అక్షరాస్యత, ఆదాయం అంతంతే! | very poor situation in education and income in telangana | Sakshi
Sakshi News home page

అక్షరాస్యత, ఆదాయం అంతంతే!

Published Sat, Jul 4 2015 1:51 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అక్షరాస్యత, ఆదాయం అంతంతే! - Sakshi

అక్షరాస్యత, ఆదాయం అంతంతే!

► తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి
► పల్లె సీమల్లో 40.42% నిరక్షరాస్యత
► 95.50 లక్షల మంది నిరక్షరాస్యులు
► కేవలం రూ.5 వేల నెల జీతంతో నెట్టుకొచ్చే కుటుంబాలు ఏకంగా 75%
► కేంద్ర సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వేలో వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, అక్షరాస్యత అంతంతేనని తేలింది. మొత్తం కుటుంబాల్లో 7.64 శాతం కుటుంబాలు మాత్రమే నెలసరి జీతం పొందే ఉద్యోగాలపై ఆధారపడి ఉన్నాయి. అందులోనూ రూ.5 వేల లోపు జీతం అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 75.41% కుటుంబాలు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇక అక్షరాస్యత చూస్తే జాతీయ సగటుతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. నిరక్షరాస్యుల జాతీయ సగటు 35.73 శాతం ఉండగా.. రాష్ట్రంలోని పల్లెల్లో 40.42 శాతం నిరక్షరాస్యత నమోదైంది. ఏకంగా 95.50 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు.

అక్షరాస్యులు 59.58 శాతం మాత్రమే ఉన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2011 సామాజిక, ఆర్థిక, కుల జనగణన సర్వే (గ్రామీణ ప్రాంతాలు) వివరాలను విడుదల చేశారు. తెలంగాణలో మొత్తం 83,06,746 కుటుంబాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 57,06,161 కుటుంబాలున్నాయి. తెలంగాణ పల్లెసీమల్లో 2.36 కోట్ల మంది నివాసం ఉండగా.. ఒక్కో కుటుంబంలో సగటున 4.14 మంది సభ్యులున్నారు. గ్రామాల్లోని మొత్తం జనాభాలో 1.19 కోట్ల మంది పురుషులు, 1.16 కోట్ల మంది మహిళలున్నారు. 1,981 మంది హిజ్రాలున్నారు. 83.93 శాతం కుటుంబాలకు పురుషులు యజమానులుగా ఉంటే.. 16.06 శాతం కుటుంబాలకు మహిళలే పెద్దదిక్కుగా ఉన్నారు. 10.51 లక్షల మంది వితంతువులున్నారు. ఇక కులాల వారీగా చూస్తే 10,25,439 (17.99%) ఎస్సీ కుటుంబాలు, 6,81,169 (11.94%) ఎస్టీ కుటుంబాలున్నాయి. 39,96,561 (70.04%) ఇతర కుటుంబాలున్నాయి. 1,587 కుటుంబాలను కులం లేని కేటగిరీగా లేదా ఆదివాసీ కుటుంబాలుగా గుర్తించారు.
 
 తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి
 మొత్తం కుటుంబాలు    57,06,101
 వెనకబాటుతనంలో ఉన్నవి    25,35,522
 భూమిలేక కూలీపై ఆధారపడిన కుటుంబాలు        
     19,71,246 (34.55 శాతం)
 గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు    1,11,432

 
 సగానికి పైగా కూలీలే
 రాష్ట్రంలో వ్యవ సాయంపై ఆధారపడిన కుటుంబాలు 1494378 ఉన్నాయి. ఇందులో రోజూవారీ కూలీకి వెళ్లే కుటుంబాల సంఖ్య 2829348, ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు 144001, కాగితాలు ఏరుకునే వారు 12247 కుటుంబాలు ఉండగా, వ్యవసాయేతర పనులు(చిన్నచిన్న వ్యాపారాలు) చేసేవారు 150622, ఇంకనూ అడుక్కునే కుటుంబాల సంఖ్య 11273..

 నెల జీతం 7.64% మందికే
 గ్రామీణ ప్రాంతాల్లో 3.50 లక్షల కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాయి. మొత్తం కుటుంబాల్లో 7.64% మాత్రమే నెలసరి జీతం పొందే ఉద్యోగాలపై ఆధారపడ్డాయి. 2.73% ప్రభుత్వ ఉద్యోగాలు, 2% ప్రభుత్వరంగ సంస్థలు, 2.95% ప్రైవేటు రంగం నుంచి జీతాలు అందుకుంటున్నారు. కుటుంబంలో జీతం అందుకుంటున్నవారిని లెక్కలోకి తీసుకుంటే... నెలవారీగా రూ.5 వేల లోపు జీతం అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువ.  18.77% కుటుంబాలు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య, కేవలం 5.75% మంది రూ.10 వేలకు మించి జీతం అందుకుంటున్నాయి
 
 అత్యధికంగా మొబైల్ ఫోన్లు
 గ్రామీణ ప్రాంతాల్లో 83.44% మందికి సెల్ ఫోన్లుండగా 30.02% మందికి మోటార్ వాహనాలున్నాయి. టెలిఫోన్(ల్యాండ్‌లైన్) సదుపాయం ఉన్న కుటుంబాలు 67,025 కాగా, మొబైల్ 47,61,293 కుటుంబాలకు(83.44శాతం) ఉంది. రెండూ(మొబైల్/ల్యాండ్‌లైన్)ఉన్న కుటుంబాలు 1,07,823 ఉన్నాయి. మోటారు వాహనాలు (2,3,4 చక్రాలు) కలిగిన కుటుంబాలు 17,12,917 ఉన్నాయి. 5,96,588 కుటుంబాలకు రిఫ్రిజిరేటర్లున్నాయి.
 
 భూమి లేనోళ్లే ఎక్కువ
 భూమి ఉన్న వాళ్ల తో పోలిస్తే  గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వాళ్లే ఎక్కువగా ఉన్నా రు. 58% మందికి భూమి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో  27367829.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగుకు యోగ్యం లేని భూమి 8415384.36 ఎకరాలు ఉండగా,9857792.93 ఎకరాల్లో ఏడాదికి 2 పంటలు పండుతాయి. వ్యవసాయ భూమి కలిగిన కుటుంబాలు 24,17,061 ఉండగా, భూమిలేని కుటుంబాలు 32,88,938 ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement