రైతుకష్టం దళారిపాలు | Difficult of Farmer for broker | Sakshi
Sakshi News home page

రైతుకష్టం దళారిపాలు

Published Fri, Jul 25 2014 3:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతుకష్టం దళారిపాలు - Sakshi

రైతుకష్టం దళారిపాలు

సుబాబుల్, జామాయిల్‌కు దక్కని ధర
ఏడాదికి రూ.42 కోట్లు దళారుల పాలు
దళారులను ప్రోత్సహిస్తున్న పేపర్‌మిల్లుల ప్రతినిధులు
పెంచిన ధరలను అమలు చేయకుండా మెలికలు
గుర్తింపు కార్డులంటూ కాలయాపన చేస్తున్న మార్కెట్ కమిటీలు
 చీమకుర్తి: స్వేదం చిందించి ఏడాదిపాటు రైతుపడ్డ కష్టాన్ని అడ్డదారిలో వచ్చిన దళారులు దోచుకుంటున్నారు. ఏడాదికి సుమారు రూ.42 కోట్లు దళారుల పాలవుతుండగా, కష్టపడిన రైతన్నకు నష్టాలే మిగులుతున్నాయి. పేపర్‌మిల్లుల ప్రతినిధులు, దళారులు కుమ్మక్కవుతుండటంతో సుబాబుల్, జామాయిల్ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంచిన ధరలను అమలు చేయకుండా టన్నుకు రూ.700 లెక్కన రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుబాబుల్, జామాయిల్ సరాసరిన నెలకు 50 వేల టన్నుల కర్ర కొనుగోలు చేస్తున్నారు. 50 వేల టన్నుల మీద టన్నుకు రూ.700 లెక్కన  నెలకు రూ.3.5 కోట్లు దారిమళ్లుతున్నాయి. ఏడాదికి రూ.42 కోట్లు రైతుల కష్టం దళారుల పాలవుతోంది. గుర్తింపు కార్డులంటూ మార్కెట్ కమిటీలు కాలయాపన పనులే తప్ప రైతులకు జరుగుతున్న నష్టాన్ని

నివారించింది లేదు. వివరాల్లోకి వెళితే....
మార్కెట్ కమిటీల ద్వారా పేపర్ మిల్లుల ప్రతినిధులు సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను రూ.3700, జామాయిల్ టన్నుకు రూ.3900 లెక్కన గతేడాది వరకు కొనుగోలు చే శారు. దానిని గత ఫిబ్రవరి 18వ తేదీన విజయవాడలో రైతుసంఘాల నాయకులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. టన్ను ధర సుబాబుల్‌ను రూ. 3700 నుంచి రూ. 4400కు, జామాయిల్ ధరను రూ.3900 నుంచి రూ.4600కు పెంచారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పెంచిన ధరలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇంత వరకు పెంచిన ధరలను అమలు చేయకుండా పాత ధరలనే పేపర్‌మిల్లుల ప్రతినిధులు చెల్లిస్తున్నారు. దాని వలన ఒక్కొక్క రైతు టన్నుకు రూ.700 లెక్కన నష్టపోతున్నారు.

జిల్లాలో 14 మార్కెట్ కమిటీలున్నాయి. వాటిలో ఏడు మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేస్తున్నారు. నెలకు సరాసరిన 50 వేల కర్రను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు చెందాల్సిన సొమ్మును అడ్డదారిలో పేపర్ మిల్లుల ప్రతినిధులు, దళారులు కలిసి దోచుకుంటున్నారు.
దానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు పలుమార్లు మార్కెట్ కమిటీ  అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు ఇటీవల జిల్లాకు వచ్చినపుడు ఆయన కూ విన్నవించారు. దీంతో ఇంకా ఈ జిల్లాలో పెరిగిన ధరలను ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ఆరా తీశారు.
కలెక్టర్, మార్కెట్ కమిటీలు పెంచిన ధర అమలు చేసేందుకు పేపర్‌మిల్లుల ప్రతినిధులపై వత్తిడి తీసుకురావడంతో దానికి వారు రైతులు తీసుకొస్తున్న కర్ర సన్నగా ఉందని, నాణ్యంగా లేదని మెలికలు పెడుతున్నారు. సన్నకర్ర తీసేసి మంచి నాణ్యమైన కర్ర తీసుకొస్తే దానికి పెంచిన ధరలను అమలు చేస్తామని చెబుతున్నారు. దాంతో రైతులు ఏం చేయాలో తోచక నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ కమిటీల అసిస్టెంట్ డెరైక్టర్ మహ్మద్ఫ్రీ రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి జరిగే అన్యాయాన్ని నివారిస్తానని చెప్తున్నారు. రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారి ఎకౌంట్‌లలో నేరుగా డబ్బు పడేలా చూస్తానని, తద్వారా దళారి వ్యవ స్థను నిలువరించవచ్చంటున్నారు.
కానీ దళారులు కూడా అందుకు తగ్గట్లుగానే రైతుల్లో తమకు అనుకూలమైన వారి పేర్ల మీదనే కర్రకొనుగోలు చేసి, వారి ద్వారానే తమకు అనుకూలంగా మలుచుకునే మార్గాలు కూడా ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెంచిన ధరలను పేపర్‌మిల్లుల ప్రతినిధులు అమలు చేయకుండా తమ శ్రమను నిలువునా దోచుకుంటుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
చీమకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ర కొనుగోలు చేసే రైతులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో సుమారు ఐదారు వందల మంది ఉన్నట్లు అంచనా. ఇలా జిల్లా మొత్తం మీద వేలల్లో ఉన్న రైతులను దళారులు మోసగిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కర్ర కొనుగోలుపై పెంచిన ధరలను తక్షణమే అమలు చేసి సన్నకర్ర, నాణ్యత లేదనే మెలికలు పెట్టకుండా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement