార్ కార్డులతో పాటుగా వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. వీటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానం ద్వారా కూలీలకు, పింఛన్‌దారులకు ఇక నుంచి పోస్టాఫీసు, బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుని నెంబరును ఆధార్‌కార్డుతో లింకుచేసి నగదు బదిలీ పథకం ద్వారా సబ్సీడీని నేరుగా బ్యాంకు ఖాతాలో వేయడం తప్పనిసరి చేయబోతోంది. ఉపాధి పైసలకు భరోసా... నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉపాధి పనులను ఏటా చేపడుతున్నారు. చేవెళ్ల మండలంలోనే 11,900 మందికి పైగా జాబ్‌కార్డుదారులున్నారు. షాబాద్, నవాబుపేట మండలాల్లో సైతం ఉపాధి కూలీలు అధికంగా ఉన్నారు. ఏటా రూ. కోట్లు విలువ చేసే పనులను ఉపాధిహామీ పథకంలో చేపడుతున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతుండటం వల్ల కూలీలకు చెల్లింపుల్లో అన్యాయం జరిగేది. దీంతో ఆధార్‌తో అనుసంధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఆధార్ సీడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పింఛను లబ్ధిదారులకు సైతం.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభయహస్తం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కలిపి సుమారుగా 19 వేల వరకు ఉన్నాయి.బోగస్ పేర్లతో పలువురు పింఛన్ అందుకుంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి బోగస్‌ల అడ్డుకట్టకు చేపడుతున్న ఆధార్, బ్యాంకు ఖాతా నమోదుతో పింఛన్‌దారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా చేరనుంది. బోగస్‌రేషన్ కార్డుల గుర్తింపులో ప్రధాన పాత్ర.. ఆధార్ అనుసంధానంతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతకు మార్గం సులభతరమైందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం రేషన్‌కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న బోగస్ రేషన్‌కార్డులను గుర్తించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరిన్ని బోగస్ కార్డులను ఏరి వేయడానికి వీలవుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
కౌలు రైతు కన్నీటి సాగు
కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు. ఇందుకు కారణం వేరే వారి భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడమే. సాగుకు అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరే. పెట్టుబడితో పాటు కౌలు కింద ముందే డబ్బు చెల్లించాలి. ఇంత కష్టపడిన వారిని రైతులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినా దిగువ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చీరాల : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేలాది మంది రైతులు కౌలుదారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 8 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో మూడోవంతు మందికి ఎటువంటి రుణం మంజూరు కాలేదు. జిల్లాలో 2 లక్షలపైగా కౌలు రైతులున్నారు. జిల్లాలో సాగవుతున్న 5.7 లక్షల హెక్టార్లలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 35 వేల మంది కౌలు రైతులు గుర్తింపుకార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 8 వేల మందికే మంజూరు చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఏ రాయితీని, బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారు. దీనికి తోడు రైతులకు అవగాహన లేకపోవడం కూడా గుర్తింపుకార్డు పొందలేకపోవడానికి కారణమవుతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కౌలు రైతులను కన్నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నామమాత్రంగా కూడా చేయడంలేదు. రైతు సంఘాల నాయకులు గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లోకి వెళ్లి వారు ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ ప్రకారం కార్డుల్ని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఆ ప్రక్రియ సాగడం లేదు. స్థానిక నేతలు చెప్పిన వారికి, సర్వే నంబర్లు చెప్పినవారికి కార్డులు అందుతున్నాయి. అలాంటి వాటిలో కౌలు చేసిన భూమికి, కార్డులో ఉన్న విస్తీర్ణానికి పొంతన ఉండడంలేదు. ఎరువులు, విత్తనాలు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా, నష్టపరిహారం ఇలా కౌలుదారుడికి ప్రభుత్వం నుంచి పొందే ఏ లబ్ధికైనా గుర్తింపుకార్డులు అవసరం. ఏటా కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అంతా కలిపి 35 వేలకు మించి ఉండదు. దీనికి కారణం రైతులకు కార్డులు అందచేయడంలో అధికారులు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టడమే. పైగా కార్డులిచ్చినా వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి, గ్రామస్థాయి అధికారులు నమోదు చేస్తున్న విస్తీర్ణానికి సంబంధం ఉండడం లేదు. ఐదు ఎకరాలు కౌలు చేస్తున్న వారికి పదిసెంట్లు కౌలు చేస్తున్నట్లుగా కౌలు కార్డులిచ్చిన సంఘటనలున్నాయి. సర్కారు తీరుతో మరింత అవస్థలు... ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో కౌలు రైతులు తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందేవారు. అయితే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దానిని పూర్తిచేయకపోవడంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. అటు రుణమాఫీ కాక, ఇటు పెట్టుబడికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడులతో పాటు అదనంగా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వందకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. చివరకు వడ్డీ తడిసి మోపెడవుతోంది. -
తలమునకలు
సమగ్ర సర్వేపై కసరత్తు ఇళ్లవద్ద మార్కింగ్ చేస్తున్న సిబ్బంది మొత్తం ఇళ్లు 9.07లక్షలు 39,498మంది సిబ్బంది నియామకం ప్రైవేటు ఉద్యోగులకూ బాధ్యతలు పాలమూరు : ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేటాయించిన ఎన్యుమరేటర్లు ఇల్లిల్లు తిరిగి మార్కింగ్ చేసే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు ఈ సర్వే ఆధారంగానే రూపొందించనున్నారన్న సమాచారం ఉండడంతో బయట ఉన్న వ్యక్తులు కూడా సొంత ఇళ్లకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా సిబ్బంది, అధికారులు ముందుగా గ్రామాలకు, పట్టణాలకు వెళ్లి వార్డుల వారీగా ఇల్లిల్లూ తిరుగుతూ ఇంటి యజమాని పేరు నమోదు చేసుకోవడంతో పాటు ఇంటికి మార్కింగ్ చేసి వస్తున్నారు. దీనివల్ల సమగ్ర సర్వే నిర్వహించే రోజున మార్కింగ్ ఆధారంగా కుటుంబ సర్వే చేపట్టేందుకు సులువయ్యే అవకాశం ఏర్పడుతుందని సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు. సర్వేకు 39,498 మంది సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వే వివరాల సేకరణకు జిల్లావ్యాప్తంగా 39,498 మంది ఎన్యుమరేటర్లు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినా సిబ్బంది కొరత ఏర్పడటంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా నియమించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సిబ్బందికి సర్వే ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపారు. సమగ్ర సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 39,498 మంది ఎన్యుమరేటర్లను నిర్ణయించగా... 501 రూట్లు, 314 జోన్లుగా విభజించారు. 1665 వాహనాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 523 ఆర్టీసీ బస్సులు, 195 మినీ బస్సులు ఏర్పాటు చేయగా 947 ఇతర వాహనాలను వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుర్తింపు కార్డులు.. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే ఎన్యుమరేటర్లకు జిల్లా యంత్రాంగం గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాలు గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తోంది. అనధికారికంగా ఎవరూ సర్వే చేపట్టకుండా యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించింది. అయితే ఈ అంశంపై పలు ఆరోపణలొస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించడంతో వివరాల సేకరణ పారదర్శకంగా సాగుతుందా అనే సందేహం నెలకొంది. వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులైతే చర్యలు తీసుకోవచ్చని ఈ నేపథ్యంలో పకడ్బందీగా సర్వే జరుగుతుందని, కానీ ప్రైవేటు సిబ్బందిపై ఏమేరకు చర్యలు తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. -
రైతుకష్టం దళారిపాలు
►సుబాబుల్, జామాయిల్‌కు దక్కని ధర ►ఏడాదికి రూ.42 కోట్లు దళారుల పాలు ► దళారులను ప్రోత్సహిస్తున్న పేపర్‌మిల్లుల ప్రతినిధులు ►పెంచిన ధరలను అమలు చేయకుండా మెలికలు ► గుర్తింపు కార్డులంటూ కాలయాపన చేస్తున్న మార్కెట్ కమిటీలు చీమకుర్తి: స్వేదం చిందించి ఏడాదిపాటు రైతుపడ్డ కష్టాన్ని అడ్డదారిలో వచ్చిన దళారులు దోచుకుంటున్నారు. ఏడాదికి సుమారు రూ.42 కోట్లు దళారుల పాలవుతుండగా, కష్టపడిన రైతన్నకు నష్టాలే మిగులుతున్నాయి. పేపర్‌మిల్లుల ప్రతినిధులు, దళారులు కుమ్మక్కవుతుండటంతో సుబాబుల్, జామాయిల్ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంచిన ధరలను అమలు చేయకుండా టన్నుకు రూ.700 లెక్కన రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుబాబుల్, జామాయిల్ సరాసరిన నెలకు 50 వేల టన్నుల కర్ర కొనుగోలు చేస్తున్నారు. 50 వేల టన్నుల మీద టన్నుకు రూ.700 లెక్కన నెలకు రూ.3.5 కోట్లు దారిమళ్లుతున్నాయి. ఏడాదికి రూ.42 కోట్లు రైతుల కష్టం దళారుల పాలవుతోంది. గుర్తింపు కార్డులంటూ మార్కెట్ కమిటీలు కాలయాపన పనులే తప్ప రైతులకు జరుగుతున్న నష్టాన్ని నివారించింది లేదు. వివరాల్లోకి వెళితే.... ►మార్కెట్ కమిటీల ద్వారా పేపర్ మిల్లుల ప్రతినిధులు సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను రూ.3700, జామాయిల్ టన్నుకు రూ.3900 లెక్కన గతేడాది వరకు కొనుగోలు చే శారు. దానిని గత ఫిబ్రవరి 18వ తేదీన విజయవాడలో రైతుసంఘాల నాయకులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. టన్ను ధర సుబాబుల్‌ను రూ. 3700 నుంచి రూ. 4400కు, జామాయిల్ ధరను రూ.3900 నుంచి రూ.4600కు పెంచారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పెంచిన ధరలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇంత వరకు పెంచిన ధరలను అమలు చేయకుండా పాత ధరలనే పేపర్‌మిల్లుల ప్రతినిధులు చెల్లిస్తున్నారు. దాని వలన ఒక్కొక్క రైతు టన్నుకు రూ.700 లెక్కన నష్టపోతున్నారు. ►జిల్లాలో 14 మార్కెట్ కమిటీలున్నాయి. వాటిలో ఏడు మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేస్తున్నారు. నెలకు సరాసరిన 50 వేల కర్రను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు చెందాల్సిన సొమ్మును అడ్డదారిలో పేపర్ మిల్లుల ప్రతినిధులు, దళారులు కలిసి దోచుకుంటున్నారు. ►దానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు పలుమార్లు మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు ఇటీవల జిల్లాకు వచ్చినపుడు ఆయన కూ విన్నవించారు. దీంతో ఇంకా ఈ జిల్లాలో పెరిగిన ధరలను ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ఆరా తీశారు. ►కలెక్టర్, మార్కెట్ కమిటీలు పెంచిన ధర అమలు చేసేందుకు పేపర్‌మిల్లుల ప్రతినిధులపై వత్తిడి తీసుకురావడంతో దానికి వారు రైతులు తీసుకొస్తున్న కర్ర సన్నగా ఉందని, నాణ్యంగా లేదని మెలికలు పెడుతున్నారు. సన్నకర్ర తీసేసి మంచి నాణ్యమైన కర్ర తీసుకొస్తే దానికి పెంచిన ధరలను అమలు చేస్తామని చెబుతున్నారు. దాంతో రైతులు ఏం చేయాలో తోచక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ►మార్కెట్ కమిటీల అసిస్టెంట్ డెరైక్టర్ మహ్మద్ఫ్రీ రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి జరిగే అన్యాయాన్ని నివారిస్తానని చెప్తున్నారు. రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారి ఎకౌంట్లలో నేరుగా డబ్బు పడేలా చూస్తానని, తద్వారా దళారి వ్యవ స్థను నిలువరించవచ్చంటున్నారు. ►కానీ దళారులు కూడా అందుకు తగ్గట్లుగానే రైతుల్లో తమకు అనుకూలమైన వారి పేర్ల మీదనే కర్రకొనుగోలు చేసి, వారి ద్వారానే తమకు అనుకూలంగా మలుచుకునే మార్గాలు కూడా ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ►పెంచిన ధరలను పేపర్‌మిల్లుల ప్రతినిధులు అమలు చేయకుండా తమ శ్రమను నిలువునా దోచుకుంటుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ►చీమకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ర కొనుగోలు చేసే రైతులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో సుమారు ఐదారు వందల మంది ఉన్నట్లు అంచనా. ఇలా జిల్లా మొత్తం మీద వేలల్లో ఉన్న రైతులను దళారులు మోసగిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కర్ర కొనుగోలుపై పెంచిన ధరలను తక్షణమే అమలు చేసి సన్నకర్ర, నాణ్యత లేదనే మెలికలు పెట్టకుండా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆటోడ్రైవర్లకు వీఐటీ గుర్తింపు కార్డులు
వేలూరు, న్యూస్‌లైన్: విద్యార్థులు క్షేమ ప్రయాణం కోసం వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 835 మంది ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇండియాలో ఉన్న నెంబర్ వన్ యూనివర్సిటీల్లో వీఐటీ ఒక్కటని, యూనివర్సిటీ నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల వీఐటికీ కొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. అలాగే యూనివ ర్సిటీకి వచ్చే ఉద్యోగులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సైతం ఎక్కువగా ఆటోలోనే వస్తుంటారన్నారు. వీరి క్షేమ ప్రయాణం కోసమే ఆటోలు నడిపే 835 మంది డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గుర్తింపు కార్డులో డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నెంబర్ వివరాలు ఉంటాయన్నారు. దీనివల్ల యూని వర్సిటీకి వచ్చి వెళ్లే వారి బ్యాగులు పోయినా తిరిగి వాటిని పొందేందుకు ఎంతగానో వీలుగా ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి ఈ గుర్తింపు కార్డులున్న ఆటోలను మాత్రమే యూనివర్సిటీలోనికి అనుమతిస్తామన్నారు. వీఐటీ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఇకపై వీఐటీ సిబ్బంది ఒకరిని బస్టాండ్ లేక కాట్పాడి రైల్యేస్టేషన్ వరకు తోడుగా పంపుతామని, సొంత గ్రామాలనుంచి యూనివర్శిటీకి వచ్చే సమయంలో కూడా రైల్యేస్టేషన్ వరకు తోడుగా ఒకరిని పంపుతామన్నారు.వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, జీవీ సెల్వం, కాట్పాడి ఆర్టీవో కణి, ఇన్స్పెక్టర్ మహేంద్రన్, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. -
సీమాంధ్ర న్యాయవాదుల హల్చల్
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శనివారం గుడిమల్కాపూర్ లోని అశోకాగార్డెన్‌లో నిర్వహించిన సదస్సుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సదస్సుకు వచ్చే దారుల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. రేతిబౌలి, గుడిమల్కాపూర్ చౌరస్తా, శంషాబాద్ దారిలో పోలీసులు ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా అశోకాగార్డెన్ సమీపంలో ఉన్న బాలాజీనగర్, సత్యనారాయణనగర్, సాయినగర్‌లలో సైతం ముళ్లకంచెలను ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి సదస్సుకు పంపించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణవాదుల హంగామా... సీమాంధ్ర న్యాయవాదుల సదస్సును నిలిపివేయాలంటూ కార్వాన్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు హంగామా చేశారు. అశోకాగార్డెన్ వద్ద పూలమార్కెట్‌లోని ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర న్యాయవాదులు సదస్సును రద్దు చేసుకొని తక్షణమే వెళ్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వాటర్‌ట్యాంకు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి కిందకు దింపి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి జీవన్‌సింగ్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, శ్రీధర్‌సాగర్, చందర్, రాజు, హరీష్, రామారావు, సుబ్బారావులు ఉన్నారు.