సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జన్మభూమి- మాఊరు’కి అడుగడుగునా అటంకాలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని రైతులు, డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. అర్హత ఉన్నా తమను పింఛన్ల జాబితాలో నుంచి ఎలా తొలగించారని అధికారులు, టీడీపీ నాయకులపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిచోట్ల
టీడీపీ నాయకులకు, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం తాజాగా, చీరాలలో ఇద్దరు నేతల మధ్య ప్రొటోకాల్ రగడ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు స్పందించి ఇరుపక్షాలను కట్టడి చేయాల్సి వచ్చింది.
జిల్లాలో ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం నిర్వహణ ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈనెల రెండోతేదీ నుంచి జిల్లామంత్రి శిద్దా రాఘవరావు జన్మభూమిని ప్రారంభించారు. ప్రధానంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్‌లకు సంబంధించి లబ్ధిదారుల ఆందోళనకు జన్మభూమి కార్యక్రమం వేదికగా మారుతోంది. మొదటిరోజు కొండపి, ఒంగోలు నగరంలో నిర్వహించిన సభల్లోనే అసంతృప్తులు గళం విప్పాయి.
వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్ల జాబితా తప్పుల తడకగా ఉందని.. భూమిలేని నిరుపేదలను సైతం ధనవంతులుగా చూపారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరికి ఆధార్ కార్డు సీడింగ్ లేదంటూ జాబితాలో నుంచి పేర్లను తొలగించడంపై స్థానిక అధికారులను నిలదీస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి.
రేషన్‌కార్డుల్లేవని, వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపడం లేదంటూ పేర్లను తొలగించిన వారంతా వేదికల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అధికారులను నిలదీస్తున్నారు. ఒంగోలులోని త్రోవగుంటలో శనివారం జరిగిన జన్మభూమిలో ఒకరిద్దరు తమకు పింఛన్‌ల పంపిణీలో అన్యాయం జరిగిందని చెప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. వారికి అవకాశమివ్వకుండానే నగరపాలక సంస్థ సభను మొక్కుబడిగా జరిపి వెళ్లారు. అదేవిధంగా అద్దంకిలో లాంఛన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మంత్రి ప్రసంగం ముగియగానే... ఒకరిద్దరికి మాత్రమే పింఛన్లు అందించి మమ అనిపించారు.
జిల్లాలో పరిస్థితిదీ...
అసలే బ్యాంకుల్లో బకాయిలు తీరక.. కొత్తరుణాలు పుట్టక.. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులు ప్రభుత్వ కార్యక్రమాలంటేనే భగ్గుమంటున్నారు. మండలాల్లో జన్మభూమి - మాఊరు కార్యక్రమానికి హాజరవ్వాలని స్థానిక నేతలు కోరడానికే భయపడే పరిస్థితి నెలకొంది. రైతులు, డ్వాక్రామహిళలు, పింఛన్‌దారుల నుంచి నిరసనలను ముందస్తుగా గుర్తించిన అధికారపార్టీ నేతలు ప్రతీ కార్యక్రమ వేదికల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఒకట్రెండు చోట్ల నిరసనకారులు వేదిక వద్దకు రాగానే పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేస్తున్నారని.. ప్రజాసమస్యల్ని వినేనాధుడు లేనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలెందుకంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమై మూడు రోజులు గడిచినా.. ఇంతవరకు ఏఒక్క మండలంలోనూ అధికారిక పింఛన్‌ల జాబితాను బహిరంగంగా ప్రకటించకపోవడం గమనార్హం. ముందుగా ఒకరిద్దరు అధికారపార్టీ అనుకూలురైన లబ్ధిదారులను పిలిపించి సిద్ధంచేసి.. వేదికలపై వారికి మాత్రమే పింఛన్ సొమ్ము అందించి మమ అనిపిస్తున్నారు.
మూడోరోజు శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలో నిర్వహించగా, అర్హులైనవారందరినీ పింఛన్ జాబితాలో నుంచి తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరనప్పుడు జన్మభూమి కార్యక్రమం అనవసరమంటూ బహిష్కరించారు. జన్మభూమిని అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యక్రమంగా భావిస్తున్నారని ఆయన స్థానికంగా విలేకరుల సమావేశంలో ఆదివారం దుయ్యబట్టారు.
అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, మార్కాపురం రూరల్‌లోనూ వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కందుకూరులోని కేతవరంతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం, పామూరు మండలాల్లో రైతులు, డ్వాక్రాసంఘాల సభ్యులతోపాటు పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలోని ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్వయంగా స్పందించి పింఛన్‌ల జాబితా అవకతవకలపై నిలదీశారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
అధికారపార్టీ ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం అధికారులకు తలనొప్పిగా మారింది. కార్యక్రమాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలోనే ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు సీనియర్ ఐఏఎస్ ఉదయలక్ష్మి, కందుకూరుకు మరో సీనియర్ ఐఏఎస్ కరికాలవళవన్‌తోపాటు మార్కాపురానికి సీనియర్ ఐఎఫ్‌ఎస్ కె.గోపీనాథ్‌ను పంపగా... జిల్లాస్థాయిలో మాత్రం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడం మరిచారు.
ప్రస్తుతం మండలాల్లోని ఎంపీడీవోలే ఈకార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభల్లో అధికారపార్టీ నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల ప్రొటోకాల్ సమస్యతో ఎంపీడీవోలు సతమతమవుతున్నారు. తాజాగా, ప్రొటోకాల్ రగడ నేపథ్యంలో చీరాలలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోతుల సునీత వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలాఉంటే, గ్రామసభల్లో ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించే మార్గాల్లేక.. వారికి సరైన సమాధానాలు చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
పింఛన్‌దారుల గగ్గోలు
Published Mon, Oct 6 2014 2:25 AM | Last Updated on Mon, Oct 22 2018 7:36 PM
Advertisement