చెత్తకుప్పలో పడివున్న టీడీపీ గుర్తింపు కార్డులు
– శిల్పా ఇంటి వద్ద చెత్తలో పార్టీశ్రేణుల గుర్తింపు కార్డులు
– పంపిణీ చేయకుండా విసిరేసిన వైనం
నంద్యాల: కార్యకర్తలే తమ బలం, ప్రాణం అని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో చెత్తకుప్పలో పడి ఉన్న ఈచిత్రాలను చూస్తే తెలుస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది.
శిల్పా, ఫరూక్ వర్గాల నేతలు పోటీపడి సభ్యత్వం చేయించారు. తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వారికి గుర్తింపుకార్డులు జారీ అయ్యాయి. ఈ గుర్తింపు కార్డులను పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ మంత్రి, నంద్యాల ఇన్‌చార్జ్ శిల్పాకు పంపారు. 4 డబ్బాల్లో ఉన్న పదివేలకు పైగా గుర్తింపు కార్డులను శిల్పా ఇంట్లో భద్రపరిచారు. వీటికి గడువు ఈ ఏడాది డిసెంబరుకు ముగుస్తుంది. గుర్తింపుకార్డులను శిల్పా వర్గం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో వీటి గడువు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటిని పంపిణీ చేస్తే బండారం బయటపడుతుందని ఆయన వర్గీయులు ఇంటి ఎదురుగా ఉన్న చెత్తకుప్ప, కాల్వలో విసిరేశారు వేల సంఖ్యలో ఉన్న ఈ గుర్తింపు కార్డులను చిన్నారులు ఆడుకునేందుకు ఏరుకుంటున్నారు.
చెత్తలో చైర్‌పర్సన్, కౌన్సిలర్ల గుర్తింపు కార్డులు
శిల్పా ఇంటి ఎదుట లభ్యమైన పార్టీ గుర్తింపు కార్డుల్లో చైర్‌పర్సన్ దేశం సులోచన గుర్తింపు కార్తు ఉంది. పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని పార్టీ కార్యకర్తల కార్డులు సైతం ఉన్నాయి. మాజీమంత్రి ఫరూక్‌కు సన్నితుడైన పార్టీ నేత చింతలపల్లె సుధాకర్‌తో సహా పలువురి గుర్తింపు కార్డులు చెత్తలో దర్శనమిచ్చాయి. వీటిని చూసిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీ సభ్యత్వమంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.