సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో ఆసరా ఆలస్యమవుతోంది. పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతినెలా మొదట్లోనే అందాల్సిన సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మరింత ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనితో పింఛన్‌పై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు.
మందులు, ఇతర నెలవారీ అవసరాలు తీరక అవస్థల పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుతుంది. దీనితో పలు ప్రాంతాల్లో వృద్ధులు పింఛన్ సొమ్ము జమ అయిందో, లేదో తెలుసుకునేందుకు పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా మంజూరు చేసినా..
రాష్ట్రంలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల కేటగిరీల్లో మొత్తంగా 35,95,675 మందికి పింఛన్లు అందేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అప్పటికే వివిధ కేటగిరీల పింఛన్ కోసం వచ్చిన మరో 3 లక్షల దరఖాస్తులు కలిపి.. మొత్తంగా 14 లక్షల దరఖాస్తులు అయ్యాయి. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా 9.38 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. దీనితో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అక్టోబర్ చివరినాటికి 44,14,915 మందికి చేరింది. మరో 4.6 లక్షల మంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు.
అందక.. మంజూరుగాక..
తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200గా ఉన్న పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016కు.. వృద్ధులు, వితంతువులు ఇతర కేటగిరీల్లో రూ.2,016కు పెంచింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపశమనం కలిగింది. నెలవారీ మందులు, నిత్యావసరాలకు కష్టం తీరింది. కానీ ఇటీవల ఆసరా పింఛన్ల సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది మొదలైంది.
వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించినా.. ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొన్ని లక్షల మందికి ఇంకా మంజూరు కాలేదు. మంజూరు అయినవారిలోనూ కొందరికి పింఛన్ సొమ్ము అందడం లేదని వాపోతున్నారు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, బ్యాంకు ఖాతాల్లో మార్పులు, ఆధార్‌తో అనుసంధానం వంటి సమస్యలతోనూ పింఛన్లు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం, ఇతర అంశాలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్యలను గుర్తించింది.
పలు జిల్లాల్లో సమస్యలివీ..
► సూర్యాపేట జిల్లాలో గత ఐదు నెలలుగా 25వ తేదీ తర్వా పింఛన్ల సొమ్ము అందుతోంది. అక్టోబర్ పింఛన్ సొమ్ము ఇప్పటికీ అందలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. 57 ఏళ్లు దాటినవారి వృద్ధాప్య పింఛన్ల కోసం 30వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మంజూరైన వారిలోనూ కొందరికి సొమ్ము రావడం లేదు.
► కరీంనగర్ జిల్లాలో కొత్తగా పింఛన్ మంజూరైన వారిలో 4 వేల మంది వరకు ఇంకా సొమ్ము అందడం లేదు. ఇదేమిటంటే వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, మీసేవ వాళ్లు తప్పుగా నమోదు చేశారని చెప్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,61,988 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో వేల మంది ఇంకా మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. మంజూరైన పింఛన్లలోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, ఇతర సమస్యలతో కొందరిని పింఛన్ సొమ్ము అందడం లేదు. ఇక భార్యాభర్త ఇద్దరికీ పెన్షన్ ఉండటం, సొంత ఇళ్లు, వాహనాలు ఉండటం వంటి కారణాలతో కొందరి పింఛన్లను తొలగించారు.
► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ సొమ్ము ఆలస్యంగా అందుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అర్హత ఉన్నా తమకు మంజూరుకావడం లేదని వాపోతున్నవారు వేలలో ఉన్నారు.
గోస పడుతున్నం
ఈమె పేరు భూతం రాములమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామం. వయసు 85ఏళ్లు. భర్త, పిల్లలు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛనే దిక్కు. ఈ సొమ్ము నెల నెలా సమయానికి అందడం లేదని, ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని ఆమె వాపోతోంది. ప్రతీ నెల మొదటివారంలో పింఛన్ పంపిణీ చేయాలని కోరుతోంది.
మంజూరై రెండు నెలలైనా..
ఈ వ్యక్తి పేరు సంక రాజేందర్. జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామం. కిడ్నీ వ్యాధి బాధితుడు. రెండు నెలల కింద డయాలసిస్ కేటగిరీలో పింఛన్ మంజూరైంది. గుర్తింపు కార్డు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పింఛన్ డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment