మోక్షమెప్పుడో..? | please increase the subsidy amount | Sakshi
Sakshi News home page

మోక్షమెప్పుడో..?

Published Thu, Jul 10 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

మోక్షమెప్పుడో..?

మోక్షమెప్పుడో..?

ఖమ్మం హవేలి: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సెట్‌కం(యువజన సర్వీసుల శాఖ) ద్వారా అందించే రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు రాలేదు. దీంతో జిల్లాలోని  నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌లో ప్రతి జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో లక్ష్యం నిర్దేశించి అందుకు సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లోని సెట్‌కం కార్యాలయాలకు పంపిస్తారు. దీని ప్రకారం జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తారు. ఆయా మండలాలకు నిర్ణయించిన బ్యాంకు శాఖల వారీగా స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ ఎలా నిర్వహించాలో ఇందులో
 
పొందుపరుస్తారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత కార్యాచరణ ప్రణాళిక వివరాలను జూన్‌లో నిర్వహించే డీఆర్‌సీ సమావేశంలో ప్రవేశపెడతారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత జూలైలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. స్వయం ఉపాధి పొందగోరు నిరుద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల ప్రకారం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారు లోన్ ఖాతా, లబ్ధిదారు ఖాతాలను ప్రారంభించాలి. బ్యాంక్ కాన్సెంట్ ఇచ్చిన తరువాత లబ్ధిదారు ఖాతాలో సబ్సిడీ, లోన్ ఖాతాలో బ్యాంక్ రుణం వేస్తారు. అనంతరం యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది.
 
వచ్చే ఆర్థిక సంవత్సరంపై ప్రభావం..
క్రమపద్ధతి ప్రకారం ప్రక్రియ కొనసాగితే యూనిట్లు గ్రౌండ్ అయ్యేవరకు సంవత్సర కాలం పడుతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఇంకా విధివిధానాలు ఎప్పుడో వస్తాయో కూడా తెలియడం లేదు. ఇంకా ఆలస్యం అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
సబ్సిడీ పెంచితే మేలు..
సెట్‌కం ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు రూ.30 వేలకు మించి సబ్సిడీ ఇవ్వడంలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా యూనిట్‌లో మొత్తం 50 శాతం సబ్సిడీగా ఇస్తున్నారు. సెట్‌కం ద్వారా కూడా 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
 
గత ఏడాది 365 యూనిట్లు గ్రౌండింగ్..
2013-14 ఆర్థిక సంవత్సరంలో సెట్‌కం ద్వారా పరిశ్రమలు, సేవల రంగానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 365 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఈ యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ రూ.3.26 కోట్లు కాగా వీటికి సంబంధించి రూ.1.10 కోట్ల మేర నిరుద్యోగులకు సబ్సిడీ అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement