‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కొందరు అవినీతి అధికారుల తీరు. లాభాపేక్ష లేకుండా, నిష్పక్షపాతంగా పనిచేద్దామని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు ప్రతీన బూనిన కొన్ని గంటల్లోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభించిన రోజే, సాక్షాత్తూ జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేసిన జిల్లా సచివాలయంలోనే ఈ అవినీతి అధికారి పట్టుబడ్డాడు.
కరీంనగర్ క్రైం : బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన న్యాలం శ్రీనివాస్ మరో 24 మందితో కలిసి గీత పారిశ్రామిక సహకార సంఘం అనుమతి కోసం ఎక్సైజ్ సహకార సంఘాల ఇన్‌స్పెక్టర్ పానకల్ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు. అన్నిరకాల పత్రాలు, సంఘం తీర్మానం కాపీని జతచేశారు. పత్రాలు పరిశీలించిన ఆయన గత నెల 19న అనుమతి మంజూరు చేశారు.
సంఘంలో సభ్యత్వ అర్హత, గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఒక్కో సభ్యుడు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని, మొత్తం రూ.25 వేలు ఇస్తేనే మిగతా అనుమతులు ఇస్తానని సదరు ఇన్‌స్పెక్టర్ తెగేసి చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినకుండా రూ.15 వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు. తామందరం కూలీ చేసుకుని బతుకుతామని, చెట్లు కూడా లేవని తక్కువగా ఉన్నాయని చెప్పినా అధికారి వినిపించుకోలేదు. దీంతో శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
మంగళవారమే స్కెచ్
సురేందర్‌రెడ్డిని పట్టుకునేందుకు మంగళవారమే ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు శ్రీనివాస్ డబ్బులు తీసుకుని రాగా, సురేందర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పించుకున్నాడు. బుధవారం సదరు అధికారి శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి రమ్మనడంతో సాయంత్రం 6 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికివచ్చాడు. అక్కడ శ్రీనివాస్ నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా సురేందర్‌రెడ్డిని ఏసీ బీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు.
ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే...
బుధవారం నుంచి ఈ నెల 9 వరకూ ఏసీబీ అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అవినీతిని నిర్మూలిస్తామని బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణం చేశారు. ఎక్కడైతే ప్రమాణం చేశారో అదే కాంప్లెక్స్‌లో ఓ అవినీతి అధికారి కొద్ది గంటల్లోనే పట్టుబడడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతలా పాతుకుపోయిందో చెబుతోంది. ఏ జోన్‌లో లేనంతగా మన జోన్‌లోనే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 మంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఎక్సైజ్‌పై ఫిర్యాదులు
కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. వాటిని సమీక్షించి దాడులు చేస్తున్నాం. ఎక్కడ ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభమైన రోజునే... లంచం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేసిన కొద్ది గంటల్లోనే ఓ అవినీతి అధికారి పట్టుబడ్డాడు.
- సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ
బతిమిలాడినా వినలేదు
సహకార సంఘాల ఇన్‌స్పెక్టర్ రూ.25 వేలు లంచం అడిగిండు. ఎంత బతిమిలాడినా వినలేదు. రెండుమూడు సార్లు కలిసి మా బాధ వివరించినం. చివరకు రూ.15 వేలు ఇస్తేనే సభ్యత్వ అనుమతి, గుర్తింపు కార్డులు ఇస్తానని చెప్పాడు. పేదోళ్లమని చెప్పినా పట్టించుకోలేదు. అందుకే లంచం అడుగుతున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన.
- శ్రీనివాస్, బాధితుడు
నవ్విపోదురు గాక...
Published Thu, Dec 4 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement