పోస్టల్ కవర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పోస్టల్‌శాఖ అధికారులు
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించింది.
తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment