మోదీ హామీల అమలు ఎంతవరకు?
గత పంద్రాగస్టున ఇచ్చిన 8 హామీలపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన
* జన్‌ధన్ యోజన ప్రయోజనంపై అస్పష్టత
* మరుగుదొడ్ల నిర్మాణం నామమాత్రమే
* ఉత్తమంగా సామాజిక భద్రత కార్యక్రమాలు
న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయని ‘ఫ్యాక్ట్ చెకర్’ సంస్థ పేర్కొంది. అందులోనూ కొన్ని అంశాల్లోనే మెరుగైన ప్రయోజనం కనిపించిందని.. మరిన్ని అంశాల్లో అస్పష్టత నెలకొందని తెలిపింది.
ప్రధానమైన 8 అంశాల అమలుతీరుపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన జరిపింది. వివరాలు..
1. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
నిరుపేదలందర్నీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. తద్వారా దేశంలో బ్యాంకు ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు 3 నాటికి 22.8 కోట్లకు చేరింది. గత ఏడాది (17.4 కోట్ల ఖాతాలు)తో పోల్చితే.. ఖాతాల సంఖ్య 31 శాతం పెరగడం గమనార్హం. ఖాతాల్లోని సొమ్ము రూ.22,033 కోట్ల నుంచి రూ.40,795 కోట్లకు.. అంటే 85 శాతం పెరిగింది.
2. స్వచ్ఛ విద్యాలయ అభియాన్.. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ‘స్వచ్ఛ విద్యాలయ అభియాన్’ను మోదీ ప్రకటించారు. కానీ ఈ లక్ష్యాన్ని ఏ మాత్రం చేరుకోలేకపోయారు.ఢిల్లీ సహా మారుమూల ప్రాంతాల వరకు కూడా స్కూళ్లలో సరైన సంఖ్యలో టాయిలెట్లు లేవని తేలింది. .
3. గివ్ ఇట్ అప్.. ధనికులు పొందుతున్న వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. 1.04 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోగా, 17.6 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు.
4. డీబీటీఎల్‌తో సబ్సిడీ భారం తగ్గింపు పక్కదారి పడుతున్న ఎల్పీజీ సబ్సిడీ అడ్డుకట్టకు ‘ఎల్పీజీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్)’ తెచ్చారు. గతేడాదిలో రూ.20 వేల కోట్లు సబ్సిడీ భారం తగ్గిందని కేంద్రం చెప్పింది. అయితే తగ్గిన భారం సుమారు 2 వేల కోట్లేనని కాగ్ పేర్కొంది.
5. అన్ని గ్రామాలకు విద్యుత్.. దేశంలో 98.1 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ జరిగిందని కేంద్రం పేర్కొనడం వాస్తవ దూరమని ‘ఫ్యాక్ట్ చెకర్’ పేర్కొంది. దేశంలోని 5,97,464 గ్రామాలకుగాను ఈ జూన్ 30 నాటికి 5,87,569 గ్రామాల్లో విద్యుత్ సరఫరా అందుతోందని కేంద్రం చెబుతోంది. అంటే కేవలం 9,895 గ్రామాలకే విద్యుత్ సరఫరా లేదు!
6. సామాజిక భద్రత.. సామాజిక భద్రత కార్యక్రమం కింద కేంద్రం ప్రధానంగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ జూన్ 14 నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 27 లక్షల మంది, ప్రధాని సురక్షా బీమా యోజన కింద 9.45 కోట్ల మంది, ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2.97 కోట్ల మంది నమోదు చేసుకున్నారు.
7. గ్రామీణాభివృద్ధి.. 2015-16లో వ్యవసాయానికి కేటాయించిన రూ. 24,909 కోట్లతో పోల్చితే ఈసారి 44 శాతం అదనంగా రూ.35,984 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ దేశంలోని మొత్తం సాగుభూమిలో 32 % కేవలం 5 శాతం మంది పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, పట్టణీకరణ కారణంగా సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోందని పేర్కొంది.
8. వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికోద్యోగులకు ఒక ర్యాంక్ ఒకే పెన్షన్ హామీ ఇచ్చిన మోదీ దానిని అమల్లోకీ తెచ్చారు. ఏటా రూ.7,488 కోట్లు భారం పడుతుందని, బకాయిల చెల్లింపునకు రూ.10,925 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ 2016 మార్చి నాటికి రూ. 2,861 కోట్లే ఖర్చు చేశారు.