చల్లపల్లి : సామాజిక పింఛన్లు డిసెంబర్ నుంచి పోస్టాఫీసుల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో సోమవారం లబ్ధిదారులు ఆయా కార్యాలయాలకు క్యూ కట్టారు. తొలిరోజు పింఛన్లు అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. డిసెంబర్ నుంచి పోస్టల్ శాఖకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పోస్టల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కొన్ని పోస్టాఫీసులకు పింఛన్లు పంపిణీ చేసే యంత్రాలను అందజేసింది.
జిల్లాలో 3.13 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉండగా, వారిలో 1.25 లక్షలు వృద్ధాప్య, 1.16 లక్షలు వితంతు, 45 వేలు వికలాంగ, 5 వేలు చేనేత, 2 వేలు కల్లుగీత, 20 వేల మంది అభయ హస్తం పింఛనుదారులు ఉన్నారు. గతంలో వీరికి సీఆర్‌పీలు పింఛన్లు అందజేసేవారు. ప్రస్తుతం పోస్టల్ శాఖకు మార్చినా పింఛన్ల సొమ్ము ఆయా ఖాతాలకు జమ కాకపోవడం, లబ్ధిదారుల ఫొటోలు కంపూటర్‌లో అసుసంధానం కాకపోవడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛనుదారులు పోస్టాఫీసుల వద్దనే పడిగాపులు పడ్డారు.
ఈ నెల 7 వరకేనా?
పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మాత్రమే నిర్వహించాలని ఉన్నతాధికారులు పోస్టల్ సిబ్బందిని ఆదేశించినట్టు తెలిసింది. అవి కూడా రోజుకు వంద మందికి మాత్రమే ఇస్తామని అధికారులు, సిబ్బంది ప్రకటించారు. కొన్నిచోట్ల పోస్టాఫీస్ పరిధిలో 2 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. రోజుకు వందమంది చొప్పున పింఛన్లు ఇచ్చేటప్పుడు వీరందరికీ వారం రోజుల్లో ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని పలువురు లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.
తొలిసారిగా పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు తీసుకుంటున్నవారు మూడు ఫొటోలు, ఆధార్, పింఛన్ పుస్తకం జిరాక్సు కాపీలు ఇచ్చిన తరువాత.. వాటిని సరిచూసుకుని సొమ్ము ఇస్తామని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ వారం రోజుల్లో పత్రాల పరిశీలన తతంగం ముగిసేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలల పింఛన్లు కలిపి డిసెంబర్‌లో ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించగా ఈ నెలలో 7వ తేదీ దాటితే పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదని పలువురు పింఛనుదారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ తిప్పించుకునే కంటే రోజులో ఏ ప్రాంతం వారికి పింఛన్లు ఇస్తారో తెలియజేస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
పెన్షన్.. టెన్షన్
Published Tue, Dec 2 2014 4:12 AM | Last Updated on Mon, Oct 22 2018 7:36 PM
Advertisement
Advertisement