* బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ
* పోస్టల్ అధికారుల వర్క్‌షాపులో కలెక్టర్
విజయవాడ : సామాజిక భద్రత పింఛన్లను బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన గురుతర బాధ్యత పోస్టల్ సిబ్బందిపై ఉందని కలెక్టర్ ఎం. రఘునందన్ రావు చెప్పారు. సబ్-కలెక్టర్ కార్యాలయంలో నేరుగా నగదు బదిలీ పథకం(డి.బి.టి.)పై పోస్టల్ అధికారులకు సోమవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. వచ్చే నెల నుంచి పోస్టల్ శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పోస్టల్ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని చెప్పారు.
గ్రామాల్లో పింఛన్ల పంపిణీలో ఇబ్బందులను ముందుగానే అధ్యయనం చేసి వాటిని సరిదిద్దుకోవాలన్నారు. పింఛన్లు ఏ రోజున , ఏ సమయానికి అందిస్తామో నోటీసు బోర్డుల్లో ఉంచాలని పోస్టల్ అధికారులకు సూచించారు. ఇందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఒకరిని నియమిస్తామని చెప్పారు. పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 426 మండలాల్లో 8,681 గ్రామపంచాయతీల పరిధిలో 7,781 పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు.
విజయవాడ పోస్టల్ సేవల సంచాలకులు కె. సోమసుందరం మాట్లాడుతూ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల పరిధిలో 6,28,281 మంది పేదలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ రోజువారీ వేతనాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో 3లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ పి. మధులత, డీఆర్‌డీఏ ఏపీడీ జ్యోతి, పోస్టల్ శాఖ సహాయ సంచాలకులు సయ్యద్ అన్సార్ పాల్గొన్నారు.
వచ్చే నెల నుంచి పోస్టల్ ద్వారా పింఛన్లు
Published Tue, Nov 25 2014 3:12 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement