నవ్విపోదురు గాక..
- టీడీపీ సభ్యత్వంలో తిరకాసులెన్నో..
- వైఎస్సార్‌సీపీ కీలక నేతలూ ‘తమ్ముళ్లేనట’!
- ఓటరు జాబితా ఆధారంగా సభ్యత్వ కార్డుల ముద్రణ
– అందరికీ అవే పంపిణీ
– ససాక్ష్యాలతో బయటపడుతున్న ‘సభ్యత్వ నమోదు’ డొల్లతనం
– తీవ్రంగా తప్పుబడుతున్న విపక్షాలు
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
- ఇది టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో జారీ చేసిన ఆ పార్టీ సభ్యత్వ కార్డు. దీన్ని ఇచ్చింది మాత్రం టీడీపీ కార్యకర్తకు కాదు. ఈ కార్డులో సభ్యత్వం తీసుకున్నట్లు ఉన్న వ్యక్తి పేరు బండి పరుశురాం. ఈయన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు. ప్రతిపక్ష పార్టీలో కీలక అనుబంధ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే టీడీపీ సభ్యత్వ కార్డు జారీ చేయడాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
- ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మంగల అనిల్ కుమార్. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి. ఈయనకూ టీడీపీ సభ్యత్వ కార్డు ఇచ్చేశారు. ఎవరో వచ్చి ఇంట్లోకి ఓ కవర్ విసిరేశారు. దాన్ని చూస్తే టీడీపీ సభ్యత్వ కార్డు. దీంతో అవాక్కవడం అనిల్ వంతైంది.
ఈ రెండు ఉదాహరణలను పరిశీలిస్తే టీడీపీ సభ్యత్వ నమోదులో డొల్లతనం బట్టబయలవుతోంది. కనీసం ఎవరు టీడీపీ కార్యకర్తో, ఎవరికి సభ్యత్వం ఉందో.. లేదో? తెలుసుకోకుండానే కేవలం ‘సంఖ్య’ను చూపించుకోవడం కోసం ఇష్టానుసారంగా సభ్యత్వ కార్డులు జారీ చేశారు.
ఏదీ పారదర్శకత?!
ఏ రాజకీయ పార్టీ అయినా సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్టీ విధివిధానాలు నచ్చి అందులో చేరిన వ్యక్తి సభ్యత్వ నమోదు రుసుం చెల్లించి గుర్తింపు కార్డు తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీల్లో సాధారణంగా జరిగే తంతు ఇది. కొన్ని పార్టీల నాయకులు గ్రామాలు, వార్డుల వారీగా ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో జాబితాను పరిశీలించి వారి తరఫున రుసుం చెల్లిస్తున్నారు. ఇది మరో పద్ధతి! కానీ తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కృతిని తెరపైకి తెచ్చింది. ఎవరు టీడీపీలో ఉన్నారు? ఎవరు సభ్యత్వం తీసుకున్నారనే అంశాలను పట్టించుకోలేదు.
వార్డుల వారీగా ఓటరు జాబితాలు తెప్పించుకుని, అందులో 30–40 శాతం మంది సభ్యత్వం తీసుకున్నట్లు చూపించి.. వారి పేరుతో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. కనీసం కార్డుల పంపిణీ ముందైనా టీడీపీ స్థానిక నాయకులు ఇందులో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంకు చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నాయా అనేది పరిశీలించడం లేదు. కార్డులు రాగానే కొంతమంది బాయ్స్‌కు కూలి ఇచ్చి డోర్ నంబర్ల వారీగా ఇళ్లలో ఇచ్చేయాలని చెబుతున్నారు. డెలివరీ బాయ్స్‌కు ఏ కార్డు ఎవరిదో? వారు ఏ పార్టీలో ఉంటారో? వారి స్థాయి ఏమిటో కూడా తెలీదు. దీంతో వారు డోర్ నంబర్ల ఆధారంగా పంపిణీ చేసేస్తున్నారు. ఈ కార్డులు అందుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు అవాక్కవుతున్నారు.
‘సంఖ్య’ కోసమే చేశారా?
టీడీపీ అధిష్టానం జిల్లాకు 4,12,290 మందితో సభ్యత్వ నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. కానీ జిల్లా పార్టీ 1,07,147 సభ్యత్వాలు అధికంగా చేసి.. 5,19,437 మందితో సభ్యత్వం చేయించినట్లు లెక్కలు చూపించింది. సభ్యత్వ నమోదులో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద కదిరి 187.97 శాతంతో అగ్రస్థానం, గుంతకల్లు 98.14 శాతంతో చిట్టచివరన ఉన్నట్లు లెక్క చూపారు. వాస్తవ పరిస్థితిని చూస్తే టీడీపీ సభ్యత్వ నమోదు వాస్తవాలకు దూరంగా ఉందని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
సిగ్గుచేటు : బండిపరుశురాం, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
టీడీపీ ఓ సిగ్గులేని పార్టీ. సభ్యత్వ నమోదు చూస్తేనే డొల్లతనం బయటపడుతోంది. లెక్కలన్నీ తప్పుల తడకే. ఓటరు జాబితా ఆధారంగా నమోదు చేస్తే 5లక్షలు కాదు.. జిల్లాలోని ఓటర్లందరికీ టీడీపీ సభ్యత్వ కార్డులే ఇవ్వొచ్చు. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు.