ఆమెకు అప్ఘనిస్తాన్‌ తల వంచింది | Laleh Usmani Fight For Mothers Name In ID In Afghanistan | Sakshi
Sakshi News home page

ఆమెకు అప్ఘనిస్తాన్‌ తల వంచింది

Published Tue, Sep 22 2020 6:43 AM | Last Updated on Tue, Sep 22 2020 8:44 AM

Laleh Usmani Fight For Mothers Name In ID In Afghanistan - Sakshi

సెప్టెంబర్‌ – 17 గురువారం అప్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని అక్కడి  ‘జనాభా నమోదు చట్టాన్ని’ సవరిస్తూ ఒక చరిత్రాత్మక సంతకం చేశారు. ఈ ఒక్క సంతకంతో అప్ఘనిస్తాన్‌లో ఇకపై ఆడవాళ్ల పేర్లు వినపడనున్నాయి. పిల్లల గుర్తింపు కార్డు మీద తల్లి పేరు కనపడనుంది. డాక్టర్‌ మందు చీటి మీద పేరు కనపడనుంది. చనిపోతే డెత్‌ సర్టిఫికెట్‌ మీద కూడా  పేరు కనపడనుంది. స్త్రీ పేరును బయటకు చెప్పడం అమర్యాదగా భావించే ఆ దేశంలో గత మూడేళ్లుగా పోరాడి మార్పు తెచ్చిన స్త్రీ లాలె ఉస్మాని. ‘వేర్‌ ఈజ్‌ మై నేమ్‌’ పేరుతో ఆమె నడిపిన ఉద్యమమే ఇందుకు కారణం.

అప్ఘనిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు మామూలు. ఒక మహిళకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుని దగ్గరకు వెళ్లింది. అతను పరీక్షలు చేసి ఆమెకు ‘కరోనా’ అని నిర్థారణ చేశాడు. ఆమె ఇంటికి వచ్చి భర్తకు మందు చీటి ఇచ్చి మందులు తెమ్మంది. అతడు దానిని చూసిన వెంటనే ఆమెను చావబాదటం మొదలెట్టాడు. కారణం ఆ మందు చీటి మీద ఆమె పేరు ఉంది. అక్కడ ఆమె పేరుకు బదులు ‘ఫలానా అతని భార్య’ అని ఉండాలి. ఎందుకంటే అప్ఘనిస్తాన్‌లో స్త్రీ పేరు బయటకు చెప్పడం తప్పు. నిషిద్ధం. భార్య తన పేరును డాక్టరుకు చెప్పడం భర్తకు నామోషీ. అందుకే ఈ బాదుడు.

అప్ఘనిస్తాన్‌లో ఆడపిల్ల పుడితే చిన్నప్పుడు ‘ఫలానా అతని కుమార్తె’గా, వయసులోకి వచ్చాక ‘ఫలానా అతని భార్యగా’, వృద్ధురాలయ్యాక ‘ఫలానా అతని తల్లిగా’ బతికి చనిపోవాలి. అన్నట్టు అక్కడ డెత్‌ సర్టిఫికెట్‌ మీద కూడా ఆమె పేరు రాయరు. సమాధి ఫలకం మీద కూడా ఆమె పేరు రాయరు. అన్నిచోట్ల ఆమె ఉనికి ఆ ఇంటి మగవాడి పేరుతో ముడిపడి ఉంటుంది తప్ప ఆమె పేరుతో ముడిపడి ఉండదు. 

2001కి ముందు అప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల ఏలుబడిలో స్త్రీల పరిస్థితి ఘోరంగా ఉంటే తాలిబన్ల పతనం తర్వాత ఏర్పడిన ప్రభుత్వ హయాముల్లో కూడా స్త్రీలు తమ కనీస హక్కు కోసం సుదీర్ఘంగా పోరాడుతూనే రావాల్సి వస్తోంది. విద్యా హక్కు కోసం, పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం వారు మెరుగైన విజయాలు సాధించినా ప్రతి స్త్రీ తమ సొంత కుటుంబంలోని పురుషుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, హింస చవిచూడాల్సి వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా కనీసం పేరు బయటకు రాని, చెప్పలేని పరిస్థితి ఉండటం అక్కడ హక్కుల కార్యకర్తలను పోరాటానికి దింపింది. ‘ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను’ అంటారు 25 ఏళ్ల లాలె ఉస్మాని. 

పశ్చిమ అఫ్ఘనిస్తాన్‌ పట్టణమైన హెరత్‌కు చెందిన లాలె ఉస్మాని మూడేళ్ల క్రితం హ్యాష్‌ట్యాగ్‌ వేర్‌ ఈజ్‌ మై నేమ్‌’ కాంపెయిన్‌ను మొదలెట్టినప్పుడు ఇది వెంటనే అప్ఘనిస్తాన్‌లోని ఆలోచనాపరులందరినీ ఆకట్టుకుంది. దేశం బయట కూడా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. దేశం బయట స్థిరపడిన అప్ఘన్‌ ఆలోచనాపరులు ఈ కాంపెయిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. ‘స్త్రీల పేరు స్త్రీల హక్కు’ అని ఈ కాంపెయిన్‌ చెబుతుంది. ముఖ్యంగా అప్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం జారీ చేసే పిల్లల గుర్తింపు కార్డుల్లో తల్లి పేరు ఉండాల్సిందేనని ఈ కాంపెయిన్‌ పట్టుబట్టింది. 

అయితే దీనికి లోపలి అంగీకారం రావడం అంత సులువు కాలేదు. అసలు అక్కడి స్త్రీలలో చాలామంది మా పేరు బయటకు రావడం ఎందుకు అనే భావజాలంలో ఉన్నారు. ‘నా పేరు బయటకి వస్తే ఇంటి పరువు ఏం కాను’ అని ఒక స్త్రీ అంది. ఇక చాందసులైన పురుషులు కొందరు లాలె ఉస్మానిని ఉద్దేశిస్తూ ‘నీ పిల్లల గుర్తింపు కార్డులో నీ పేరు ఎందుకు కావాలో మాకు తెలుసులే. ఆ పిల్లల తండ్రి ఎవరో నీకు తెలియదు కదా’ అని దారుణంగా కామెంట్‌ చేశారు. స్త్రీల పేర్లు గుర్తింపు కార్డుల్లో వచ్చేలా ‘జనాభా నమోదు చట్టం’ను సవరణ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు పార్లమెంటులో కొందరు సంప్రదాయవాదులు గట్టి వ్యతిరేకత ప్రదర్శించారు. అయినప్పటికీ లాలె ఉస్మానీ ఆమె సహచరులు ఇంకా దేశ విదేశాల్లోని ఆలోచనాపరులు పదే పదే ఈ కాంపెయిన్‌ను కొనసాగించారు. చివరకు దేశాధ్యక్షుడైన అష్రాఫ్‌ ఘని స్త్రీల సంకల్పానికి తల వొగ్గారు. వ్యతిరేకతలు లెక్క చేయకుండా స్త్రీల పేర్లకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తేశారు. ఇది ఒక పెద్ద, ఘనమైన విజయం.

ప్రస్తుతం అక్కడ అప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి తాలిబన్లకు శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి కోసం స్త్రీ స్వేచ్ఛను పణంగా పెట్టమని తాలిబన్లు కోరే వాతావరణం ఉన్నప్పటికీ అఫ్రాఫ్‌ ఘని ప్రభుత్వం స్త్రీల పురోభివృద్ధి గురించి తమ వైఖరి స్పష్టం చేస్తూ చట్ట సవరణ చేయడం చూస్తుంటే మున్ముందు అప్ఘనిస్తాన్‌లో స్త్రీ వికాసం మరింత జరుగుతుందనే ఆశ కలుగుతోంది. జరగాలనే కోరుకుందాం.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement