టీ టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
- దయన్నకు ఇన్నాళ్లకు దక్కిన పదవి
- కలిసొచ్చిన సీనియారిటీ
- జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎట్టకేలకు పార్టీలో గుర్తింపు దక్కింది. ఆయన తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టీడీఎల్పీ నేత ఎంపికను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎమ్మెల్యేలు అప్ప గించారు.
ఈ మేరకు శనివారం చంద్రబాబు ఊగిసలాట మధ్య ఎర్రబెల్లికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో టీడీపీకి 15 మంది సభ్యులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లికి శాసనసభ పక్ష నేత పదవి దక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కీలకంగా ఉన్న ఎర్రబెల్లికి శాసనసభాపక్ష నేత పదవి దక్కడంపై జిల్లా ‘దేశం’లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత ఊరు పర్వతగిరి.
టీడీపీ ఆవిర్భాంతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ స్థాపించిన తర్వాత 1983లో జరిగిన మొదటి ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985, 1989 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఇక్కడ టీడీపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. 1994 ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి దయాకర్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి వరుస విజయాలను నమోదు చేస్తున్నారు. 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.
నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ కేటగిరీకి రిజర్వు అయ్యింది. దీంతో ఎర్రబెల్లి 2009 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి మరోసారి గెలిచారు. 2008లో టీఆర్‌ఎస్ ఎంపీ రవీంద్రనాయక్ రాజీనామాతో వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలిచారు.
అరుుతే ప్రత్యక్ష ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసుకున్నా ఎర్రబెల్లికి టీడీపీలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎర్రబెల్లి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికలకు ముందు ప్రభుత్వ విప్ పదవి నిర్వహించారు. కీలక నేతలంతా ఓటమిపాలైన 2004 ఎన్నికల తర్వాత ఎర్రబెల్లికి టీడీపీ పొలిట్‌బ్యూరోలో చోటుదక్కింది. తెలంగాణ ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో తెలుగుదేశంలో ప్రత్యేకంగా తెలంగాణ టీడీపీ ఫోరం ఏర్పాటు చేశారు. ఫోరం ఏర్పాటైన సమయంలో ఎర్రబెల్లికి ఈ పదవి రాలేదు.
ఫోరం కన్వీనరుగా ఉన్న నాగం జనార్దనరెడ్డి పార్టీని వీడి వెళ్లిన తర్వాత దయాకర్‌రావుకు ఈ పదవిని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీ తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని నియమించింది. ఎర్రబెల్లి ఈ కమిటీ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు చివరికి ఎర్రబెల్లికి కమిటీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కీలక నేతలు అంతా ఓటమిపాలవడంతో ప్రస్తుత సభ్యుల్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లిని టీడీఎల్పీ పదవి వరించింది.