‘అమ్మ హస్తానికి’ ఫ్రాక్చర్
- మూడు నెలలుగా అరకొరగా సరకుల పంపిణీ
- రెండు నెలలుగా అందని చింతపండు, పసుపు, కారం
- నెల రోజులుగా వంట నూనె నిలిపివేత
- ఈ నెల కూడా పంపిణీ అనుమానమే
నర్సీపట్నం, న్యూస్‌లైన్: గత ప్రభుత్వం ప్రచారాస్త్రంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. గత ఏడాది ఉగాది రోజున ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఏడాదైనా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది.
ప్రచారం కోసమే పథకం
అప్పటి ముఖ్యమంత్రి కిరణ్, ఇతర మంత్రుల ఫొటోలను విరివిగా వాడుకున్న ఈ పథకాన్ని కేవలం ప్రచార అస్త్రంగానే వాడుకున్నారు తప్ప సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మూడు నెలలుగా వినియోగదారులకు ప్రభుత్వం అరకొరగా సరుకులు పంపిణీ చేస్తూ నెట్టుకొస్తోంది.
మూడు నెలల క్రితం నుంచిసరుకుల కొరత ఏర్పడింది. ప్రారంభంలో ఉప్పు, గోధుమ పిండి సరఫరాను నిలిపివేసి, తరువాత పునరుద్ధరించారు. రెండు నెలలుగా చింతపండు, పసుపు, కారం పం పిణీ నిలిపివేశారు. గత నెల నుంచి వంట నూనె కూడా పంపిణీకి నోచుకోలేదు. నూనె కొరత ఈ నెల కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పంచదారపై ఇచ్చే రాయితీని కేంద్రం మూడు నెలల క్రితమే నిలిపివేసింది. ఎన్నికల ముందు పంచదార పంపిణీ నిలిపివేయడం మంచిది కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారాన్ని భరి స్తూ ఈ మూడు నెలలూ నెట్టుకొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోకుంటే పంచదార పంపిణీ సైతం నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాక్షాత్తూ అధికారులే అంటున్నారు.
జిల్లాలో సుమారు 12 లక్షల కుటుంబాలు ఈ సరుకులపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.