విధేయులకే పింఛన్ | Vidheyulake pension | Sakshi
Sakshi News home page

విధేయులకే పింఛన్

Published Wed, Apr 1 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

Vidheyulake pension

ఉదయగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తాం.. ఇందులో ఎలాంటి భేదాలు లేవు. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని కొత్త లబ్ధిదారులను ఎంపిచేస్తాం. దీనిని అధికారులు తప్పక పాటించాలి. కొత్తగా సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికపై ఇటీవల చంద్రబాబు అధికారులతో అన్న మాటలివి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎప్పట్నుంచో ఇస్తున్న సామాజిక పింఛన్లకు రకరకాల కొర్రీలతో కోతలు పడగా..కొత్తగా మంజూరయ్యే వాటిలోనైనా న్యాయం జరుగుతుందేమోనని వేయికళ్లతో ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. అధికారపార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై అర్హత ప్రాతిపాదిక పక్కనపెట్టి తమ విధేయులకే పింఛను మంజూరుకు సిఫారసు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన జాబితాలను పరిశీలిస్తే..ఈ విషయం తేటతెల్లమవుతుంది.
 
37 వేల దరఖాస్తులు : జిల్లాలో వివిధ రకాల సామాజిక పింఛన్ల కోసం 37 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 14 వేలమందిని అర్హులుగా గుర్తించి వారి పేర్లను ఆన్‌లై న్‌లో ఉంచారు. వీటిని కూడా నిశితంగా మరోమారు పరిశీలించి గ్రామకమిటీల ఆమోదం తీసుకొని మరలా అప్‌లోడ్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమం కూడా మంగళవారంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కానీ ఈ జాబితాను పరిశీలిస్తే అర్హులకు మొండిచేయి చూపించినట్లుగా అర్థమవుతోంది.

నిబంధనలను గాలికొదిలేసి అధికారపార్టీ నేతలు చెప్పిన జాబితాకే అధికారులు జేకొట్టారు. ఇందుకు ఉదాహరణ.. వరికుంటపాడు మండలానికి 270 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో దాదాపు 150కి పైగా అనర్హుల పేర్లే ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినట్లు ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు చెబుతున్నారు. వృద్ధుల పింఛన్లకు వయస్సు 65 ఉండాలి. కానీ ఆ వయస్సు వారి పేర్లు జాబితాలో లేకపోగా, 40 ఏళ్లున్న వారిపేర్లు జాబితాలో చోటుచేసుకున్నాయి.
 
బోగస్ సర్టిఫికెట్లతో..: మరికొంతమంది బోగస్ అంధత్వ సర్టిఫికెట్లతో అన్ని అవయవాలు చక్కగా ఉన్న వారి పేర్లు కూడా కొత్త జాబితాలో ఉన్నాయి. గణేశ్వరపురం పంచాయతీకి కొత్తగా 39 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో అర్హత కలిగిన వారి పేర్లు పట్టుమని ఐదు కూడా లేవు. మిగతా పేర్లన్నీ కూడా యాభై ఏళ్లలోపు వయస్సు ఉన్నవారే. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు పరిశీలించడంతో ఈ విషయం తేటతెల్లమైంది.
 
రాజకీయ నాయకులు వత్తాసుతో..: కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రాజకీయ నాయకులకు వత్తాసు పలికి జన్మభూమి కమిటీ ఆమో దం పొందిన జాబితాను తొలగించి అనర్హులైన వారి పేర్లను కంప్యూటరీకరించారు.  విషయమై ఆ గ్రామస్తులు మంగళవారం ఎంపీడీఓను నిలదీసి ఆందోళనకు దిగారు. అన్ని అర్హతలు ఉన్న 25మంది పేర్లు జాబితాలో లేకుండా చేశారు. వీరిపై వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి పింఛన్లు లేకుండా తొలగించారని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ అహ్మద్ ఎంపీడీఓను నిలదీశారు.
 
నా పేరు జాబితాలో లేదు:
నాకు 65 శాతం వికలాంగత్వం ఉంది. ఏడాది నుంచి పింఛ ను కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. అయినా ఫలితం లేదు. ఇటీవల జన్మభూమి కమిటీ సభ్యులు నా పేరు ఎంపికచేశారు. తీరా జాబితాలో చూస్తే నాపేరు లేదు. మా ఊర్లో అర్హతలేని వారి పేర్లు ఉన్నాయి.  -ఎం.అచ్చమ్మ, వికలాంగురాలు, తిమ్మారెడ్డిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement