breaking news
Mahatmagandhi National Rural Employment guarantee scheme
-
‘ఎంజీనరెగా బచావో సంగ్రామ్’ కన్వీనర్‌గా మాకెన్
న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజులపాటు కొనసాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) బచావో సంగ్రామ్ కమిటీ కన్వీనర్‌గా సీనియర్ నేత అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ ఆందోళన కార్యక్రమాల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, పరిశీలన కోసం సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏర్పాటు చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ సారథ్యంలోని కమిటీలో సీనియర్ నేతలు జైరాం రమేశ్, సందీప్ దీక్షిత్, ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే సభ్యులుగా ఉంటారు. ఇందులో తెలంగాణ నాయకురాలు డి. అనసూయ సీతక్క, దీపికా పాండే సింగ్, సునీల్ పన్వర్, మనీశ్ శర్మలను ఖర్గే నియమించారు. ఏఐసీసీలోని ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ, ఆదివాసీ విభాగాల చైర్పర్సన్లు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కమిటీలో సభ్యులేనని వేణుగోపాల్ వివరించారు. ఉపాధి హామీని తిరిగి అమలు చేయడంతోపాటు కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించడం తెల్సిందే. -
ఉపాధి పథకం..చట్టబద్ధ హామీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) చట్టం దానధర్మ పథకం కాదు, రాజ్యాంగ పరమైన చట్టబద్ధ హామీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా కోట్లాది పేదలకు స్వగ్రామాల్లోనే ఉపాధి లభించిందని, ఆకలి, బల వంతపు వలసలు తగ్గాయని, గ్రామీణ కూలీల వేతనాలు పెరిగాయని తెలిపారు. మహిళల ఆర్థిక గౌరవాన్ని ఈ పథకం బలోపేతం చేసిందన్నారు. అలాంటి ఉపాధి హా మీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతు న్నాయని, ప్రతిపాదిత జీ రామ్ జీ చట్టం ద్వారా కో ట్లాది గ్రామీణ కార్మికుల హక్కులను హరించి వేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ చట్టం బచావో సంగ్రామ్’ను కాంగ్రెస్ ప్రారంభించిన ట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం ముందు మూడు డిమాండ్లను ఉంచారు. జీ రామ్‌జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని, ఉపాధి చట్టాన్ని హక్కుల ఆధారిత చట్టంగా తిరిగి అమలు చేయాలని, పని హక్కు, పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం చట్టం ద్వారా పని హక్కును రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నరు. ఇకపై ఉపాధి హామీ ఉండదని, ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే అనుమతి ఆధారంగా పని కల్పిస్తారని పేర్కొన్నారు. బడ్జెట్‌కు పరిమితి విధించడం వల్ల సంక్షోభ సమయంలోనూ పనులు నిలిచిపోయే ప్రమాదముందని తెలిపారు. నిధులు, పనులపై నిర్ణయాలు ఢిల్లీ నుంచే తీసుకోవడం ద్వారా గ్రామ సభలు, పంచాయతీలను నిస్సత్తువగా మార్చే యత్నమని ఆయన విమర్శించారు. 60 రోజుల పని బ్లాక్అవుట్ నిబంధన అత్యవసర సమయంలో ఉపాధి నిరాకరణకు చట్టబద్ధత ఇస్తుందన్నారు. వేతనాలు అనిశ్చితంగా మారడం, 40 శాతం నిధుల భారం మోపడం వల్ల పేద రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. బయోమెట్రిక్, యాప్ ఆధారిత టెక్నాలజీ వల్ల నిజమైన కూలీలు ఉపాధి నుంచి వెలివేతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ఆస్తుల సృష్టి స్థానంలో కాంట్రాక్టర్ తరహా పనులు పెరుగుతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ శాంతియుతంగా, దృఢంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. -
వీబీ–జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం సంతకం చేశారు. దాంతో అది వీబీ–జీ రామ్ జీ చట్టం–2025గా అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ కూడా వెలువడింది. గ్రామీణ ఉపాధి, అభివృద్ధి సాధన దిశలో ఇది కీలక మైలురాయిగా నిలవగల సంస్కరణ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 2047కల్లా భారత్ ను వికసిత దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో భాగంగానే కొత్త చట్టాన్ని తెచ్చినట్టు కేంద్రం వివరించింది. దీనికింద గ్రామీణులకు ఏటా కనీసం 125 పనిదినాలు కల్పించనున్నారు. ఈ బిల్లును నిరసనలు, ఆందోళనల మధ్యే గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. తమ హయాంలో వచ్చిందన్న ఒకే ఒక్క కారణంగా చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏ ను కక్ష కొద్దీ మోదీ సర్కారు రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివ రాజ్ పాటిల్ తోసిపుచ్చారు. కొత్త చట్టంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఎంజీఎన్ఆర్ఈజీఏ కన్నా ఒకడుగు ముందున్న చట్టం’ అని ఆదివారం ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. శాంతి బిల్లుకు కూడాపౌర అణు శక్తి రంగంలోకి ప్రైవేటు భాగస్వా ములను కూడా అనుమతించేందుకు ఉద్దేశించిన సస్టైనబుల్ హర్నెసింగ్ అండ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ ఇండియా (శాంతి) బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ బిల్లుపై శనివారం ఆమె సంతకం చేశారు. ఆదివారం వెలువడ్డ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఈ మేరకు పేర్కొంది. 1962 నాటి అటామిక్ ఎనర్జీ యాక్ట్, 2010 నాటి సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. -
ఇక మహా ఉద్యమమే
న్యూఢిల్లీ: పేద కూలీల ప్రగతి కోసం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుల్డోజ్ చేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని పక్కనపెట్టి కొత్తగా తీసుకొస్తున్న నల్ల చట్టంతో పేదలు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోనియా గాంధీ శనివారం వీడియో సందేశం విడుదల చేశారు. ఉద్యమంలోకి అడుగుపెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, గ్రామీణ పేదల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, కూలీలు, భూమిలేని పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో ఆమోదం పొందిన సందర్భాన్ని సోనియా గుర్తుచేశారు. ఈ చట్టం ఒక విప్లవాత్మకమైన అడుగుగా అభివరి్ణంచారు. ఉపాధి హామీ పథకంతో నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని వివరించారు. గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం, గాంధీజీ పేరును తొలగించడం తీవ్ర విచారకరమని సోనియా గాంధీ ఉద్ఘాటించారు. ఎవరినీ సంప్రదించకుండా, ఎలాంటి చర్చ లేకుండా, ప్రతిపక్షాన్ని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని ధ్వజమెత్తారు. కొత్త చట్టంతో పథకం అసలు లక్ష్యం పూర్తిగా బలహీనపడుతోందని, ఎవరికి, ఎప్పుడు, ఎలా ఉపాధి కల్పించాలన్నది ఇక ఢిల్లీలోని ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి వస్తుందన్నారు. నిరుపేద సోదర సోదరీమణులకు ఉపాధి హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో 20 ఏళ్ల క్రితం ఉద్యమించానని, మరోసారి అలాంటి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
కర్మశ్రీ పథకానికి గాంధీజీ పేరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అమలవుతున్న గ్రామీణ ఉపాధి పథకం ‘కర్మశ్రీ’కి మహాత్మాగాంధీ పేరు పెడతామని సీఎం మమత ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు ను వికసిత్–భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ)(వీబీ–జీ రామ్ జీ)అంటూ మారుస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. కొన్ని రాజ కీయ పార్టీలు జాతిపిత మహాత్మాగాంధీకి కూడా గౌరవం ఇవ్వడం లేదంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురు వారం కోల్‌కతాలో వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో జరిగిన కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఏ కార్యక్రమం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించాలని నిర్ణయించడం చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు. జాతి నేతలను వాళ్లు (బీజేపీ)గౌరవించలేకుంటే, మేం ఆ పని చేస్తాం. కర్మశ్రీ పథకాన్ని ఇకపై గాంధీజీ పేరుతో పిల్చుకుంటామన్నారు. కర్మశ్రీ పథకం కింద బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల వారికి 75 రోజుల పనిదినాలను కల్పిస్తారు. -
‘జీ రామ్ జీ’కి జై
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది. విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ చర్చకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. ఉపాధి హమీ పథకంలో అవినీతి జరుగుతోందని, లోపాలను సరిచేయడానికే బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పథకంలో మార్పులు చేస్తున్నామని, స్థిరాస్తులను సృష్టించడం, గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడం పథకం ఉద్దేశమని వివరించారు. గాం«దీజీ ఆదర్శాలను మోదీ ప్రభుత్వం పాటిస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ఎన్నో ప్రథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గాంధీజీ పేరు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాముడి పేరుపై ఎందుకంత అసహనం? విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే జీ రామ్ జీ బిల్లును రూపొందించామని శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు. గ్రామీణ ఉపాధికి ప్రభుత్వం దాదాపు రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ నిధులను నీటి సంరక్షణ, గ్రామీణ, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, ప్రతికూల వాతావరణ సమస్యలను పరిష్కరించే పనుల కోసం వెచ్చించబోతున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలో బిల్లు ప్రతులను చించివేసి దుర్మార్గుల్లా ప్రవర్తించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గూండాయిజంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. బిల్లుకు జీ రామ్ జీ అని పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నించారు. పేరుపై రాద్ధాంతం అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం పేరును పట్టుకొని వేలాడుతున్నాయని, తాము మాత్రం పనిపై దృష్టి పెట్టామని స్పష్టంచేశారు. రాముడి పేరు వినిపిస్తే ఎందుకంత అసహనం? అని నిలదీశారు. విపక్షాల నిరసన ర్యాలీ జీ రామ్ జీ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కోరారు. స్పీకర్ ఓం బిర్లా అందుకు అంగీకరించలేదు. దీనిపై మాట్లాడేందుకు అన్ని పారీ్టల సభ్యులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేరణ స్థలంలోని గాం«దీజీ విగ్రహం నుంచి మకరద్వారా వరకూ నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం హత్య చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభలో బిల్లు.. జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్లో...→ ప్రతి పక్షాల తీవ్ర నిరసనల మధ్య ‘జీ రామ్ జీ’ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కింది. → సభలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. → అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. → రాజ్యసభలో అర్ధరాత్రి దాటాక జీరామ్‌జీ బిల్లు ఆమోదం పొందింది. → అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కల్పిచడానికి ఉద్దేశిచిన ‘శాంతి’ బిల్లుకు పార్లమెంట్ జై కొట్టింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభలో ఓకే అయ్యింది.→ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ‘సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు’ను ప్రవేశపెట్టారు. → స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. -
‘ఉపాధి’ భారం రాష్ట్రాలపైనా!
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) చట్టం ఇక కనుమరుగు కానుంది. దాని స్థానంలో వికసిత భారత్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీజీ ఆర్‌ఏఏఎం–జీ) పేరిట కోటా చట్టాన్ని మోదీ సర్కారు తేనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇది గ్రామీణులకు ఏటా కనీసం 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుందని బిల్లు ప్రతిలో పేర్కొన్నారు. ఇది చట్టంగా అమల్లోకి వచ్చిన ఆర్నెల్ల లోపు అందులోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొత్త పథకాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం కాగా కొత్త చట్ట భారాన్ని మాత్రం రాష్ట్రాలు కూడా మోయాల్సి ఉంటుంది. దాన్ని ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 10 శాతంగా, ఇతర రాష్ట్రాలకు 40 శాతంగా నిర్ణయించారు. అసెంబ్లీలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో పథక వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి గా భరిస్తుంది. అంతేకాకు మరో మెలిక కూడా పెట్టారు. కొత్త పథకం కింద ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించి అంతటితో సరిపెడతారు. వ్యయం అంతకు మించితే సంబంధిత రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. నాలుగింటిపై దృష్టి కొత్త ఉపాధి హామీ పథకం ప్రధానంగా 4 రకాల పనులపై దృష్టి సారించనుంది. జలభద్రత ( నీటి సంరక్షణ, సాగునీరు, నీటి వనరుల పునరుజ్జీవం, అడవుల పెంపకం వంటివి), మౌలిక గ్రామీణ వసతులు (రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వంటివాటి నిర్మాణం, మెరుగుదల), జీవనాధార సంబంధిత వసతులు, వాతావరణానికి అనుగుణంగా సర్దుబాట్లు. ‘ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 20 ఏళ్లుగా గ్రామీణులకు ఉపాధి భద్రత బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది. అయితే గ్రామాల్లో మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది‘ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.గాంధీ పేరెందుకు తీసేశారు? కేంద్రానికి విపక్షాల ప్రశ్నా్రస్తాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పేరు మార్పు ప్రతిపాదనపై విపక్షాలు సోమవారం మండిపడ్డాయి. పథకం నుంచి గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ను ఎలాగైనా టాప్ మోదీ ప్రధాని అయిన నాటినుంచి చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సప్తగిరి ఉలక ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి అధికార బీజేపీ ఏం సాధిస్తోందని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాముఖంగా ప్రశ్నించారు. దీన్ని గాం«దీకి అవమానంగా రుణం కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ అభివరి్ణంచారు. పేరు మార్పు ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్నే దుంపనాశనం చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి దుయ్యబట్టారు. -
ఎన్ఆర్ఈజీఎస్ ‘అధిక ఖర్చులపై’ విచారణకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో ‘అధిక ఖర్చు’గా గుర్తించిన పనులపై రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఆడిట్లు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు నిర్వహించిన కేంద్రం, తొలిసారి రాష్ట్రాలే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయాలని సూచించింది. ఈ మేరకు ఏప్రిల్‌లోనే రాష్ట్రాలకు ఒక సలహా జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, కొన్ని పనుల్లో ఖర్చులు ఎందుకు ఎక్కువయ్యాయనే విషయంపై విశ్లేషణను కూడా పంపింది. దీనిపై సాంకేతిక, పరిపాలనా అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ అంశంపై ఇప్పటికే త్రిపుర, జార్ఖండ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తాత్కాలిక నివేదికలు సమర్పించగా, మిగతా రాష్ట్రాలు స్పందించలేదు. దీంతో జూలై 14, 15 తేదీల్లో జరిగిన 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి పనితీరు సమీక్ష కమిటీ (పీఆర్సీ) సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. నివేదికల సమర్పణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన కేంద్ర అధికారులు, వెంటనే పూర్తి వివరాలతో నివేదికలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. 2030 వరకు పథకాన్ని కొనసాగించేలా.. ప్రతీ ఏడాది సుమారు రూ.1 లక్ష కోట్ల వరకు వ్యయం అయ్యే ఎన్ఆర్ఈజీఎస్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.86 వేల కోట్ల కేటాయింపులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకంపై మొత్తం రూ.11.57 లక్షల కోట్ల వ్యయం చేశారు. కాగా 2006లో యూపీఏ–1 ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా, 2008–09 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేశారు. కరోనా సమయంలో (2020–21) 7.55 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ పథకంలో పనిచేసి రికార్డు సృష్టించాయి. ఆ తరువాత డిమాండ్ క్రమంగా తగ్గుతూ 2024–25 నాటికి 5.79 కోట్ల కుటుంబాలకు పడిపోయింది. ఇక, ఈ పథకాన్ని 2029–30 వరకు కొనసాగించేందుకు రూ.5.23 లక్షల కోట్ల వ్యయంతో కొత్త ప్రతిపాదనను కేంద్రం వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ)కు పంపింది. అయితే.. పశ్చిమ బెంగాల్లో 2022 మార్చి నుంచి ఈ పథకం నిలిపివేశారు. -
సమస్తం..‘ఆధార’మే
అక్రమాల చెక్కు నివారణోపాయం చేవెళ్ల: మీవద్ద ఎన్ని గుర్తింపు కార్డులున్నా అవి అంతగా ప్రాధాన్యం లేనివే కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డుయే లింకు కాబోతుంది.ప్రభుత్వ పథకాలలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అర్హులైన వారికే ప్రయోజనాలను అందించడానికి, దళారుల వ్యవస్థనుంచి లబ్ధిదారులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లకు ఈ ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా ఓటరు గుర్తింపు కార్డులతో కూడా లిం కు పెట్టబోతున్నారు. ఓటరు కార్డులతో ఆధార్‌ను లింకుచేస్తే బోగస్ ఓటర్లను అవలీలగా తొలగించే వీలున్నందున ముందుగా సైబరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీల నుంచి ఆధార్ కార్డులతో పాటుగా వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. వీటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానం ద్వారా కూలీలకు, పింఛన్‌దారులకు ఇక నుంచి పోస్టాఫీసు, బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుని నెంబరును ఆధార్‌కార్డుతో లింకుచేసి నగదు బదిలీ పథకం ద్వారా సబ్సీడీని నేరుగా బ్యాంకు ఖాతాలో వేయడం తప్పనిసరి చేయబోతోంది. ఉపాధి పైసలకు భరోసా... నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉపాధి పనులను ఏటా చేపడుతున్నారు. చేవెళ్ల మండలంలోనే 11,900 మందికి పైగా జాబ్‌కార్డుదారులున్నారు. షాబాద్, నవాబుపేట మండలాల్లో సైతం ఉపాధి కూలీలు అధికంగా ఉన్నారు. ఏటా రూ. కోట్లు విలువ చేసే పనులను ఉపాధిహామీ పథకంలో చేపడుతున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతుండటం వల్ల కూలీలకు చెల్లింపుల్లో అన్యాయం జరిగేది. దీంతో ఆధార్‌తో అనుసంధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఆధార్ సీడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పింఛను లబ్ధిదారులకు సైతం.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభయహస్తం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కలిపి సుమారుగా 19 వేల వరకు ఉన్నాయి.బోగస్ పేర్లతో పలువురు పింఛన్ అందుకుంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి బోగస్‌ల అడ్డుకట్టకు చేపడుతున్న ఆధార్, బ్యాంకు ఖాతా నమోదుతో పింఛన్‌దారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా చేరనుంది. బోగస్‌రేషన్ కార్డుల గుర్తింపులో ప్రధాన పాత్ర.. ఆధార్ అనుసంధానంతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతకు మార్గం సులభతరమైందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం రేషన్‌కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న బోగస్ రేషన్‌కార్డులను గుర్తించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరిన్ని బోగస్ కార్డులను ఏరి వేయడానికి వీలవుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.


