బీసీ రుణాల్లో భారికోత | BC loans in cuttings | Sakshi
Sakshi News home page

బీసీ రుణాల్లో భారికోత

Published Sat, Feb 6 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

BC loans in cuttings

 స్వయం ఉపాధి బాట పడదామనుకున్న యువత చేతులకు ప్రభుత్వం సంకెళ్లు వేస్తుంది. ఉన్నత చదువులు చదివినా... ఉద్యోగం రాని పురుషులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపినా సర్కార్ వారి ఆశలపై నీళ్లు జల్లుతుంది. బీసీల సంక్షేమానికి హామీ ఇస్తూనే... వారిని సంక్షోభంలోకి నెడుతోంది. వెనుకబడిన తరగతుల యువతకు ఇచ్చే రుణాల్లో కోత విధించింది. బీసీ రుణాలను ఏటా తగ్గిస్తోంది. గతంలో ప్రకటించిన రుణాలు కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు.
 
 మళ్లీ జాబితాలు పంపించాలి
 బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయనున్న యూనిట్లకు మరలా జాబితాలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి, పురపాలక సంఘం అధికారులను కోరాం. గతంలో పంపిన జాబితాను సరిచేసి అందజేయాలని చెప్పాం.- శ్రీహరిరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ
 
 శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాల్లో భారీ కోత విధించింది. చాలా తక్కువ యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితాను మళ్లీ తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించింది. వివరాలు ఇలావున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోని బీసీలకు సంబంధించి 2014-15 సంవత్సరంలో 5547 యూనిట్లను ల క్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను రూ. 1517.60 లక్షలను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. జిల్లాలోని 18,89,535 బీసీ జనాభా నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశిస్తూ అర్హతలను ప్రకటించింది. దీని ప్రకారం బీసీ కో-ఆపరేటివ్ సర్వీస్ లిమిటెడ్ అధికారులకు ఎంపీడీవోల ద్వారా అర్హుల జాబితా అందింది.

జన్మభూమి కమిటీల ఆమోదంతో పంపించాలని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకే అర్హుల దరఖాస్తులను అందించారు. దరఖాస్తులు చేసుకున్న వారంతా త్వరలో రుణాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 70 శాతం మేర కోత పెట్టింది. జిల్లాకు గతంలో కేటాయించిన 5547 యూనిట్లకు గాను 1616 యూనిట్లు మాత్రమే మంజూరు చేయాలని ఆదేశించింది. ఇందుకు రూ. 442 లక్షలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. ఇంత భారీ కోత విధించడంతో అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి నివేదించగా వీరిలో 70 శాతం మందిని ఎలా తొలగించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. కొత్త జాబితాను ఫిబ్రవరి 10లోగా నివేదించాలని సర్కార్ చెప్పడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు.


జాబితా నుంచి తొలగించేవారికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రుణాలు మంజూరునకు ఆమోదం తెలపాలంటే లబ్ధిదారులు కొంత ముట్టజెప్పాలని కొందరు జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లు సాగించారు. ఇటువంటివారంతా ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇప్పటికే ప్రభుత్వం తీరుపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, రుణాల్లో భారీ కోత వల్ల బీసీల నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్ద చెబుతున్నా వారు సైతం చేతులెత్తేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు ప్రకటనలు చేస్తూ లోలోన వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement