మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి
రాజేంద్రనగర్: వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు జీహెచ్‌ఎంసీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తూ, గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్కిల్‌లో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాట్లు చేస్తామన్నారు.
వారు దళారుల భారిన పడి మోసపోతున్నారని, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందన్నారు. వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు మూడు జోన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ ట్రాపిక్, లా ఆండ్ ఆర్డర్, స్థానిక వ్యాపారస్తులను సభ్యులుగా ఉంటారని తెలిపారు. వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో పాటు గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ సభ్యులంతా కలిసి పొదుపు చేసుకునేలా బ్యాంక్ అకౌంట్‌లను తెరిపించి వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు.
జోన్ ల వారిగా వ్యాపారులకు అవకాశం కల్పించడం ద్వారా ట్రాపిక్‌కు సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనిని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐదు గ్రూపులకు చెందిన 80 మందికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపకమిషనర్ దశరథ్, అధికారులు శ్రీనివాస్, పత్యానాయక్, ఆశోక్‌కుమార్, నాయకులు సుధాకర్‌రెడ్డి, సునీత, స్వామి, కృష్ణాయాదవ్, నర్సింగ్‌రావు, రవీందర్, విజయలక్ష్మి, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.