పార్కుల్లో సిబ్బందికి గుర్తింపు కార్డులు
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి
పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హబ్
జూన్ నాటికి చిల్డ్రన్ పార్క్ సిద్ధం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వుడా వీసీ బాబూరావునాయుడు
విశాఖపట్నం : విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా) పరిధిలో నడుస్తున్న పార్కుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టాలని వుడా భావిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విధుల్లో లేనివారికి సైతం వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వుడా ఆస్తుల పరిరక్షణకు, కొత్త ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ వివరాలను వుడా వీసీ బాబురావు నాయుడు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాక్షి : వుడా ఆధ్వర్యంలో ఉన్న పార్కులు అధ్వానంగా ఉన్నాయి. వాటిని మెరుగుపరిచే ఏర్పాట్లేమైనా జరుగుతున్నాయా?
వీసీ : పార్కులను సంరక్షించే బాధ్యత అందరిదీ. అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో సందర్శకుల సహకారం కూడా అవసరం. మా వైపు నుంచి కూడా చర్యలు చేపడుతున్నాం. పాండురంగాపురం పార్కును పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాం. తర్వాత అన్ని పార్కులను అదే విధంగా చేయాలనుకుంటున్నాం.
సాక్షి : పర్యవేక్షణ లేకపోవడం వల్ల పార్కుల్లో సిబ్బంది విధుల్లో లేకపోయినా వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై దృష్టి సారిస్తున్నారా?
వీసీ : ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. విధులకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారనే అనుమానాలున్నాయి. అవకతవకలను అరికట్టడానికి వుడా పార్కుకు ప్రత్యేకాధికారిని నియమించాం. ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. సరిదిద్దేందుకు సాక్షి : సిబ్బంది అవకతవకలకు పాల్పడకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
వీసీ : ఇప్పటివరకు పార్కుల్లో సిబ్బంది హాజరుకు సంబంధించి ఎలాంటి పటిష్ట ఏర్పాటు లేదు. ఇకపై ఆ పరిస్థితి కొనసాగకుండా సిబ్బందికి గుర్తింపుకార్డులు ఇవ్వనున్నాం. అవసరమైతే బయోమెట్రిక్, లేదా కార్డుకే బార్ కోడింగ్ ఇచ్చి స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. సైరన్ విధానాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుదని కూడా ఆలోచిస్తున్నాం. అన్నిటికంటే ముందు అసలు ఏ పార్కులో ఎంత మంది పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నాం.
సాక్షి : ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోతున్నట్లున్నాయి?
వీసీ : కొన్ని ప్రాజెక్టులు సాంకేతిక కారణాల వల్ల అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. వుడా చిల్డ్రన్ పార్కు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జపాన్ చైర్ల వంటివి వేయడం, ఇతర హై క్వాలిటీ పరికరాలు అమర్చంలో ఆలస్యం జరుగుతోంది. సెంట్రల్ పార్కు పనులు కూడా అంతే. ఫౌంటెన్ నాణ్యత విషయంలో రాజీపడలేకపోతున్నాం. మెరుగ్గా ఉండాలనే సమయం తీసుకుంటున్నాం. ఈ రెండూ జూన్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తాం.
సాక్షి : షాపింగ్ కాంప్లెక్స్‌ల పరిస్థితి?
వీసీ : సీతమ్మధారలో రూ.8.30 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిలో 32 షాపులు, 8 కార్యాలయాలు, 4 షోరూమ్‌లు వస్తాయి. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఆయన ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఎంవీపీలో రూ.10.30 కోట్లతో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది.
సాక్షి : కొత్త వెంచర్ల ప్రగతి ఎలా ఉంది?
వీసీ: దాకమర్రిలో ప్రైవేటు భాగస్వామ్యంతో వెంచర్ వేశాం. దీనిలో కొన్ని వేలంలో, కొన్ని లాటరీలో కేటాయిస్తాం. దీనివల్ల మధ్యతరగతి వారికి దక్కే అవకాశం వస్తుంది. హరిత వెంచర్ సిద్ధంగా ఉంది. పెందుర్తి, సబ్బవరం పరిసర ప్రాంతాలను కలుపుతూ ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.
సాక్షి : భూ ఆక్రమణలను అడ్డుకునే చర్యలు..?
వీసీ : వుడా స్థలాలపై సర్వే చేయించాం. ఇప్పటికే 250 అక్రమ లే అవుట్లను గుర్తించాం. వాటిలో కొన్ని ధ్వంసం చేశాం. అందరికీ నోటీసులు ఇచ్చాం. జియోటాగింగ్ విధానం తీసుకువస్తున్నాం. స్థలాల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తాం.