బాబు వెన్నుపోటు కంటే పెద్దదేం కాదు
♦ పార్టీ మారడంపై ఎర్రబెల్లి
♦ నాడు ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబుతో వెళ్లాం
♦ అది తప్పు కానిది.. ఇప్పుడు ఇది ఎలా తప్పవుతుంది?
♦ నా చేరికకు ప్రజామోదం ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు 1996లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న విషయం ముందు మా పార్టీ మార్పు, టీఆర్‌ఎస్‌లో చేరిక చాలా చిన్న విషయం. ఎన్టీఆర్‌ను కాదని బాబుతో వెళ్లాం. అది తప్పు కానిది.. ఇప్పుడు ఇది ఎలా త ప్పవుతుంది..’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన శనివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్‌లో నా చేరిక కు నూటికి నూరు శాతం ప్రజామోదం ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, పార్టీ కార్యకర్తలు ఇలా.. అంతా ఆమోదం తెలుపుతున్నారు.
అయినా నాది పార్టీ ఫిరాయింపు కానే కాదు. టీడీఎల్పీని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేశా.. చంద్రబాబు వెన్నుపోటు కంటే ఇది పెద్ద విషయం కాదు..’’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ‘‘ముప్పై అయిదు ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు. భూ కబ్జాలు చేశానా? క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్నవాణ్ని. దయన్న పేరే ఒక బ్రాండ్ నేమ్.’’ అని వ్యాఖ్యానించారు. రెండేళ్ల కిందట పార్టీ మారి ఉంటే వ్యతిరేకత వచ్చేదని, అప్పుడు సగం మంది పార్టీ మారమని, సగం మంది వద్దని సూచించారన్నారు. ‘‘టీడీపీ తెలంగాణలో బతికి ఉంటుందన్న నమ్మకం లేదు. పార్టీని పూర్తిగా బొంద పెట్టారు. అందుకే తప్పలేదు..’’ అని చెప్పారు. పార్టీ మారడం వల్ల భారం అంతా దిగిపోయినట్లు, ప్రశాంతంగా ఉందన్నారు. టీడీఎల్పీని విలీనం చేయడం వల్ల మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీగా గుర్తిస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘1996లో ఎన్టీఆర్ టీడీపీ సభ్యులను ఎలా గుర్తించారో అలానే..’ అని బదులిచ్చారు. తాను పెద్దగా చదువుకోలేదని, చట్టాల గురించి పెద్దగా తెలియకపోయినా, ప్రజల మనోభావాల గురించి బాగా తెలుసని, వాటి ప్రకారమే నడుచుకుంటానని పేర్కొన్నారు.
తప్పలేదన్నా..!
అసెంబ్లీ లాబీల్లోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎర్రబెల్లికి ఎదురు పడ్డారు. ‘ఏం దయాకర్ అన్నా..’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుకరించారు. దీంతో నవ్వుకుంటూ ఉత్తమ్ దగ్గరకు వచ్చిన ఎర్రబెల్లి... ‘తప్పలేదన్నా...’ అని పార్టీ మార్పుపై వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.