‘ఆసరా’ అవకతవకలపై సర్వే
♦ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించిన అధికారులు
♦ పోస్టాఫీస్‌లలో పింఛన్ పొందకపోవడంపై ఆరా
♦ వేలిముద్రలు, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై వాకబు
♦ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ ఏపీడీ, ఏపీఎంలు రంగంలోకి
యాచారం : సామాజిక పింఛన్‌ల అవకతవకలపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.. తప్పుదోవ ఎక్కడ పడుతున్నాయి.. ఇందులో అధికారుల చేతివాటమేమైనా ఉందా.. అంటూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారులు రహస్య సర్వే చేపట్టారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి వివిధ అంశాలు తెలుసుకున్నారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తుండడంతో కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు లబ్ధిదారులపై రహస్య సర్వే నిర్వహించారు. పోస్టాఫీస్‌లకు వెళ్లి ఎందుకు ఫించన్లు పొందలేకపోతున్నారు.. వేలిముద్రలు సక్రమంగా ఉన్నాయా.. లేవా అని ప్రశ్నించారు.
యాచారం మండల పరిధిలోని యాచా రం, మంతన్‌గౌరెల్లి, మల్కిజ్‌గూడ, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, చౌదర్‌పల్లి, గునుగల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో సర్వే చేపట్టారు. దాదాపు 300 మందికి పైగా లబ్ధిదారులు పోస్టాఫీసుల వద్దకు వెళ్లకపోవడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులే వారికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారని విషయం తెలి సింది. డీఆర్‌డీఏ ఏపీడీ ఉమాదేవి, నలుగురు ఏపీఎంలు కలిసి పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించారు. యాచారంలోనే 39 మంది లబ్ధిదారులు పోస్టాఫీసులోని యం త్రంలో వారి వేలిముద్రలు సరిపోకపోవడంతో పంచాయతీ కార్యదర్శినే తన వేలిముద్రతో డబ్బులు తీసుకుని లబ్ధిదారులకు అందజేస్తున్నాడు.
ఏపీడీ ఉమాదేవి ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి ఎందు కు పోస్టాఫీసుకు వెళ్లలేకపోతున్నావ్.. వేలిముద్రల్లో తేడా వచ్చాయా.. పంచాయతీ కార్యదర్శులు డ్రా చేసిన డబ్బులను మీకు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో కూడా ఏపీఎంలు అదే మాదిరి సర్వే నిర్వహిం చారు. కొన్ని గ్రామాల్లో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు ఆ గ్రామాల్లో లేకున్నా పంచాయతీ కార్యదర్శులు డబ్బులు డ్రా చేసి ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రతినెలా డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం కూడా అధికారుల సర్వేలో తేలింది.
కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గ్రామాల్లో లేకున్నా వారి పేర్ల మీద పంచాయతీ కార్యదర్శులు డబ్బులు తీసుకుని వారి కుటుంబీకులకు అందజేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. విచారణలో వచ్చిన వివరాల నివేదికను కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఏపీడీ ఉమాదేవీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు సతీష్, నర్సింహ, సీసీ గణేష్ పాల్గొన్నారు.