1,00,859 వితంతు పింఛన్ లబ్ధిదారులు
రాష్ట్రంలో 6 శాతం.... వరంగల్‌లో 11 శాతం
జిల్లాలోని మహిళా జనాభా లెక్కన
రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఆందోళన కలిగిస్తున్న మూడు పదుల్లోపే వైదవ్యం...
ఓరుగల్లు మహిళలకు ఒక్కో రంగంలో ఒక్కో చరిత్ర ఉంది. ఉద్యమం.. రాజకీయ నేపథ్యంలో వారిది ప్రత్యేక శైలి. కానీ.. ఇదే గడ్డపై దిగ్భ్రాంతికరమైన విషయం కూడా ఉంది.. అదేమిటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వితంతువులు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడు పదుల వయసు దాటకుండానే వారిని వైదవ్యం వెక్కిరిస్తోంది. జిల్లాలో 11 శాతం వితంతువులు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటున 6 శాతం వితంతువులు ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. దీనికి కారణాల పలు రకాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం మద్యం మహమ్మారేనని జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మాత్రం పెద్దగా లేవని చెప్పొచ్చు. భర్త మరణించిన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి చేతులు దులుపుకుంటే చాలదు.
మూలాల్లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మూడు పదుల్లోపే వైధవ్యం పొందుతున్న విషయంలో మన అపఖ్యాతి మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు.
పింఛన్లలో...
ప్రభుత్వం అందజేసే సామాజిక భద్రతా పింఛన్లు(ఎస్‌ఎస్‌పీ) పొందుతున్న వితంతువుల సంఖ్య జిల్లాలో లక్ష దాటింది. 10 జిల్లాల్లో వితంతు పింఛన్లు పొందుతున్న వారిలో సంఖ్యాపరంగా జిల్లా రెండో స్థానంలో నిలుస్తోంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా మనకన్నా కాస్త ముం దుంది. అయితే అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఈ విష యం ప్రస్తుతం కొత్త పింఛన్ల పంపిణీతో రాష్ట్రస్థాయిలో చర్చకు వస్తోంది. జిల్లాలో అత్యధికంగా వితంతువులు ఉండటంపై పలు స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు సర్వేలు కూడా నిర్వహించాయి.
కబళిస్తున్న గుడుంబా..
2009లో డీఆర్‌డీఏతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ప్రత్యేకంగా వితంతువుల విషయంలో సర్వే చేశాయి. ఇందలో గుడుంబా మరణాలే ఎక్కువ మందిని వితంతువులను చేశాయని సర్వేలు నిర్ధారించా యి. సర్వే లెక్కలో గుర్తిస్తున్న భయంకర నిజాల ఆధారంగా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడంలేదనే విమర్శ వినిపిస్తోంది. కాగా, జిల్లాలో ప్రభుత్వ పింఛన్లు 4,45,030 ఉండగా.. అందులో 1,00,859 మంది వితం తు పింఛన్‌దారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో మొత్తం పింఛన్లు 4,41,603 ఉండగా.. వితంతు పింఛన్లు 1,02,259 ఉన్నాయి.
నా కుటుంబం వీధిన పడింది..
ఈమె పేరు బి.స్వరూప. వయసు 28 ఏళ్లు. హన్మకొండ మండలం వడ్డేపల్లి. భర్త సంజీవ్ ఆటోనడుపు తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక బాబు, పాప. సంతోషంగా సాగుతున్న కుటుం బంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తాగుడుకు బానిసై కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణంతో కుటుంబం వీధిన పడింది. పిల్లల పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగిళ్లలో పాకి పనిచేసి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పటికి 20 సార్లు వితంతు పింఛన్ కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులకు స్వరూప దీన స్థితిపై జాలి కలగలేదు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమంటే.. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటోంది.
ఎక్కువగా ఉన్న మండలాలు
మండలం పేరు వితంతు పింఛన్లు మొత్తం పింఛన్లు
మహబూబాబాద్ 3,104 11,292
మరిపెడ 2,962 11,077
స్టేషన్‌ఘన్‌పూర్ 2,939 13,056
పరకాల 2,667 13,441
కురవి 2,594 9,881
ఆత్మకూరు 2,416 10,580
వర్ధన్నపేట 2,382 8,868
హన్మకొండ 2,346 7,951
హసన్‌పర్తి 2,298 8,567
ధర్మసాగర్ 2,236 10,068