ఓ ఘట్టం ముగిసింది
గ్రేటర్‌లో పింఛను దరఖాస్తుల పరిశీలన పూర్తి
1.55 లక్షల మంది అర్హులుగా గుర్తింపు
96,590 దరఖాస్తుల తిరస్కృతి
మరోసారి దరఖాస్తుకు అవకాశం
సిటీ బ్యూరో: సామాజిక పింఛన్లకు సంబంధించి కీలక ఘట్టమైన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక పింఛన్లకు 1,55,253 మందిని ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్ జిల్లాలో 87,217 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో 68,036 మంది ఉన్నారు. అక్టోబర్ నుంచి పెంచిన కొత్త పింఛన్ల అమలుకు పూనుకున్న ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించగా... ఎట్టకేలకు నగరంలో సమగ్ర కుటుంబ సర్వే లింకుతో ఈ తంతు పూర్తి చేశారు.
అనర్హులు 96 వేలకు పైనే...
నగరంలో సామాజిక పింఛన్లకు 2,51,843 దరఖాస్తులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే లింకుతో దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,55,253 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 96,590 దరఖాస్తుదారులను అనర్హులుగా తిరస్కరించారు. వీరిలో అర్హులు ఉండీ...తిరస్కారానికి గురైతే తిరిగి ఆర్డీఓకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి అధికారులు అవకాశం కల్పించారు. ఇలాంటి దరఖాస్తులపై ఆర్డీఓ పర్యవేక్షణలో విచారణ చేపట్టి .. అర్హులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా...
రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,13.456 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 68,036 మందిని అర్హులుగా గుర్తించారు. 45,420 దరఖాస్తులను తిరస్కరించారు. హైదరాబాద్ జిల్లాలో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,38,387 దరఖాస్తులలో... 87,217 అర్హమైనవిగా గుర్తించారు. మిగిలిన 51,170 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారుల్లో వికలాంగుల పింఛన్లకు 15,728 మంది,వితంతు పింఛన్లకు 39,860 మంది ఉన్నట్టు తేల్చారు. వృద్ధాప్య పింఛన్లకు 31,629 మంది ఎంపికయ్యారు.
త్వరలో పంపిణీ
నగరంలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన అధికార యంత్రాంగం సత్వరమే పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై దృష్టి సారిస్తోంది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి పింఛన్లు అందజేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.