కౌలు రైతుకు గుర్తింపు ఏది?
Published Thu, May 25 2017 8:57 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
దెందులూరు : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా పాలకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు ఎంతోకొంత మేలు చేకూర్చే గుర్తింపు కార్డుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదు. ఖరీఫ్‌కు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఊదరగొడుతున్నా గుర్తింపు కార్డుల పంపిణీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. భూములను సాగు చేసేది కౌలు రైతులే అయినా ప్రభుత్వ రాయితీ పొందాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీని సక్రమంగా చేపట్టకపోవడంతో ఏటా వేల మంది రైతులకు రాయితీలు అందక అప్పుల పాలవుతున్నారు.
భూయజమానుల బినామీలకు కార్డులు
ప్రభుత్వం గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకునేలా గుర్తింపుకార్డుల ద్వారా ప్రభుత్వ రాయితీలు, సహాయ, సహకారాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, పంట రుణాలు ఇతర రాయితీలను ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో భూయజమానుల బినామీలకు, అనర్హులకు కార్డులు కట్టబెడుతున్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు అందటం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ప్రక్రియ, గ్రామ సభలు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. జిల్లాలో 3 లక్షల 25 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామాల్లో 2 లక్షల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరం.వీరంతా గుర్తింపుకార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కార్డులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రూ.20 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
కార్డుకు రూ.120 వరకు వసూలు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉచితంగా ఇవ్వాలి. రూ.20 నుంచి రూ.120 వరకూ కొన్నిచోట్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి.
నేటూరి గోపాలకృష్ణ, కౌలు రైతు, కొవ్వలి
అర్హులందరికీ కార్డులివ్వాలి
ఉపాధి హామీ పథకం పనుల వివరాలు గ్రామ పంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఎలా చెబుతున్నారో, అదే విధంగా రైతులకు ప్రభుత్వం ద్వారా అందే పంట రుణాలు, రాయితీలు పూర్తిస్థాయి వివరాలు తెలియజేయాలి. కౌలు రైతులందరికీ కార్డులివ్వాలి
ఎ.మోహనరావు, కౌలు రైతు, రాజుపేట
2 లక్షల మందికి రాలేదు
2011 భూఅధీకృత సాగుదారు చట్టం అమలు లోపభూయిష్టంగా ఉంది. ఉన్నతాధికారులు అంకితభావంతో పర్యవేక్షణ, విధులు నిర్వహణ చేయాలి. లక్ష్యానికి అనుగుణంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, 2 లక్షల మందికి ఇవ్వకపోవడం, భూయజమానుల బంధువులకు, బినామీ కార్డులు అధికమవ్వడం దురదృష్టకరం.
కె.శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
Advertisement
Advertisement