నిజమైన రైతులను గుర్తించకపోతే ఎలా? | find who are the real farmers | Sakshi
Sakshi News home page

నిజమైన రైతులను గుర్తించకపోతే ఎలా?

Published Sat, Nov 29 2014 1:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

find who are the real farmers

ఒంగోలు టౌన్ : ‘సుబాబుల్, జామాయిల్ కర్రను మార్కెట్ కమిటీలకు దళారులు తెచ్చి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఎవరు నిజమైన రైతు, ఎవరు దళారీ అనేది తెలుసుకోకపోతే ఎలా..? మీరు ఇలాగే వ్యవహరిస్తే అసలైన రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. కర్ర కొనుగోళ్లకు సంబంధించి దళారీ వ్యవస్థ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పేపర్ మిల్లుల యజమానులు కర్ర కొనుగోలు చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు.

బాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చీమకుర్తి నుంచి పెద్ద సంఖ్యలో రైతులు శుక్రవారం జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య మాట్లాడుతూ.. ఏపీ పేపర్ మిల్లు తప్పితే ఐటీసీ కర్ర కొనుగోలు చేయడం లేదన్నారు. అదికూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా తక్కువకు కొనుగోలు చేస్తోందన్నారు. కర్రకు తాట తీస్తే ఒక ధర నిర్ణయిస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన జేసీ.. ఐటీసీ కంపెనీ కర్ర కొనుగోలు చేయకుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులను నిలదీశారు. కర్ర కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధరలు నిర్ణయించడం జరిగిందని, అందులో కర్ర తాట తీస్తే ఒక ధర అనే ప్రస్తావనే లేదన్నారు. పేపర్ మిల్లులు అలాంటి నిబంధనలు విధిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను మార్కెటింగ్ శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ మాట్లాడుతూ.. ఇక్కడ దాపరికం ఏమీ లేదని, ఉన్నది ఉన్నట్లు చెబితే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దళారులు ఉంటేనే కర్ర  కొనుగోలు చేస్తామంటూ ఐటీసీ పేపర్ మిల్లుల ప్రతినిధులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు రైతులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోసాలు జరుగుతుంటే మనం దేని కోసం ఉన్నట్లు’ అంటూ మార్కెటింగ్‌శాఖ అధికారులపై మండిపడ్డారు. రైతులకు జారీ చేసిన కార్డుల ఆధారంగా కర్ర కొనుగోలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను అనుమతించరాదని జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement