నిరుద్యోగులతో ఆటలా..! | unemployment peoples problems with the elections | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులతో ఆటలా..!

Published Wed, May 14 2014 4:37 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

నిరుద్యోగులతో ఆటలా..! - Sakshi

నిరుద్యోగులతో ఆటలా..!

 ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్ : స్వయం ఉపాధి పొందేందుకు బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులతో అధికారులు బంతాట ఆడుతున్నారు. దీంతో ఆర్థిక సంవత్సరం పూర్తయినా నిర్దేశిత లక్ష్యం చేరుకోకపోగా, రుణం మంజూరైన నిరుద్యోగులలో ఇప్పటికి ఒక్కరికి కూడా సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, ఎన్నికల కోడ్‌తో రుణం మంజూరైన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఈనెల 20 వరకు పంపించే అవకాశం లేదు.

అయితే 24లోగా ఆ వివరాలు ప్రభుత్వానికి అందకుంటే సబ్సిడీ వచ్చే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక పోలవరం ముంపు కింద సీమాంధ్రలో కలిసే మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.4 కోట్ల వరకు నిరుద్యోగులకు సబ్సిడీ నిలిచిపోయింది. దీంతో యూనిట్లు  గ్రౌండింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
 
 సంవత్సరమంతా నిర్లక్ష్యం.. చివర్లో నిరుద్యోగులపై ఒత్తిడి...

 బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని 46 మండలాల్లో 2,457 యూనిట్లకు రుణాలివ్వాలని నిర్ణయించారు. ఇందులో రూ.20 వేల యూనిట్లు 544, రూ. 25 వేల యూనిట్లు 927, రూ.30 వేల యూనిట్లు 895, రూ.50 వేల యూనిట్లు 57, రూ. లక్ష విలువైన యూనిట్లు 34 ఇవ్వాల్సి ఉంది. అయితే మొత్తం 2,457 యూనిట్లకు గాను 801 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. అలాగే  జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో 530 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించారు.

ఇందులో రూ.20 వేల యూనిట్లు 149, రూ.25 వేల యూనిట్లు 184, రూ.30 వేల యూనిట్లు 184, రూ.50 వేల యూనిట్లు 5, రూ. లక్ష విలువైన యూనిట్లు 8 ఇవ్వాల్సి ఉంది. కాగా వీటిలో 150 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. సంవత్సరం మొత్తం వృథా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2013 అక్టోబర్‌లో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 2014 ఫిబ్రవరి వరకు అధికారులు వారిని ఇంటర్వ్యూలకే పిలువలేదు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు నెలల తరబడి ఆలస్యం చేశారు.
 
 అప్పటి వరకు నిర్లక్ష్యం చేసి, తీరా ఎన్నికల కోడ్ రావడానికి 10 రోజుల ముందు పిలిచి హడావుడి చేయడంతో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. చివరకు బ్యాంకర్లు కాన్సెంట్లు ఇవ్వడంలో విముఖత చూపడంతో లక్ష్యానికి సుదూరంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు మంజూరు కాకపోవడం గమనార్హం. ఇక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల్లో మొత్తం 1323 మంది నిరుద్యోగులకు 763 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించగా 660 మందికి 652 యూనిట్లు మంజూరయ్యాయి. అలాగే మున్సిపాలిటీల పరిధిలో 2302 మందికి 1292 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం ఉండగా 771 మందికి 763 యూనిట్లు మంజూరు అయ్యాయి.
 
 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి..
 ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు మంజూరైన నిరుద్యోగులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల వివరాల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 20 వరకు పంపించే పరిస్థితి లేదని అధికారులు చెపుతున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల సబ్సిడీని ఇంకా విడుదల చేయకపోవడం పట్ల నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
 ముంచుకొస్తున్న మరో ముప్పు..

 ఎన్నికల కోడ్ కారణంగా నానా అగచాట్లు పడిన నిరుద్యోగులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24 లోగా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 24లోగా తమకు సబ్సిడీ అందకపోతే ఆ తర్వాత వచ్చే పరిస్థితి ఉండదని నిరుద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఇక పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు జూన్ 2 తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానుండడంతో ఆయా మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. వెంటనే సబ్సిడీలు విడుదల చేసి, తమను ఆదుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement