ఇంతేనా?
సభ్యత్వ నమోదు తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
సిటీబ్యూరో: సభ్యత్వం తీసుకున్న వారికి వివిధ సదుపాయాలు కల్పిస్తున్నా లక్ష్యం చేరకపోవడం ఏంటి? ఇప్పటి నుంచైనా చురుగ్గా సభ్యత్వ నమోదులో పాల్గొనాలని టీటీడీపీ రాష్ట్ర నేతలు అన్నారు. హైదరాబాద్ నుంచి 1.5 లక్షల సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యం పెట్టుకుంటే కేవలం 30 వేల సభ్యత్వాలే నమోదు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి చేయడంతో టీటీడీపీ రాష్ట్ర నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పెద్దిరెడ్డి, రాములు గురువారం సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల బీమా, ప్రమాదాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందితే రూ.50వేల వరకు రీయింబర్స్‌మెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూన వెంకటేశ్‌గౌడ్, జిల్లా నాయకులు బీఎన్ రెడ్డి, వనం రమేశ్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.