లబ్..డబ్ | Led the lives of the poor social pensions | Sakshi
Sakshi News home page

లబ్..డబ్

Published Tue, Dec 23 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

లబ్..డబ్

లబ్..డబ్

32వ డివిజన్ పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో వృద్ధురాలి మృతి
 
వారం వ్యవధిలో ఇద్దరి కన్నుమూత
పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద  వేకువజాము నుంచే క్యూ
అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు
పట్టించుకోని పాలకులు, అధికారులు

 
విజయవాడ సెంట్రల్/చిట్టినగర్ : సామాజిక పింఛన్లు పేదల ప్రాణాలు తీస్తున్నాయి. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము 3 గంటల నుంచి లబ్ధిదారులు పోస్టాఫీసుల వద్ద బారులుతీరుతున్నారు. టోకెన్ల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల క్రితం 49వ డివిజన్‌లో జైనాబీ(75) అనే వృద్ధురాలు పింఛను పోరులో అలసి తనువుచాలించింది. సోమవారం కూడా 32వ డివిజన్‌లో పడాల కాంతమ్మ (68) అనే వృద్ధురాలు తొక్కిసలాట కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు. చిట్టినగర్ ఈద్గారోడ్డులోని పింఛన్ల కేంద్రం వద్ద పింఛన్ల కూపన్లు పంపిణీ చేస్తారని స్థానిక కార్పొరేటర్ చెప్పడంతో సోమవారం ఉదయం 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో 5.30 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో పడాల కాంతమ్మ కిందపడిపోగా, ఆమెపై మరో ఇద్దరు పడ్డారు. గాయపడిన కాంతమ్మను ఆమె కుమార్తె ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు పార్టీల నాయకులు సొరంగం రోడ్డులో మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యం పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరుగుతున్న తోపులాటల్లో అనేక మంది వృద్ధులు, వికలాంగులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నప్పటికీ అధికారులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై జనం మండిపడుతున్నారు.  
 
ఎన్ని తిప్పలో..


నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో 11,777 మంది వృద్ధులు 4,545 మంది వికలాంగులు, 16,547 మంది వితంతువులు, 21 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందుతున్నారు. వీరితోపాటు 825 మంది అభయహస్తం పింఛనుదారులు ఉన్నారు. మొత్తం 33,715 మందికి గానూ, 30 సబ్ పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు డివిజన్లకు ఒకే పోస్టాఫీసులో పింఛన్లు అందించడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. పోస్టాఫీసుల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పంపిణీ లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పింఛన్లకు ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే లైనులో నిలుచుంటున్నారు.  
 
జాబితాల్లో తప్పుల వల్లే ఇక్కట్లు


అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్(యూసీడీ) విభాగం నుంచి పోస్టాఫీసులకు చేరిన జాబితాల్లో తప్పులు దొర్లడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 55వ డివిజన్‌లో వికలాంగుడైన యశ్వంత్ వేలిముద్రలు సరిగా పడలేదని పింఛన్ నిలిపివేశారు. మరొకరికి ఒక చేయి లేదు. పది వేలిముద్రలు పడితేనే పింఛన్ అని అధికారులు చెప్పడంతో వికలాంగులు నానా పాట్లూ పడుతున్నారు.
 రూ.లక్ష అందిస్తాం : బుద్దా వెంకన్న : పడాల కాంతమ్మ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు. గుంటూరు పర్యటన నిమిత్తం ఈ నెల 24ననగరానికి రానున్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని చెప్పారు.
 
రెచ్చగొట్టే వాళ్ల మాటలు నమ్మొద్దు

లబ్ధిదారులను కొందరు రెచ్చగొడుతున్నారు. వాళ్ల మాటలు వినడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. పోస్టాఫీసుల్లో రోజుకు వంద మందికి పింఛన్లు ఇస్తారు. వెయ్యి మందికి ఇవ్వలేరు కాదా.. పరిస్థితిని లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి. పింఛన్ల పంపిణీలో అన్యాయం జరిగితే నా వద్దకు, లేదా కమిషనర్ వద్దకు రావొచ్చు. అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు.
 - కోనేరు శ్రీధర్, నగర మేయర్
 
డోర్ టు డోర్ పంపిణీ చేయాలి

పింఛన్లను డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. అలా చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరెంట్ బిల్లు, ఆస్తి పన్ను వంటిని ఇంటికి వెళ్లి ఇస్తున్నప్పుడు పింఛను ఇస్తే తప్పేంటి. అది సాధ్యం కాదనుకుంటే డివిజన్ల వారీగా అయినా పంపిణీ చేయాలి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు మొద్ద నిద్ర పోతున్నారు. కాంతమ్మ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
 సీహెచ్ బాబూరావు,
 సీపీఎం నగర కార్యదర్శి
 
 ప్రభుత్వమే బాధ్యత వహించాలి

 నగరంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. లబ్ధిదారుల ప్రాణాలు పోతున్నా పాలకులు, అధికారులు స్పందించకపోవడం దారుణం. జాబితాలు పోస్టాఫీసులకు ఇచ్చి కార్పొరేషన్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారు. కాంతమ్మ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆమె కుటుంబాకి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.
 - పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement