తలమునకలు
- సమగ్ర సర్వేపై కసరత్తు
- ఇళ్లవద్ద మార్కింగ్ చేస్తున్న సిబ్బంది
- మొత్తం ఇళ్లు 9.07లక్షలు
- 39,498మంది సిబ్బంది నియామకం
- ప్రైవేటు ఉద్యోగులకూ బాధ్యతలు
పాలమూరు : ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేటాయించిన ఎన్యుమరేటర్లు ఇల్లిల్లు తిరిగి మార్కింగ్ చేసే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు ఈ సర్వే ఆధారంగానే రూపొందించనున్నారన్న సమాచారం ఉండడంతో బయట ఉన్న వ్యక్తులు కూడా సొంత ఇళ్లకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా సిబ్బంది, అధికారులు ముందుగా గ్రామాలకు, పట్టణాలకు వెళ్లి వార్డుల వారీగా ఇల్లిల్లూ తిరుగుతూ ఇంటి యజమాని పేరు నమోదు చేసుకోవడంతో పాటు ఇంటికి మార్కింగ్ చేసి వస్తున్నారు. దీనివల్ల సమగ్ర సర్వే నిర్వహించే రోజున మార్కింగ్ ఆధారంగా కుటుంబ సర్వే చేపట్టేందుకు సులువయ్యే అవకాశం ఏర్పడుతుందని సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు.
సర్వేకు 39,498 మంది సిబ్బంది
సమగ్ర కుటుంబ సర్వే వివరాల సేకరణకు జిల్లావ్యాప్తంగా 39,498 మంది ఎన్యుమరేటర్లు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినా సిబ్బంది కొరత ఏర్పడటంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా నియమించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సిబ్బందికి సర్వే ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపారు. సమగ్ర సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 39,498 మంది ఎన్యుమరేటర్లను నిర్ణయించగా... 501 రూట్‌లు, 314 జోన్‌లుగా విభజించారు. 1665 వాహనాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 523 ఆర్టీసీ బస్సులు, 195 మినీ బస్సులు ఏర్పాటు చేయగా 947 ఇతర వాహనాలను వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
గుర్తింపు కార్డులు..
క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే ఎన్యుమరేటర్లకు జిల్లా యంత్రాంగం గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాలు గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తోంది. అనధికారికంగా ఎవరూ సర్వే చేపట్టకుండా యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించింది. అయితే ఈ అంశంపై పలు ఆరోపణలొస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించడంతో వివరాల సేకరణ పారదర్శకంగా సాగుతుందా అనే సందేహం నెలకొంది. వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులైతే చర్యలు తీసుకోవచ్చని ఈ నేపథ్యంలో పకడ్బందీగా సర్వే జరుగుతుందని, కానీ ప్రైవేటు సిబ్బందిపై ఏమేరకు చర్యలు తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి.