‘ఆధార్’ లేదని...
రంగారెడ్డిలో 60 వేల మందికి పింఛను కట్
గ్రేటర్ పరిధిలో 8 నెలలుగా నిలిచిన పంపిణీ
రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛ న్లు అందక పట్టణ ప్రాంత లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆసరా’ పథ కానికి తలెత్తిన సాంకేతిక సమస్యతో పింఛన్ల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అంతకుముందు ఇవ్వాల్సిన ఇందిరమ్మ పింఛన్లు 8 నెలలుగా యంత్రాంగం నిలిపివేసింది. మార్చి నెలాఖరు నాటికి ఆధార్ వివరాలు ఇవ్వలేదంటూ గ్రేటర్ పరిధిలోని 59, 820 మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి పింఛన్లు పంపిణీ చేయడం లేదు.
రూ.11.63 కోట్లు వెన క్కి...
రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ల పథకం రద్దు చేస్తూ... కొత్తగా ఆసరా పథకాన్ని అమల్లోకి తేవడంతో ఇందిరమ్మ పింఛన్లకు సంబంధించి రూ.11.63 కోట్లను జిల్లా యంత్రాంగం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో లబ్ధిదారులంతా పింఛన్లకు దూరమయ్యారు. ఇటీవల ఈ అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని నిలదీయ గా.. ఆధార్ అనుసంధానం చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వానికి నివేదించామని చెప్పి...చేతులు దులుపుకున్నారు.
నమోదైంది 30వేల మందే
ఆధార్ వివరాలు కోరిన నేపథ్యంలో 59,820 లబ్ధిదారుల్లో 30వేల మంది మాత్రమే సమాచారం ఇచ్చినట్లు డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్ పీడీ చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం నివేదికను పరిశీలించి, నిధుల విడుదలకు అంగీకరిస్తే 30వేల మందికి పింఛను బకాయిలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన29,820 మంది పింఛనుపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది.
జిల్లాలో జీహెచ్‌ఎంసీ సర్కిళ్లవారీగా లబ్ధిదారుల వివరాలు
సర్కిల్ లబ్ధిదారులు
శేరిలింగంపల్లి 5676
మల్కాజిగిరి 3892
రాజేంద్రనగర్ 5075
కూకట్‌పల్లి 11750
ఎల్‌బీనగర్ 9791
ఉప్పల్ 4704
కాప్రా 5141
కుత్బుల్లాపూర్ 10674
అల్వాల్ 3117