
ఆధార్‌తో బోగస్‌కు తెర
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆధార్ నంబర్ అనుసంధానంతో ప్రభుత్వ పథకాల్లో బోగస్ లబ్ధిదారులకు తెర పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సామాజిక భద్రతా పథకం పింఛన్ల వెరిఫికేషన్, జన్మభూమి- మా ఊరు, నీరు-చెట్టు తదితర వాటి ప్రాధాన్యతలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సందేశాన్ని ఆర్‌డీఓ, తహశీల్దారు, పంచాయతీ కార్యాలయాల్లో లైవ్ టెలీకాస్ట్ చేశారు. కర్నూలులో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయ్‌మోహన్, జేసీ కన్నబాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పింఛన్లు అర్హులకే ఇవాలనే ఉద్దేశంతో పంచాయతీ, వార్డు స్థాయిలో పకడ్బందీ సర్వే చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పురోగతి సాధించామని 100శాతం పూర్తయ్యేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000లకు పెంచుతున్నామన్నారు. అదే రోజు నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా చూడాలన్నారు.