ఆ బాబు నీడలు మాకొద్దు | will not tolerate chandrababu Naidu's rule | Sakshi
Sakshi News home page

ఆ బాబు నీడలు మాకొద్దు

Published Tue, Mar 25 2014 1:53 AM | Last Updated on Mon, Oct 22 2018 7:36 PM

will not tolerate chandrababu Naidu's rule

ఒక వికలాంగురాలిగా నా అనుభవ పాఠాలతో చెబుతున్నాను. ప్రభుత్వాలిచ్చే సామాజిక పెన్షన్లను రాజకీయంగా చూడవద్దు. సామాజికంగా దెబ్బతిన్న వర్గాలకు ఇది చేయూత అనుకోండి. వారు భావితరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని మరవద్దు. అలా ఆలోచించే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నది నా కోరిక. వికలాంగులు, వయో వృద్ధులు, వితంతువుల ఆవేదన నుంచి వచ్చే ఏకైక మాట ఇది. ఒకింత బాసట కావాలని ఆశించే అభ్యర్థన ఇది.
 
 గెస్ట్ కాలం: 
సమాజంలో మెజారిటీ వికలాంగులు దయనీయస్థితిలో ఉన్నారు. వయో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వంద కూడా దాటని పెన్షన్ కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లం. వైఎస్ పాదయాత్రలో అనేకమంది ఈ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగురాలిగా నాకూ ఏదో తెలియని అపనమ్మకం ఉండేది. దానికి బలమైన కారణాలూ న్నాయి. చంద్రబాబు తన హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగ నియామకాలు నిలిపివేశారు. ఫలితంగా  ఒక్క వికలాంగుడికీ ఉద్యోగం రాలేదు. ఆయన ఈ ద్రోహం చేసి ఉండకపోతే వికలాంగుల్లో కనీసం 50 శాతం మంది బాగుపడి ఉండేవారు. ఉద్యోగాల్లో చేరి ఉండేవారు.
 
 వైఎస్‌కు మేలు చేయాలని ఉన్నా... చంద్రబాబు చర్యలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే అనేకమంది ఉద్యోగాల్లో చేరేందుకు వయోపరిమితి దాటిపోయారు. వయో వృద్ధుల పరిస్థితి ఇంతకంటే దారుణం. చంద్రబాబు కాలంలోని వరుస కరవు.. గ్రామీణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసింది. ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలోనే అంతరించాయి. ఖాళీ అయిన ఊళ్లు, వలసలు వెళ్లిన కొడుకులు ఆనాటి పరిస్థితి. దీంతో వయసు ఉడిగిన పెద్దలకు ఆసరా కరవైంది. పూట గడవడమే కష్టమనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హైటెక్ మోజులో యువత పట్టణాలకు ఎగబాకారు. అంతిమంగా వృద్ధులు నిరాశ్రయులయ్యారు. వితంతువుల స్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన వారిని 2004కు ముందు పట్టించుకున్నదెవరు?
 
 పెన్షన్లు ఇవ్వడం వైఎస్ గొప్పతనమే. పెన్షన్లు పెంచడం, వాటిని నెలనెలా సక్రమంగా ఇవ్వడం వల్ల మాకు కొంతైనా ఊరట కలిగింది. ఆయన తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వికలాంగులు, వయోవృద్ధులకు ఇతర దేశాల్లో ప్రభుత్వాలే చేయూతనిస్తున్నాయి. మన దేశంలో మూడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజకీయంగా ఆ మాత్రం కూడా లేదు. వితంతువులు, వికలాంగుల్లో అత్యధికులు నిరుద్యోగులు. వికలాంగుల్లో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉన్నారు. దీనికి ఫ్లోరైడ్ కూడా కారణం కావచ్చు.   
 
 విద్య, వైద్యం అందరికీ అందాలని వైఎస్ చెప్పేవారు. ఆ దిశగా ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు.  ఆరోగ్యశ్రీ వంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు. అయితే మహిళా వికలాంగులకు ఇవే చేయూతనిస్తాయని చెప్పలేం. వారి సమస్యలు వేరు. ప్రసూతి సమయంలో వారికి ఉండే ఇబ్బందులు భిన్నం. వయసు మీదపడే కొద్దీ వికలాంగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఔషధాల వినియోగం పెరుగుతుంది. వృద్ధుల పరిస్థితీ ఇదే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడిచ్చే పెన్షన్‌ను మరింత పెంచాలి.
 
 సామాజిక పెన్షనర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారి గురించి ఆలోచిస్తే చాలు. చంద్రబాబు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించడం వల్ల ఒకతరం అవిటిదైపోయింది. ఇది గుర్తించి ఊరట కలిగిద్దామనుకున్నారు వైఎస్. తన ప్రయత్నాలు కార్యరూపం దాల్చేలోపే ఆయన లేకుండాపోయారు. ఆ తర్వాత పాలకులు కనీసం ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినా బాగుండేది. మా సానుభూతి వైఎస్‌వైపే ఉందనుకున్నారో ఏమో! అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.  
 
 మూడేళ్లుగా ఇవ్వడం లేదు
 నేను పుట్టుకతోనే వికలాంగుడను. కాలు పనిచేయదు. 75శాతం వికలత్వం ఉన్నట్టు సదరం క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. ఆయన ఉన్నంత వరకు పింఛన్లు సక్రమంగా ఇచ్చిన అధికారులు మూడేళ్లుగా సరిగా ఇవ్వడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి తిరిగి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
 - శివకుమార్, కొత్తపల్లి(హెచ్), నార్నూర్
 
 వైఎస్ పుణ్యమాని..
 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 వృద్ధాప్య పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్ పుణ్యమా అని అది రూ.200కు పెరిగింది. దీంతోనే బతుకుతున్నం. మాలాంటి ఎంతో మంది వృద్ధులకు వైఎస్సార్ అన్నం పెట్టిండు. వేలి ముద్రల పేరుతో ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు పరేషాన్ చేస్తుండ్రు. వేలి ముద్రలు రాక పోవడంతో డబ్బులు సమయానికి దొరకడం లేదు. పోస్టాఫీస్ చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. పింఛన్ పెంచిన రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
 - హమీదా బేగం, వాంకిడి, ఆదిలాబాద్
 
 పింఛన్‌తోనే బతుకుతున్నా..
 నా భర్త చనిపోయి 20ఏండ్లయింది. ఆసరాగా ఎవరూ లేరు. మొదట్లో రూ.75 పింఛన్ వచ్చేది. రాజన్న వచ్చినంక రూ.200కు పెంచిండు. ఒకటో తారీఖు రాంగనే పంచాయతీకి పోయి పైసలు తెచ్చుకుంట. ఎన్నికల్లో గెలిసేటోళ్లు పింఛన్ పెంచాలి. రూ.700 ఇత్తే అండగా ఉంటది.
 - బోగ రాజమ్మ, వితంతు పింఛను
 లబ్ధిదారురాలు, బచ్చన్నపేట, వరంగల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement