జర.. ఆగండి!
86 వేల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం
కుటుంబ సర్వే పూర్తయితేనేపింఛన్లు
{పభుత్వానికి నివేదించిన అధికార గణం
తదుపరి చర్యల కోసం ఎదురుచూపులు
మండల కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు
గ్రేటర్ హైదరాబాద్‌లో కుటుంబ సమగ్ర సర్వే వివరాలు లేకపోవటంతో సామాజిక పింఛన్లకు వచ్చిన 86 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. ఇదే పరిస్థితి ఆహార భద్రతా కార్డులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలోనూ ఎదుర వబోతోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో 25 శాతానికి పైగా సమగ్ర కుటుంబ సర్వే జరగకపోవటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక పింఛను దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమగ్ర కుటుంబ సర్వేతో ముడిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడ ంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇది దరఖాస్తుదారులకు శాపంగా మారింది. - సాక్షి, సిటీబ్యూరో
నగరంలో సామాజిక పింఛన్లకు తాజాగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చా యి. వీటిలో ఇప్పటి వరకు 1.63 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించిన అధికారులు 1.17 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 86 వేల దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వే వివరాలు లేనందున పరిశీలించలేదు.ఈ విషయాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటినిర్ణయం వెలువడలేదు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఒక వైపు దరఖాస్తుదారుల నుంచి పింఛన్ల కోసం ఒత్తిడి... మరో వైపు ఉన్నతాధికారుల నుంచి స్పందన కనిపించకపోవటంతో అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సర్కారు నుంచి సరైన నిర్ణయం వస్తే గానీ ఈ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం లభించే పరిస్థితి కనిపించటం లేదు. మిగిలిపోయిన ప్రాంతాల్లో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే తప్ప ఈ దరఖాస్తుల పరిశీలన సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. పరిశీలనకు నోచుకోని దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 56 వేలు ఉండగా, రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని దరఖాస్తులు 30 వేలకు పైగా ఉన్నాయి.
కారణాలివే...
సమగ్ర కుటుంబ సర్వే సమయంలో నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాది నిరుపేద కుటుంబాలు గ్రామాలకు తరలిపోవటం వల్ల ఇక్కడి సర్వేలో పాల్గొనలేకపోయారు. సొంత ప్రాంతంలోని కుటుంబ సర్వేలో పాల్గొన్న వారంతా మళ్లీ ఇక్కడా దరఖాస్తుచేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో.. అక్కడి నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని... విచారణ కు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించటంతో అలా చేశారని తెలుస్తోంది.
మరోపక్క గ్రేటర్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కార్పొరేషన్ సర్కిళ్ల వారీగా చేపట్టారు. ఒక్కో సర్కిల్‌లో రెండు, మూడు మండలాలతో పాటు డివిజన్లు ఉన్నాయి. ఇంకోవైపు సామాజిక పింఛన్ల కోసం మండలం యూనిట్‌గా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వేను పింఛన్ దరఖాస్తులతో ముడిపెట్టడానికి సాఫ్ట్‌వేర్ సహకరించలేదు. ఇది కూడా దరఖాస్తుల పరిశీలనకు అంతరాయంగా మా రింది. సాంకేతిక అధికారులు కుటుంబ సర్వేను మండల యూనిట్‌గా మార్చుకోవటం ద్వారా కొంత ప్రగతిని సాధించగలిగారు. సర్వే కాని ప్రాంతాలకు సంబంధించిన సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కష్టతరంగా మారటంతో నిలిపివేశారు.
తప్పని ప్రదక్షిణలు
దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో దరఖాస్తుదారుల్లో టెన్షన్ పెరుగుతోంది. నగరంలో ఇప్పటి వరకు 5200 మందికే పింఛన్లు పంపిణి చేసి...మిగిలిన వారిని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి గతంలో మాదిరిగానే పింఛన్లు తీసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలియక తల్లడిల్లుతున్నారు. వీరికి సమాధానం చెప్పేవారే కనిపించడం లేదు.
తిరగలేకపోతున్నా...
నాది బండ్లగూడ మండలం ఫాతీమానగర్. 80 ఏళ్ల వికలాంగురాలిని. అధికారుల సూచన మేరకు గత నెల 17వ తేదీనా కార్యాలయానికి వచ్చి అతికష్టం మీద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకూ విచారణ కోసం మా ఇంటికి ఎవరూ రాలేదు.
ఇప్పటికే కొంత మంది పింఛన్లు తీసుకున్నారు. నా పింఛన్ కోసంకాళ్లరిగేలా తిరుగుతున్నా.
- రహమత్‌బీ, ఫాతీమానగర్