- డీలర్లతో సర్కారు చర్చలు
- రూ. 10ల యూజర్ చార్జీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు వివిధ పద్ధతుల్లో పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఇకపై రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ కోసం రాష్ట్రంలో ఉన్న 27,176 రేషన్ షాపుల్లో ఈ-పాస్ (బయోమెట్రిక్) పరికరాలు ఏర్పాటు చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ-పాస్ పరికాలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ వారం కిందట ఉత్తర్వులు జారీ చేశారు.
బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నందున వృద్ధాప్య, వికలాంగు, వితంతు, చేనేత పింఛన్లను డీలర్ల ద్వారా పంపిణీ చేస్తే బాగుంటుందని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు వారితో చర్చలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒక్కో లబ్ధిదారునికి పింఛన్ పంపిణీ చేసినందుకు గాను యూజర్ చార్జీ కింద నెలకు రూ.10లు ఇవ్వాలనే డిమాండ్‌ను డీలర్లు తెచ్చారు.ఉపాధి హామీ పథకం పనుల కూలి డబ్బులు కూడా తామే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఈ విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ నెల 20, 21న హైదరాబాద్‌లో సమావేశం కానుంది.