మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్లకు ముహూర్తం రానే వచ్చింది. నేటి నుంచి జిల్లావ్యాప్తంగా పెంచిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారులు రూపొందించిన జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో.. ఊడాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా పలువురికి పింఛన్లు అందించినా.. అర్హుల నిర్ధారణలో నెలకొన్న అంతరాయంతో తాత్కాలికంగా నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి నిరసనలు మిన్నంటడంతో ఈనెల 10 నుంచి 15వ తేదీలోపు అర్హులందరికీ గత నెల బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2.5 లక్షల మంది అర్హులు..
ఈ క్రమంలో జిల్లాలో 2.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన జిల్లా యంత్రాంగం, వారికి సంబంధించి న రూ.42 కోట్లను అన్ని మండలాల ఖాతాలో జమచేసింది. జిల్లాలో 3.38 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 2.5 లక్షల మందిని ఇప్పటివరకు అర్హులుగా గుర్తించారు. గతంలో జిల్లాలో 2.60 లక్షల మంది పింఛన్‌దారులుండగా.. వడపోతతో 55 వేల మంది పింఛన్‌కు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా.. పేర్లు గల్లంతైన లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలూ లేకపోలేదు.
పూర్తికాని అర్హుల జాబితా..
సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 3.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థా యిలో పరిశీలించిన అధికారులు గత అక్టోబర్ 7వ తేదీ వరకు 2.1 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిని ప్రభుత్వం నిర్దేశించిన సాఫ్ట్‌వేర్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చే క్రమంలో వేల సంఖ్యలో అనర్హులయ్యారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా పొరపాటు జరిగిందని భావించిన అధికారులు, పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించే క్రమంలో నిమగ్నమయ్యారు. తాజాగ సాఫ్ట్‌వేర్ సమస్యను అధిగమించినట్లు అధికారులు చెబుతున్నా.. అర్హుల వివరాలు సరిపోల్చే అంశం ఇంకా పూర్తి కాలేదు.
సాఫ్ట్‌వేర్‌లోని సమస్య తీరిందని గత నెల 29వ తేదీన 2.11 లక్షల మంది అర్హులని జిల్లా అధికారులు ప్రకటించినా, ఆ తరువాత జరిపిన పునఃపరిశీలనలో అర్హుల సంఖ్య 9వ తేదీ (మంగళవారం)కి 2.5 లక్షలుగా తేల్చారు. ఇప్పటికీ ఇంకా అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేనివారు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని మండల కార్యాలయాలకు రావాలని అధికారులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించడం ప్రహసనంగా కనిపిస్తోంది.
మండల యంత్రాంగమంతా సన్నద్ధం..
బుధవారం నుంచి ఐదు రోజులపాటు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్, తదితర అధికారులు తేదీల వారీగా గ్రామాలను ఎంపిక చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత నెల బకాయితోపాటు, ప్రస్తుతం నెలకు సంబంధించిన పింఛన్ ఇవ్వాలి. అంటే.. ఒక్కో లబ్ధిదారుకు రెండు నెలల పింఛన్ రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేలు పంపిణీ చేయాల్సి ఉంది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం, మరోవైపు పారదర్శకత పేరిట పంపిణీ నెమ్మదించనుందని, దీంతో నిర్దేశించిన తేదీల్లో పూర్తిస్థాయి పంపిణీ కష్టమని అధికారులు చెబుతున్నారు.
మారిన నిబంధనలతో ఇబ్బందులు
సామాజిక పింఛన్లు పెంచి, కేవలం అర్హులకు మా త్రమే అందిస్తామంటూ ప్రభుత్వం సూచించిన పలు మార్గదర్శకాలు లబ్ధిదారుల పాలిట శాపంగా మా రాయి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు పెంచుతూ జీవో 23 జారీ చేసింది. కుటుంబం మొత్తం వార్షికాదాయా న్ని పరిగణలోకి తీసుకోవాలని, దాన్ని ధ్రువీకరించేందుకు తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ ప త్రం తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. దీంతో అ న్ని అర్హతలు ఉన్న వారు సైతం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తి రుగుతున్నారు. గతంలో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్నా పరవాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రమే తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
దీంతో ఆదాయ ధ్రు వీకరణ పత్రం పొందని వారు అర్హత సాధించలేక, ఈ నెలలో కూడా పింఛన్లను కోల్పోనున్నారు. ధ్రువీ కరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగితే అధికారులు తాము బిజీగా ఉన్నామంటూ సమాధానాలిస్తున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరివి కుటుంబ సర్వేలో నమోదు చేసినా, డాటా ఎంట్రీ చేయడంలో జరిగిన పొరపాట్లతో సర్వేలో వివరాలు లేకుండా పోయాయి. జిల్లా మొత్తంలో వేలల్లోనే కుటుంబ సర్వేలో తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వీరికి కూడా పింఛన్లు మంజూరు లేకుండాపోయింది. దీంతో ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని, వచ్చే నెల వరకైనా తమకు పింఛన్ ఇస్తరో లేదోనని పలువురు వితంతువులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు.
అర్హులందరికీ పింఛన్..
- వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ
జిల్లాలో 2.5 లక్షల మందిని పింఛన్‌కు అర్హులుగా గుర్తించాం. రెండు నెలలకు సంబంధించి రూ.42 కోట్లు అన్ని మండలాలకు అందించాం. అర్హుల జాబితా తయారీ ఇంకా కొనసాగుతోంది. అనర్హతతో పింఛన్ కోల్పోయిన వారు, అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వారి మండల కార్యాలయాలకు వెళితే వారు పరిశీలించి, అర్హత కల్పిస్తారు. ఆధార్‌లో వయస్సు తప్పుగా నమోదైతే ఏదైనా స్టడీ సర్టిఫికేట్, ఓటరు ఐడీకార్డు తీసుకొస్తే అందులో ఉన్న వయస్సును పరిగణలోకి తీసుకుని పింఛన్ అందిస్తాం.
ఉందో.. ఊడిందో..!
Published Wed, Dec 10 2014 2:36 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement